అరటి పండు అందరికీ అందుబాటు ధరలోనే లభిస్తుంది. అద్భుతమైన పోషక గుణాలు కలిగిన పండు ఇది. దీనిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ ఉంటాయి. అరటిపండ్లు మిగతా పండ్లతో పోలిస్తే త్వరగా చెడిపోతాయి. ఇంటికి తెచ్చిన రెండు మూడు రోజుల్లోనే నల్లగా, మెత్తగా మారిపోతాయి. నల్ల మచ్చలు ఏర్పడతాయి. వీటిని తినలే్ పడేసే వారే ఎక్కువ. నిజానికి వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేస్తే నలుపు దనం రాకుండా వారం పాటూ తాజాగా ఉంటాయి. అందుకు కొన్ని సింపుల్ మార్గాలు ఉన్నాయి.
అరటిపండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎరుపు అరటి, కర్పూరవల్లి, ఆకుపచ్చ అరటి వంటి అనేక రకాల అరటిపండ్లు మార్కెట్లో లభిస్తాయి. ఏవి కొన్నా కూడా రెండు మూడు రోజులకే అవి నల్లగా మారడం మొదలవుతాయి. వీటిని తాజాగా ఉంచే చిట్కాలను ఫాలో అయితే ఈ సమస్య రాదు.
అరటి పండు కాండంను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టండి. అరటిపండు మొదలు భాగాన్ని మాత్రమే అల్యూమినియం ఫాయిల్ తో చుట్టాలి. మొత్తం పండుని కాదు. మీ వద్ద ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ లేదా కాగితపు కవరును ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల అరటి పండు త్వరగా పండదు. నల్లగా మారదు. అది ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
చాలా ఇళ్లలో అరటి పండ్లు కొన్నప్పుడు ఏదో ఒక కంటైనర్ లో భద్రపరుస్తారు. ఇలా నిల్వ చేస్తే పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి బదులుగా అరటి పండ్లను గాలిలో వేలాడదీస్తే మంచిది. అంటే అరటి పండ్లకు ఏ వస్తువులు తాకకుండా ఉండేలా గాలిలో ఉంచాలి. కాండంకు తాడు లేదా దారాన్ని కట్టి వంటగదిలో ఎక్కడైనా వేలాడదీయండి.
నాలుగైదు రకాల పండ్లను కొనే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. వాటన్నింటినీ ఒకే పండ్ల బుట్టలో పెడతారు. ఇలా చేస్తే మిగతా పండ్ల నుంచి వచ్కచే వాయువల వల్ల అరటిపండ్లు త్వరగా నల్లగా మారిపోతాయి. అలాగే కూరగాయలతో కూడా కలిపి ఉంచకూడదు. ఆపిల్, టమోటాల నుంచి ఇథిలిన్ వాయువును విడుదల చేస్తాయి. ఇది అరటి పండ్లు త్వరగా పండేలా చేస్తుంది.
అరటిపండ్లకు ఫ్రిజ్ అనువైన ప్రదేశం కాదు. చల్లగా ఉండటం వల్ల పండు పాడైపోతుంది. ఫ్రిజ్ లో ఉంచడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచడమే అన్ని విధాలా మంచిది.
దుకాణం నుంచి పండ్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లనే కొనాలి. బాగా పండిన అరటి పండ్లు కొంటే అవి ఇంటికి తీసుకొచ్చిన ఒక రోజుకే నల్లగా మారిపోవచ్చు. అలాగే ఇతర పండ్లతో కలిపి పెట్టి అమ్ముతున్న అరటి పండ్లను కూడా కొనవద్దు.
అరటిపండ్లు నల్లగా మారి పండిపోతే పడేయాల్సిన అవసరం లేదు. వాటితో స్మూతీలు, మఫిన్లు, బ్రెడ్ వంటి తయారు చేసుకోవచ్చు.
సంబంధిత కథనం