Eyebrow Threading: ఐబ్రోస్ త్రెడింగ్ చేయించుకున్న తర్వాత మంట రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!
Eyebrow Threading: ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత అక్కడ చర్మం కాస్త ఎర్రబడటం, మంట రావడం సహజమే. అయితే కొందరిలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉంటుంది. కనుబొమ్మలు చేయించుకున్న ప్రతిసారీ మీరు కూడా మంట వంటి సమస్యను ఎదుర్కోంటుంటే ఈ హోం రెమెడీస్ మీకు సహాయపడతాయి. ఇవి మీకు త్వరిత ఉపశమనం కలిగిస్తాయి.

అందంగా కనిపించడం కోసం ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఐబ్రోస్ షేప్ చేయించుకుంటున్నారు. అదనంగా పెరిగిన కనుబొమ్మలను కత్తిరించడం, కళ్లకు తగ్గట్టుగా షేప్ చేయించుకోవడం వల్ల మహిళలు మరింత అందంగా కనిపిస్తారు. అయితే ఐబ్రోస్ త్రెడింగ్ చేయించుకున్న తర్వాత చాలా మంది కనుబొమ్మల దగ్గర చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, నొప్పి,మంట వంటి రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యాక్సింగ్ లేదా థ్రెడింగ్ సమయంలో చర్మం సాగదీయడం దీనికి కారణం కావచ్చు. కారణం ఏమైనప్పటికీ దాని ప్రభావం మహిళల ముఖంపై గంటల తరబడి ఉంటుంది. మీరు కూడా ఐబ్రో త్రెడింగ్ చేయించుకున్న ప్రతిసారీ ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుంటే ఈ హోం రెమెడీస్ మీకు చాలా బాగా సహాయపడతాయి. ఇవి ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత వచ్చే మంట, నొప్పి వంటి సమస్యల నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తాయి.
చల్లటి నీరు:
థ్రెడింగ్ తర్వాత చర్మ ఎర్రగా మారడం, చికాకు, నొప్పి, మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. తర్వాత ఐస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం కొన్ని ఐస్ ముక్కలను తీసుకుని గుడ్డలో చుట్టి ప్రభావిత ప్రాంతంలో 15 నిమిషాల పాటు అప్లై చేయండి. ఇది చాలా త్వరగా నొప్పి, మంటను తగ్గిస్తుంది. చర్మం ఎర్రబడటాన్ని తగ్గిస్తుంది.
కలబంద:
కలబంద గుజ్జు చర్మాన్ని చల్లబరచడం ద్వారా వాపు, చికాకు, ఎరుపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ రెమెడీ చేయడానికి తాజా కలబంద జెల్‌ను త్రెడింగ్ చేసిన చోట చర్మంపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇది మంటను తగ్గించడమే కాకుండా దద్దుర్లు, దురద వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
కీరదోసకాయ:
కీరదోసకాయ జ్యూస్ చర్మాన్ని చల్లబరిచి మంట, నొప్పి వంటి సమస్యల నుంచి చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మపు చికాకును తగ్గిస్తాయి. ఈ రెమెడీ చేయడానికి కీరదోసకాయ ముక్కలను కట్ చేసి ప్రభావిత ప్రాంతంలో రుద్దండి లేదా కీరదోసకాయ రసాన్ని తీసి చర్మంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. నిర్ణీత సమయం తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
రోజ్ వాటర్:
చర్మపు మంట, చికాకు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజ్ వాటర్ రెమెడీ చేయాలంటే కొంచెం కాటన్ తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి కాసేపు ఉంచాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల త్రెడింగ్ కారణంగా వచ్చే దురద, దద్దుర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.
ఈ చిట్కాలతో ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ఈ ఇంటి చిట్కాలతోనే మీరు కోరుకునే అందాన్ని సొంతం చేసుకోండి. ఐబ్రో త్రెడింగ్ వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఇలా ఈజీగా బయటపడండి.
సంబంధిత కథనం