Periods Pain: పీరియడ్స్ సమయంలో వస్తున్న నొప్పిని తగ్గించడానికి ఈ పనులు చేయండి
Periods Pain: మహిళ జీవితంలో పీరియడ్స్ ఒక భాగం అయిపోయాయి. ప్రతినెలా పీరియడ్స్ సక్రమంగా వస్తేనే ఆ మహిళ ఆరోగ్యంగా ఉన్నట్టు. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని ఎదుర్కోవడానికి ప్రతి మహిళా సిద్ధంగా ఉండాలి.
Periods Pain: ప్రతి మహిళకు నెలసరులు రావడం సహజం. అలా నెలసరులు సక్రమంగా వస్తేనే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. పునరుత్పత్తి సామర్థ్యం చక్కగా ఉందని అర్థం చేసుకోవాలి. అయితే నెలసరి సమయంలో కొంతమంది స్త్రీలు చాలా ఇబ్బంది పడతారు. వారిని నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. ఆ మూడు రోజులు అసౌకర్యంగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేక పోతారు. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తట్టుకోవడానికి ముందుగానే సిద్ధపడాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ నొప్పులు రాకుండా అడ్డుకోవచ్చు.
వాము ఉపయోగాలు
పీరియడ్స్ సమయంలో కొంతమందికి తీవ్రంగా నొప్పులు వస్తాయి. అలాంటివారు వాముని ఆహారంలో భాగం చేసుకోవాలి. తగ్గించడానికి వాము ఎంతగానో సహకరిస్తుంది. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. నీటిలో వాము గింజలను వేసి వాటిని మరగ కాచి వడకట్టుకోవాలి. ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో కడుపు ఉబ్బరంగా అనిపించడం, తిమ్మిరిగా అనిపించడం, నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు తగ్గుతాయి.
ఇవి తినకండి
పీరియడ్స్ సమయంలో మీరు తినే ఆహారం మీ నొప్పిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక ఆహారాలు తినడం వల్ల నెలసరి నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. నెలసరి సమయంలో పంచదారతో చేసిన ఆహారాలను తినడం మానేయండి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరంగా పెట్టాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, పాలకూర వంటి ఆకుకూరలు, చేపలు తినడం వల్ల నెలసరి నొప్పులు తక్కువగా వస్తాయి.
పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయడం కాస్త కష్టమైన పని. అయితే సాధారణ నడక, సింపుల్ యోగాసనాలు చేయడానికి ప్రయత్నించండి. ఇవి రక్తప్రసరణ శరీరంలో పెంచుతాయి. ఎప్పుడైతే రక్తప్రసరణ సవ్యంగా జరిగిందో... నొప్పి దానంతట అదే తగ్గుతుంది. అలాగే ఇలా వ్యాయామం చేయడం వల్ల ఎండార్పిన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మూడు బూస్టర్ల ఉపయోగపడతాయి.
నెలసరి సమయంలో పొట్టలో నొప్పితో ఇబ్బంది పడేవారు. హీటింగ్ ప్యాడ్‌లను ఉపయోగించుకోవాలి. పొత్తికడుపు దిగువ బాగాన, వీపు దిగువ బాగాన హీటింగ్ ప్యాడ్లను పెట్టుకోవడం వల్ల కాస్త ఆ నొప్పి తగ్గుతుంది. హీటింగ్ ప్యాడ్ లేనివారు వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి... ఆ నీటిని పిండి దానితో దిగువ పొత్తికొడుపు భాగంలో ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆ నొప్పి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సులువైన చిట్కా.
కేవలం నెలసరి సమయంలోనే కాదు మిగతా సమయాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ఏ మహిళలైతే అధికంగా జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, కారం అధికంగా ఉండే ఆహారాన్ని తింటారో... వారికి నెలసరి సమయంలో నొప్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా నెలసరి సమయంలో నొప్పులు రాకుండా అడ్డుకోవచ్చు.