Flax Seeds: అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, అందం కూడా దక్కుతుంది ఇలా చేయండి
Flax Seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కేవలం వీటి వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా దక్కుతుంది. అవిసె గింజలతో ఫేస్ ప్యాక్ లో ప్రయత్నించండి. అనేక చర్మ సమస్యలను ఇది తగ్గిస్తుంది.
Flax Seeds: చర్మం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ గాలి కాలుష్యం, పోషకాహార లోపం వంటి వాటి వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వచ్చేస్తున్నాయి. అలాంటివారు బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అవిసె గింజలతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకొని వాడితే మంచిది. ఈ అవిస గింజల ఫేస్ ప్యాక్ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అందాన్ని తెచ్చిపెడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మానికీ, జుట్టుకూ ఎంతో బలాన్ని ఇస్తాయి.
అవిసె గింజల ఫేస్ ప్యాక్ ఇలా...
ఒక గిన్నెలో నీళ్లు వేసి ఒక స్పూను అవిసె గింజలను వేయాలి. వాటిని ఒక అరగంట పాటు నానబెట్టి స్టవ్ మీద చిన్న మంట మీద ఉడికించాలి. ఆ నీరు ముతకగా జెల్ లాగా అవుతుంది. ఆ జెల్ ని ముఖానికి పట్టించి ఆరే వరకు ఉంచుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఎంతో మంచిది. ఈ అవిసె గింజల ఫేస్ ప్యాక్ వల్ల చర్మంపై ఉన్న వాపు, మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. దద్దుర్లు వంటివి కూడా కనిపించకుండా పోతాయి. సన్నటి గీతలు, ముడతలు వంటివి తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
అవిసె గింజలను పొడిచేసి ఒక డబ్బాలో దాచుకోవాలి. ఒక స్పూన్ అవిసె గింజల పొడిని ఒక చిన్న గిన్నెలో వేయాలి. అందులో ఒక గుడ్డును కొట్టి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ, జుట్టుకు పట్టించుకోవాలి. ఒక అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మెరుపు సంతరించుకుంటుంది. చర్మం కూడా తేమవంతంగా ఉంటుంది.
అవిసె గింజలను నీళ్లలో వేసి నాలుగు గంటల పాటు ఉంచాలి. ఆ నానబెట్టిన అవిసె గింజలను మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టులో కాస్త రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. అవిసె గింజల్లో ఉన్న పోషకాలన్నీ చర్మానికి అంది ప్రకాశవంతంగా మారుస్తాయి. వారానికి రెండు మూడు సార్లు అవిసె గింజల ఫేస్ మాస్క్‌ను ప్రయత్నిస్తే ఎంతో మంచిది.
మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం కూడా చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు, ప్రతిరోజూ అవిసె గింజలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. మన శరీరానికి ఎంతో అత్యవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అవిసె గింజల్లో ఉంటాయి. ఇవి పిల్లలకు, పెద్దలకు, గర్భిణులకు చాలా అవసరం. అవిసె గింజలతో చేసుకుంటే రోజుకో లడ్డును తినవచ్చు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
టాపిక్