Relationship tips: భర్త ఇంటికి రాగానే ఈ 5 పనులు చేయకండి.. ప్రేమ తగ్గుతుంది-five things wife should not discuss with husband after work ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship Tips: భర్త ఇంటికి రాగానే ఈ 5 పనులు చేయకండి.. ప్రేమ తగ్గుతుంది

Relationship tips: భర్త ఇంటికి రాగానే ఈ 5 పనులు చేయకండి.. ప్రేమ తగ్గుతుంది

Relationship tips: రోజంతా అలిసిపోయిన భర్తతో ఇంటికి రాగానే భార్య మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. వీటివల్ల బంధం బలహీన పడుతుంది.

భర్తతో భార్య మాట్లాడకూడని 5 విషయాలు (shutterstock)

ప్రేమ, గౌరవం, నమ్మకం అనే పునాదులపైనే వివాహ బంధం ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటీ లోపించినా బంధం సమస్యలతో, బాధతో నిండిపోతుంది. ఈ అందమైన సంబంధం విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. చాలా ఇళ్లలో భార్యాభర్తల మధ్య వాదోపవాదాలకు కారణం దైనందిన జీవితానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలే. పరస్పర అవగాహనతో సకాలంలో పరిష్కరించుకోకపోతే ఆ తర్వాత అది పెద్ద గొడవలకు దారితీస్తుంది.

ఇప్పుడు ఇంటిని చక్కబెట్టుకోడానికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా కష్టపడుతున్నారు. ఇంటికొచ్చాక ఆనందంగా ఉండాలి అనుకుంటారు తప్ప గొడవలంటే ఇష్టపడరు. ముఖ్యంగా భార్య నుంచి ఈ 5 విషయాలు వినడానికి ఇష్టపడరు. అవేంటో తెల్సుకోండి.

ఫిర్యాదుల పెట్టెలాగా:

ఇంటికొచ్చిన వెంటనే చెడు విషయాలు, ఫిర్యాదులు వినడానికి ఏ భర్త ఇష్టపడడు. కుటుంబానికి సంబంధించినవైనా, బయటి విషయాలైనా ఈ సమయంలో మాట్లాడకండి. ఒకవేళ మీ ముందు అర్థం చేసుకున్నట్లున్నా కూడా వాళ్లకు మీరిలా మాట్లాడటం ఆనందం మాత్రం ఇవ్వదు. కాబట్టి ఈ తప్పు చేయకండి. ఈ విషయాలు చర్చించడానికి కాస్త ఓపిక పట్టి సరైన సమయం చూసి చర్చించండి. రాగానే ఫిర్యాదులన్నీ గడగడా చెప్పేయకండి.

ఇంటి పనుల చెప్పడం:

ఆఫీసు నుంచి ప్రయాణించి ఇంటికి వచ్చిన భర్తకు రాగానే సామాన్ల లిస్టు చేతిలో పెట్టొద్దు. కనీసం ఇంట్లోకి రాకముందే బయటికి వెళ్లమనకండి. దీంతో చికాకుగా అనిపిస్తుంది. మీకు ఏం కావాలో ముందుగానే తెలియజేయండి. ప్లానింగ్ ప్రకారం అన్నీ తీసుకొస్తారు. రాగానే బయటకు పంపాలని చూడటం సరికాదు. ఆనందంగా చేసే పనుల్ని కూడా చేయడం ఆపేస్తారు.

ఫోన్ వాడటం:

అవసరమున్నంత వరకు మాత్రమే ఫోన్ మాట్లాడాలి కానీ అదొక వ్యసనం అవ్వకూడదు. ఇంటిపనులన్నీ పక్కన పడేసి రోజంతా ఫోన్లు మాట్లాడటం సరికాదు. ఇక భర్త వచ్చాక కూడా అలాగే ఫోన్ మాట్లాడుతూ ఉండడం మరో పెద్ద తప్పు. వాళ్లు రాకముందే ఫోన్ పక్కన పడేయాలి. వాళ్ల రాకకు మీరు విలువిస్తున్నట్లు దీనర్థం. పని నుంచి రాగానే టీ తాగుతూ ఇద్దరూ హాయిగా మాట్లాడుకోవాలని మీ భర్త కోరుకుంటారు. స్నేహితులకు, పేరెంట్స్ తో ఫోన్ మాట్లాడటానికి ఈ సమయాన్ని వాడకండి.

ఆలస్యంగా వస్తే ప్రశ్నించడం:

ఆఫీసు నుంచి బయటకు రాగానే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం వల్ల అప్పటికే చిరాగ్గా ఉన్న భర్తను ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించొద్దు. ఆ ప్రశ్న వల్ల మరింత చికాకు అనిపిస్తుంది వాళ్లకి. రాగానే ఆ ప్రశ్న అడగడం సరికాదు. ఆలస్యంగా రావడానికి కారణమేంటో వాళ్లే మెల్లగా చెబుతారు.

ఉపన్యాసాలు వద్దు:

ప్రతిరోజూ ఆఫీసులో అంతా మంచిగానే జరగాలని లేదు. ఒక్కోసారి వాటివల్ల మూడ్ పాడవ్వచ్చు. ఒత్తిడిగా అనిపించొచ్చు. దానివల్ల కొంచెం చికాకుగా, కోపంగా, వింతగా ప్రవర్తిస్తుంటే కాస్త ఓపిగ్గా ఉండండి. వాళ్లు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారేమో ఓపిగ్గా వినండి. వాళ్ల స్థితిని అర్థం చేసుకోండి. మీరు వాళ్ల మాటలు, బాధ వినాలని కోరుకుంటారు మీ భర్త. అంతే తప్ప పూర్తిగా వినకుండా మీకు తోచింది మాట్లాడకండి, ఉపన్యాసాలు ఇవ్వకండి. చాలాసార్లు భాగస్వామిని విమర్శించకుండా కూడా తన మాట వినాలని ఎవరైనా కోరుకుంటారు. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు వారికి సహాయం చేస్తారు.