Burnout: బర్న్ అవుట్ గురించి మీ శరీరం చెప్పే 5 సంకేతాలు, ఒకసారి జాగ్రత్తగా రివ్యూ చేసుకోండి
Burnout: కోవిడ్-19 నుంచి బర్న్ అవుట్ గురించి భారత్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. దీర్ఘకాలిక అలసట, అంతరాయం కలిగించే నిద్ర వరకు అంతర్లీనంగా బర్న్ అవుట్ లక్షణాలు ఉంటాయి. మనం బర్న్‌అవుట్‌కి గురవుతున్నామని మన శరీరం కొన్ని సంకేతాల ద్వారా చెప్తుంది.
Symptoms of Burnout: ఒత్తిడి భరించలేని స్థాయికి చేరినప్పుడు ‘బర్న్ అవుట్’ అవుతుంటారు. కరోనా తర్వాత ఈ బర్న్ అవుట్ పదం ఎక్కువగా భారత్‌లో వినిపిస్తోంది. అందరిపై చిరాకు పడటం, పదే పదే కోపం తెచ్చుకోవడం, అన్నింటికీ తరచూ నిరుత్సాహపడటం చేస్తుంటే వాళ్లు బర్న్ అవుట్ అంచున ఉన్నారని అర్థం చేసుకోవాలి. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ తీవ్రంగా ఒత్తిడికి గురయ్యే వారిలో బర్న్ అవుట్ కనిపిస్తుంటుంది.
ఈ బర్న్ అవుట్ గురించి సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, సైకోథెరపిస్ట్ డాక్టర్ అలీషా లాల్జీ మాట్లాడుతూ ‘బర్న్అవుట్ అనేది ఒత్తిడి వల్ల కలిగే భావోద్వేగ, మానసిక, శారీరక అలసట స్థితి. ఇది ఒక్క ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు పర్సనల్ లైఫ్‌లోనూ మన చేసే పనులు, మితిమీరిన బాధ్యతలు, టెన్షన్స్ కారణంగా ఏర్పడవచ్చు’’ అని వెల్లడించారు.
బర్న్ అవుట్‌కి సమీపిస్తున్నారని శరీరం చెప్పే 5 సంకేతాలు ఇవి
రాత్రి పూట తగినంతగా నిద్ర పోయిన తర్వాత కూడా మీరు నిరంతరం అలసిపోయినట్లు కనిపిస్తుంటారు. రోజువారీ కార్యకలాపాలు చేయడానికి కూడా చాలా అలసటగా అనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో యాక్టీవ్‌గా ఉండటానికి కష్టపడాల్సి వస్తుంది. మెడ, భుజాలు లేదా వెనుక భాగంలో నొప్పితో పాటు నిరంతర తలనొప్పి వేధిస్తుంటుంది.
నిద్రాభంగం
బర్న్ అవుట్‌కి దగ్గరగా ఉండేవారు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోలేరు. పదే పదే మెలకువ వస్తుంటుంది. దాంతో ఉదయం కూడా అశాంతితోనే నిద్రలేస్తారు. ఓవరాల్‌గా మీ నిద్రాభంగంతో మీ రోజువారి దినచర్య కూడా దెబ్బతింటుంది. దాంతో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో గొడవలు పడతారు.
అజీర్ణ సమస్యలు
బర్న్ అవుట్‌కి మరో సంకేతం ఆకలి లేకపోవడం లేదా వాళ్లపై వాళ్లే కోపంతో అతిగా తినడం చేస్తుంటారు. దాంతో వికారం, మలబద్ధకం, విరోచనాలు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఏం తింటున్నామో.. ఎంత తింటున్నామో కూడా బర్న్ అవుట్‌కి దగ్గరగా ఉండేవారు పట్టించుకోరు.
తరచూ అనారోగ్యం
బర్న్ అవుట్ అంచున ఉన్న వారికి తరచూ జలుబు లేదా అంటు వ్యాధులు లేదా ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మీలో పెరిగిన సున్నితత్వం కూడా బర్న్ అవుట్‌కి సంకేతం. దీర్ఘకాలిక ఒత్తిడి, అలసట కారణంగా మీ రోగనిరోధక శక్తి కూడా బలహీనపడవచ్చు. దాంతో ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు వచ్చి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇబ్బందులు తప్పవు.
అందరి నుంచి దూరంగా
బర్న్ అవుట్‌కి దగ్గరవుతున్న వారు అందరి నుంచి దూరంగా ఉంటారు. పని చేయడానికి ఇష్టపడరు. దాంతో డెడ్‌లైన్ లోపు వర్క్‌ను ఫినిష్ చేయకుండా కాలయాపన చేస్తుంటారు.
బర్న్ అవుట్ జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీస్తుంది. చివరికి మనతో కలిసి పనిచేసే ఉద్యోగుల పేర్లని కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. మీలో ఈ బర్న్ అవుట్ సంకేతాలు కనిపిస్తే సాధ్యమైనంత తొందరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
నిరాకరణ: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇస్తున్నాం. వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితి గురించి ఏవైనా మీకు సందేహాలుంటే వైద్యుల సలహాలు తీసుకోండి.