Breakfast | హై ప్రోటీన్​ కలిగిన బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు.. తయారుచేయడం చాలా తేలిక-five high protein healthy breakfast recipes is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Five High Protein Healthy Breakfast Recipes Is Here

Breakfast | హై ప్రోటీన్​ కలిగిన బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు.. తయారుచేయడం చాలా తేలిక

HT Telugu Desk HT Telugu
Mar 23, 2022 08:40 AM IST

రోజు తినే బ్రేక్​ఫాస్ట్​కు మీకు బోర్ కొట్టిందా? వాటికి బాయ్ బాయ్ చెప్పి కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? కొత్తగా ట్రై చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.. తక్కువ టైంలో వండుకునే రెసిపీల గురించి చూస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. మీ బ్రేక్ ఫాస్ట్​లో హై ప్రోటీన్ అందించే వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్
హెల్తీ బ్రేక్ ఫాస్ట్

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. కానీ మనలో కొంతమంది దానిని ఇగ్నోర్ చేస్తారు. రోజు తినే బ్రేక్​ఫాస్ట్​ మీద విరక్తి రావడమో.. లేక సమయంలేక తయారు చేసుకోకపోవడమో జరుగుతుంది. దీనివలన బ్రేక్​ఫాస్ట్​కు బ్రేక్ ఇస్తారు. అది చాలా తప్పు అంటున్నారు నిపుణులు కారు స్టార్ట్ అవడానికి ఇంధనం ఎంత అవసరమో.. శరీరానికి కూడా మిగిలిన రోజులలో బ్రేక్​ఫాస్ట్ అవసరమని చెప్తున్నారు. చాలా మంది ప్రోటీన్-రిచ్ అల్పాహారం సిద్ధం చేయడానికి గంటలు పడుతుందని అనుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటే ఈ బ్రేక్​ఫాస్ట్​లు మీకు ఉపయోగపడతాయి. హై ప్రోటీన్ కలిగిన ఈ అల్పాహారాలు మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతాయి. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

1. మూంగ్ దాల్ టోస్ట్

కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు, దాల్చినచెక్క, ఎర్రమిరపకాయ, లవంగాలు, ఆవాలు, ఉప్పు, తురిమిన కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, ఉల్లిపాయ, నిమ్మరసం, పంచదార. చక్కెరలోని తీపి డిష్ రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ.. మీరు చక్కెరను వాడొద్దు అనుకుంటే.. దానిని తేనేతో భర్తీ చేయండి.

తయారీ విధానం

మసాలా దినుసులతో పప్పు ఉడికించి, తురిమిన కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, ఉల్లిపాయ, నిమ్మరసం, పంచదార లేదా తేనేను కలపండి. ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసుల మధ్య ఫిల్లింగ్ చేసి, శాండ్‌విచ్‌ను కొద్దిగా వెన్నతో టోస్ట్ చేయండి. వేడివేడిగా లాగించేయండి.

2. పనీర్ టిక్కా టోస్ట్

కావాల్సిన పదార్థాలు

పనీర్ -1/2 కప్, 3 టేబుల్ స్పూన్లు- పెరుగు, 2 టేబుల్ స్పూన్ -శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ -మిరప పొడి, 1/2 టేబుల్ స్పూన్ -మిరియాలు, చిటికెడు- పసుపు, ఉప్పు- తగినంత, ఉల్లిపాయ- అరకప్పు తరిగినవి, క్యాప్సికమ్-1, బ్రెడ్- 2 స్లైస్

తయారీ విధానం

ముందుగా ఒక పెద్ద గిన్నెలో పెరుగు, శెనగపిండి, అన్ని మసాలా దినుసులు కలపాలి. ఆపై పనీర్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ జోడించండి. 10 నిమిషాలు పక్కన పెట్టండి. అనంతరం బాణలిలో కొంచెం నూనె వేసి, ఆపై మ్యారినేట్ చేసిన పనీర్ జోడించండి. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత బ్రెడ్‌పై పనీర్‌ టిక్కా వేసి బ్రెడ్‌ను గ్రిల్‌ చేయాలి. పూర్తయిన తర్వాత.. గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సరి.

3. ఎగ్ మసాలా టోస్ట్

కావాల్సిన పదార్థాలు

గుడ్లు, జీలకర్ర, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, నల్ల మిరియాలు, ఎర్ర మిరపకాయ పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రెడ్, ఉల్లిపాయలు, టొమాటోలు, క్యాప్సికమ్‌, పాలు.

తయారీ విధానం

గుడ్లు పగలగొట్టి.. దానిలో మసాల దినుసులు వేసి బాగా కలపాలి. దానిలో పాలు, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. తరువాత పాన్​లో వెన్న వేసి వేడి చేయాలి. గుడ్ల మిశ్రమంలో బ్రెడ్​ను ముంచి.. దానిని పాన్​లో వేసి టోస్ట్ చేయాలి. సింపుల్ బ్రేక్​ఫాస్ట్​ రెడీ అయిపోయినట్లే.

4. మష్రూమ్ టోస్ట్

కావాల్సిన పదార్థాలు

2 కప్పులు - పుట్టగొడుగు(తరగాలి), 10-12- వెల్లుల్లి (తరగాలి), 1- గుడ్డు, నల్ల మిరియాలు- తగినంత, ఉప్పు- తగినంత, కారం-తగినంత, 1-2 టీస్పూన్- వెన్న, మల్టీగ్రెయిన్ బ్రెడ్ -1 స్లైస్

తయారీ విధానం

పాన్‌ను వేడి చేసి.. దానికి వెన్న జోడించండి. వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాసేపు వేయించాలి. దానికి మష్రూమ్ వేసి అవి మెత్తగా, లేత బంగారు రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. ఉప్పు, నల్ల మిరియాలు వేసి కలపాలి. మరొక పాన్ తీసుకుని.. దానిలో ఆమ్లెట్​గా వేయాలి. బ్రెడ్ స్లైస్ తీసుకుని, దానిపై సాటెడ్ మష్రూమ్, తురిమిన చీజ్ జోడించండి. పైన ఉడికించిన గుడ్డు వేసి సర్వ్ చేయండి.

5. చీజీ ఎగ్ టోస్ట్

కావాల్సిన పదార్థాలు

గుడ్లు, పాలు, ఉల్లిపాయలు, టొమాటో, క్యాప్సికమ్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వెన్న.

తయారీ విధానం

ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి పాలు, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్, కొత్తిమీర ఆకులు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా గిలకొట్టండి. పాన్ వేడి చేసి.. దానిపై వెన్న వేయండి. అనంతరం గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. దానిపై రెండు బ్రెడ్ ముక్కలను ఉంచి.. రెండువైపులా ఉడికించాలి. బ్రెడ్ వెలుపల ఉన్న ఆమ్లెట్ అదనపు భాగాన్ని టక్ చేసి.. బ్రెడ్ స్లైస్‌పై చీజ్ స్లైస్ వేసి, మరొకదానితో కప్పి, చీజ్ కరిగే వరకు కాసేపు ఉడికించాలి. చీజ్ ఎగ్​ టోస్ట్ రెడీ అయినట్లే .

ఈ ఐదు అల్పాహారాలు తయారు చేయడం ఎంత సింపుల్​గా చేయొచ్చో తెలుసుకున్నారుగా.. మీరు వీటిని ప్రయత్నించండి.

WhatsApp channel