20 కిలోలు తగ్గాలంటే ఈ 10 త్యాగాలు చేయాల్సిందే.. వెయిట్ లాస్ కోచ్ సలహాలివే-fitness coach 10 realistic sacrifices to lose 20kg ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  20 కిలోలు తగ్గాలంటే ఈ 10 త్యాగాలు చేయాల్సిందే.. వెయిట్ లాస్ కోచ్ సలహాలివే

20 కిలోలు తగ్గాలంటే ఈ 10 త్యాగాలు చేయాల్సిందే.. వెయిట్ లాస్ కోచ్ సలహాలివే

HT Telugu Desk HT Telugu

బరువు తగ్గడం అంత సులువు కాదు. దానికి క్రమశిక్షణ, నిబద్ధత చాలా ముఖ్యం. దీనికోసం కేవలం తినే ఆహారాన్ని తగ్గించుకోవడమే కాదు.. కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే (Freepik)

బరువు తగ్గే ప్రయాణంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వెయిట్ లాస్ కోచ్ అమకా, నాలుగు నెలల్లోనే 25 కిలోలు తగ్గి అద్భుతమైన మార్పును సాధించారు. ఆమె తన అనుభవం నుండి "బరువు తగ్గడానికి చేయాల్సిన త్యాగాలు" అంటూ కొన్ని సలహాలను పంచుకున్నారు.

వెయిట్ లాస్ కోచ్ పంచుకున్న అనుభవాలు

జూలై 7న అమకా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "3 నెలల్లో 20 కిలోలు తగ్గడానికి మీరు చేయాల్సిన వాస్తవిక త్యాగాలు" అనే శీర్షికతో కొన్ని సలహాలు ఇచ్చారు.

1. షుగర్ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి

సోడా, మాల్ట్, తీపి జ్యూస్‌లు, ఆల్కహాల్ వంటి షుగర్ డ్రింక్స్‌లో చాలా ఎక్కువ కేలరీలు దాగి ఉంటాయి. ఇవి బరువును వేగంగా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లు, గ్రీన్ టీ, జింజర్ లెమన్ వాటర్, డీటాక్స్ టీ వంటివి తాగడం మంచిది.

2. కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించండి

వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, వేయించిన స్నాక్స్, అధికంగా అన్నం తినడం వంటి కార్బోహైడ్రేట్లు బరువు తగ్గడాన్ని నెమ్మది చేస్తాయి. బదులుగా ప్రోటీన్, కూరగాయలు, ఆరోగ్యకరమైన కాంప్లెక్స్ కార్బ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టండి. మీ నడుము చుట్టుకొలత తగ్గుతుంది.

3. రాత్రి పూట చిరుతిండ్లకు ముగింపు పలకండి

రాత్రి 10 గంటలకు తినే బిస్కెట్ లేదా జ్యూస్ వంటి చిరుతిండ్లు పొట్ట కొవ్వును పెంచుతుంది. రాత్రి భోజనం తర్వాత నీళ్లు లేదా డీటాక్స్ డ్రింక్స్ తప్ప మరేమీ తినకూడదని ఒక టైమ్ పెట్టుకోండి.

4. బయటి ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ తగ్గించండి

బయటి ఆహారం ఆకర్షణీయంగా ఉన్నా, అవి అనవసరమైన కేలరీలను మీ శరీరానికి చేర్చుతాయి. ఇంటి వద్దే వండుకోవడం నేర్చుకోండి. ఇది కేలరీలను, డబ్బును ఆదా చేస్తుంది.

5. నడవడం, ఎక్కువ కదలడం అలవాటు చేసుకోండి

రోజుకు కనీసం 10,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోండి. భోజనం తర్వాత నడవండి. మెట్లు ఎక్కండి. ఇంట్లో డ్యాన్స్ చేయండి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

6. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించండి

వారానికి 2-3 సార్లు బరువులు ఎత్తడం లేదా బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం బిగుతుగా మారి, మొండి కొవ్వును, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.

7. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలుపెట్టండి

ఇది కేలరీలను సహజంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. మీ జీవనశైలిని బట్టి 16:8 లేదా 18:6 గంటల ఫాస్టింగ్ విండోలను ప్రయత్నించండి.

8. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌ను వదిలేయండి

బిస్కెట్లు, కుకీలు, క్యాండీలు మీ శరీరానికి ఏమాత్రం ఉపయోగపడవు. వీటికి బదులుగా నట్స్, పండ్లు లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి.

9. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి

నిద్రలేమి వల్ల ఆహారంపై కోరికలు పెరుగుతాయి. అతిగా తినడం స్టార్ట్ చేస్తారు. దీంతో పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. బాగా నిద్రపోతే మీ శరీరం బాగా కోలుకుంటుంది, ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

10. ప్రలోభాలకు మానసికంగా సిద్ధంగా ఉండండి

కుటుంబ కార్యక్రమాలు, విందులు, పార్టీలు మిమ్మల్ని పరీక్షిస్తాయి. అటువంటి సమయాల్లో 'వద్దు' అని చెప్పడం లేదా తెలివిగా ఎంచుకోవడం నేర్చుకోవాలి. అక్కడే నిజమైన ఫలితాలు కనిపిస్తాయి.

(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.