Fish in Banana Leaf: అరటి ఆకులో ఇలా చేప వేపుడు ఇలా చేసేయండి, ఈ రెసిపీ చాలా సులువు
Fish in Banana Leaf: అరటి ఆకులో చేసే చేప వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ చాలామంది ఇలా వండడం కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని చేయడం చాలా సులువు. అరటి ఆకులో చేప వేపుడు రెసిపీ ఇదిగో.
Fish in Banana Leaf: కేరళలో ఫేమస్ వంటకం చేప ఫ్రై. పచ్చని అరటి ఆకుల్లో చేపలు, వివిధ మసాలాలు కలిపి మూటలా కట్టి పెనంపై కాల్చడం లేదా ఓవెన్ లో ఉడికించడం చేస్తూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కేరళలో ఏ ఇంటికెళ్లినా ఈ వంటకం తరచూ కనిపిస్తుంది. అయితే మనం దీన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. రుచి కూడా అదిరిపోతుంది. దీన్ని సులువుగా ఇంటి దగ్గర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
అరటి ఆకుల్లో చేపల ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు - 300 గ్రాములు
అరటి ఆకులు - రెండు
పచ్చిమిర్చి - రెండు
నిమ్మరసం - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
పెరుగు -పావు కప్పు
కారం - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
అరటి ఆకులో చేప ఫ్రై రెసిపీ
1. చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే అరటి ఆకులను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు, నూనె, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి... అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
4. వాటిని చేప ముక్కలకు బాగా పట్టించాలి. అరటి ఆకుల్లో ఒక్కొక్క చేప ముక్కను విడివిడిగా చుట్టుకోవాలి.
5. ఇందుకోసం దానికి సరిపడా అరటి ఆకుల్ని ముందుగానే ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
6. ఇలా చేప ముక్కలను విడివిడిగా అరటి ఆకుల్లో చుట్టుకోవాలి ఒక్కో చేప ముక్కకు రెండు పొరలుగా అరటి ఆకులు చుట్టాలి.
7. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి.
8. పెనం మీద ఈ అరటి ఆకులతో చుట్టిన చేప ముక్కలను ఉంచి పైన మూత పెట్టాలి.
9. చిన్న మంట మీద కాల్చాలి లేదా రోటీలు కాల్చుకునే గ్రిడ్ ఉన్నా కూడా దానిమీద పెట్టి కాల్చుకున్నా బాగుంటాయి.
10. ఓవెన్ లో గ్రిల్ చేసుకున్నా చేప వేపుడు టేస్టీగా వస్తుంది.
11. ఒక్కసారి దీన్ని చేసుకుని తిన్నారంటే రుచి అదిరిపోతుంది.
12. ముఖ్యంగా మనం నూనెలో డీప్ ఫ్రై చేయట్లేదు. కనుక చేపలోని పోషకాలు అన్ని అలానే ఉంటాయి.
13. ఈ చేప తినడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు సమృద్ధిగా శరీరంలోకి చేరుతాయి.
చేపల్లో మనకి అవసరమైన ఎన్నో అత్యవసర పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి, కాల్షియం అధిక మోతాదులో లభిస్తాయి. చేపలు తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డిప్రెషన్, ఒత్తిడి తట్టుకునే శక్తి వస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి వారంలో కనీసం చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకు చికెన్, మటన్ పెట్టకపోయినా చేపలను కచ్చితంగా పెట్టండి. అది మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వారి మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే మెదడు అభివృద్ధికి చేపల్లోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.