జుట్టు పెరుగుదలకు ఏ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయో, వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి-find out which ayurveda herbs work wonders for hair growth and how to use them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జుట్టు పెరుగుదలకు ఏ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయో, వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి

జుట్టు పెరుగుదలకు ఏ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయో, వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

జుట్టు పెరుగుదలకు కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటి జాబితాను ఇక్కడ ఇచ్చాము. వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి.

జుట్టును పెంచే ఆయుర్వదే మూలికలు (Pixabay)

జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు వాడడం ద్వారా వెంట్రుకలను కాపాడుకోవచ్చు. ఆయుర్వేద మూలికలైన జిన్సింగ్, గ్రీన్ టీ, భ్రింగరాజ్, అవిసె గింజలు వంటివి జుట్టును కాపాడుతాయి. వీటన్నింటినీ ఇంట్లోనే చాలా సులువుగా ఉపయోగించవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆయుర్వేద మూలికలు ఇవన్నీ.

జిన్సింగ్

ఆయుర్వేద షాపుల్లో ఇక్కడ చెప్పిన పదార్థాలు దొరుకుతాయి. జిన్సింగ్ కూడా ఒక అద్భుతమైన మూలిక. ఇది తలపై ఉన్న చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కుదుళ్లను, వేళ్ళను బలోపేతం చేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు మందంగా పెరిగేలా సహాయపడతాయి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగడంతో పాటు ఆ మిగిలిన గ్రీన్ టీ పొడిని తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.

భ్రింగరాజ్

భ్రింగరాజ్ అనేది ఆయుర్వేద మూలికల్లో రారాజుగా చెప్పుకోవచ్చు. దీంట్లో జుట్టును కాపాడే లక్షణాలు చాలా ఎక్కువ. ఈ మూలికలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అధికంగా ఉంటాయి. కాబట్టి భ్రింగరాజ్ ను ఆయుర్వేద షాపుల నుంచి కొన్ని తెచ్చుకొని ఇంట్లో వాడవచ్చు.

అవిసె గింజలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవిసె గింజల్లో అధికంగా ఉంటాయి. జుట్టుని మెరుపులా, పట్టుకుచ్చుల్లా మార్చే లక్షణం కూడా అవిసె గింజలకు ఉంది. ఇవి వెంట్రుకలను పోషిస్తాయి. వెంట్రుకలు చిట్లి పోకుండా కాపాడతాయి.

కలబంద, కొబ్బరినూనె, పిప్పర్ మింట్ ఆయిల్, అల్లం, మునగాకు, ఉసిరికాయలు ఇవన్నీ కూడా మన జుట్టుకు మేలు చేసే మూలికలే. ఇవి జుట్టును హైడ్రేషన్ గా ఉండేలా చేస్తాయి. తలకు రక్తప్రసరణ జరిగే జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తాయి. జుట్టును కండిషన్ చేసి బలంగా పెంచుతాయి.

వీటిని ఎలా వాడాలి?

జిన్సింగ్ సప్లిమెంట్లను జుట్టు రాలడానికి చికిత్సగా తీసుకోవచ్చు. లేదా ఆ సప్లిమెంట్లను పేస్టు రూపంలో చేసి తలకు పూయవచ్చు. ఆయుర్వేద నిపుణులు ఎలా చెబుతారో అలా జిన్సింగ్ ఉపయోగించడం మంచిది.

భ్రింగ్ రాజ్ నూనె ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. అలాగే భ్రింగరాజ్ పొడి కూడా దొరుకుతుంది. భ్రింగరాజ్ నూనెతో తలకు మసాజ్ చేయడం, భ్రింగరాజ్ పొడిని నీటిలో వేసి పేస్టులా చేసి హెయిర్ మాస్కులా వేసుకోవడం వంటివి చేయాలి. వారానికి రెండుసార్లు చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గ్రీన్ టీ రసాన్ని తలకి పట్టించి బాగా వాష్ చేసుకోవాలి. అలాగే అల్లం రసాన్ని కూడా తలకు పట్టించి అరగంట పాటు వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇక అవిసె గింజలను నీటిలో వేసి బాగా నానపెట్టి అది జిగటలాగా వచ్చేవరకు ఉంచాలి. ఆ తర్వాత ఆ జెల్ ను జుట్టుకు పోసి మాస్కులాగా వేసుకోవాలి. తర్వాత తలకు స్నానం చేసుకోవాలి. ఉల్లిపాయ రసం తలకు రాసుకోవడం అలాగే ఉసిరి నూనెతో తలకు మసాజ్ చేయడం వంటివి కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. వేప ఆకులను నీటిలో మరిగించి, చల్లబరిచి ఆ నీటితో తలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. కొబ్బరి నూనెలో కలిపి తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలలో వేగం కనిపిస్తుంది.

పైన చెప్పిన మూలికలన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. వాటిని ఆయుర్వేద నిపుణుల సాయంతో వాడేందుకు ప్రయత్నించండి. మీకు నెల రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపించడం ఖాయం.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం