Friday Motivation: సమస్యలకు ఎదురెళ్లి పోరాడండి, ఆ సమస్యలే భయపడి పారిపోతాయి, అందుకు ఇతని విజయ గాథే ఉదాహరణ
Friday Motivation: ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కానీ కొంతమంది సమస్యను తట్టుకొని నిలబడితే.. మరికొందరు ఆ సమస్య నుంచి పారిపోతారు. ఎప్పుడైతే మీరు కష్టాలకు ఎదురు వెళతారో అవి మీ నుంచి దూరం అవుతాయి.
Friday Motivation: తమిళనాడులోని చెన్నై శివారులో ఉంటుంది మడిపాక్కం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో శరత్ బాబు ఏలుమలై అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. అతని తండ్రి ఎప్పుడో మరణించాడు. అతనికి నలుగురు అక్కా చెల్లెళ్లు కూడా ఉన్నారు. తల్లి దీపా రమణి. ఒక రోజులోనే మూడు రకాల ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని సాకడం ప్రారంభించింది .
ఐదుగురు పిల్లలున్న కుటుంబాన్ని పోషించడం అంటే అది మామూలు విషయం కాదు. ఉదయం ఇడ్లీలు చేసి శరత్ బాబుకు ఇచ్చేది. ప్రభుత్వ పాఠశాలలోనే శరత్ బాబు చదువుతుండేవాడు. వాటిని అమ్మి స్కూల్‌కి వెళ్లేవాడు, అక్కడ మధ్యాహ్న భోజనం తిని ఎన్నో రోజులు కష్టపడి చదువుకున్నాడు. ఆమె తల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా వండేది. సాయంత్రమైతే మరో పాఠశాలకు వెళ్లి ఆయాగా పనిచేసేది. ఇలా తల్లి కష్టాలను చూస్తూ పెరిగాడు.
శరత్ బాబుకు ట్యూషన్‌కు వెళ్లే స్తోమత కూడా లేదు. అయినా చదువే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేశాడు. కేవలం ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వింటూ ఇంటిదగ్గర చదువుతూ ఎక్కువ మార్కులు సాధించాడు. తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్లో కూడా చదువు తప్ప ఆయనకు మరో ధ్యాస లేదు. ఇంట్లో తినడానికి లేకపోయినా పుస్తకాలు చదువుతూ పొట్ట నింపుకున్నాడు. ఆయన కష్టం ఊరికే పోలేదు. ఇంటర్ పూర్తయ్యాక బిట్స్ పిలానీలో సీటు వచ్చింది.
బిట్స్ పిలానీలో చదువు తప్ప మరో లోకం లేదు. కెమికల్ ఇంజనీరింగ్ అక్కడే పూర్తి చేశాడు. వెంటనే ఉద్యోగం వచ్చింది. ఒక పెద్ద కంపెనీలో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఆ తర్వాత చదువుపై ఉన్న ధ్యాస మళ్లీ ఆయనకు ఎంబీఏ చేయాలన్న కోరికను పుట్టేలా చేసింది. ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏని పూర్తి చేశాడు. ఎంబీఏ అయ్యిందో లేదో ఎన్నో లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చాయి. కానీ అతను వెళ్లలేదు.
తన చదువు తనకే కాదు, తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. మురికివాడలోనే ఆ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు.
చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా మురికివాడలో తనలాగా పుట్టిన వారే.
శరత్ బాబు గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు. తాను పుట్టిన కొన్నాళ్లకే తండ్రికి దూరమయ్యాడు. ఐదుగురు పిల్లలకు పోషించేందుకు తల్లి కష్టాన్ని దగ్గరగా చూసాడు. ఒక పూట అన్నం తింటే మరో పూట ఆ కుటుంబం పస్తు పడుకునేది. అయినా కూడా చదువుపై తన ధ్యాసను పక్కన పెట్టలేదు. ఒకవైపు అమ్మకు సాయం చేస్తూనే, మరోవైపు చదువును కొనసాగించాడు.
ఎన్నో రోజులు అతని జీవితంలో ఒక పూట భోజనాన్నే తిన్నాడు. ఎన్నో అవమానాలను పొందాడు. అయినా కూడా కుంగిపోలేదు. కష్టాలను, సమస్యలను చూసి పారిపోలేదు. తను అనుకున్నది సాధించి చూపించాడు. మీకు చెన్నై, హైదరాబాద్, ఇతర మెట్రో నగరాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఫుడ్ కింగ్ షాపులు కనిపించే అవకాశం ఉంటుంది. వాటి వెనుక మురికివాడలో పుట్టి పెరిగిన ఒక కుర్రాడు కష్టం ఉందని గుర్తు చేసుకోండి. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అర్థం చేసుకోండి.
ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. వందల కోట్ల ఆస్తులు ఉన్న కుటుంబంలో పుట్టిన వారికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కోట్ల కొద్దీ డబ్బున్న వారి సమస్యలు బయటికి రావు. ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపిస్తుంది. మీ ముందున్న సమస్యను కష్టాన్ని చీమతో పోల్చుకోండి. అది చిన్నగా అనిపిస్తుంది. ఏనుగుతో పోల్చుకుంటే చిన్న ఇబ్బంది కూడా చాలా పెద్ద సమస్యలా కనిపిస్తుంది. చిన్నదైనా, పెద్దదైనా ఆ కష్టాన్ని దాటుకొని వెళ్తేనే మీరు విజయతీరాలను చేరుకోగలరు. కష్టంగా ఉంటుందని అక్కడే ఆగిపోతే మీ జీవితం ముందుకు సాగదు. సమస్యలను చూసి పారిపోవడం మానేయండి. ఆ సమస్యలను దాటి ఎలా వెళ్లాలో ఆలోచించడం మొదలుపెట్టండి. అక్కడే మీ విజయానికి మొదటి పునాది పడుతుంది.