Aloo methi Curry: బేబీ పొటాటోలతో మెంతి కూర ఇలా వండితే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Aloo methi Curry: మెంతాకులు, బంగాళాదుంపలు కలిపి వండే కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళాదుంప మెంతి ఆకులను కలిపి కూర ఎలా చేయాలో తెలుసుకోండి.
రోజుకో రకం కూరలు తినే అలవాట్లు మనవి. మధ్యాహ్నం ఒక కూర తింటే, రాత్రికి మరో రకం కూర ఉండాల్సిందే. స్పైసీగా ఉండే కూరలను తెలుగు వారు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. లంచ్ అయినా, డిన్నర్ అయినా టేస్టీ కూరలు ఉండాల్సిందే. బంగాళదుంపలతో చేసే మెంతాకుల కూర టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చే కూర ఇది. మెంతుల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మెంతాకులు తినడం వల్ల మలబద్దకం, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బేబీ పొటాటోలు అంటే చిట్టి ఆలూలతో మెంతాకుల కూర వండితే రుచి అదిరిపోతుంది.

బంగాళాదుంప మెంతి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
మెంతాకులు - నాలుగు కప్పులు
బంగాళాదుంపలు - రెండు
జీలకర్ర - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఎండుమిర్చి - రెండు
పసుపు - అరస్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
ఇంగువ - చిటికెడు
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
బంగాళాదుంప మెంతి కూర రెసిపీ
- బంగాళాదుంప మెంతి ఆకుల కూర కోసం మెంతాకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత చిట్టి బంగాళాదుంపలను ఉడికించి పైన తొక్క తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో మెంతాకులు, కొద్దిగా ఉప్పు వేసి బాగా దోరగా వేయించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే బాణలిలో మరొక స్పూను నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.
- నూనె వేడి అయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి కాసేపు వేయించాలి.
- తర్వాత బాణలిలో తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి 30 సెకన్ల పాటు వేయించాలి.
- ఆ తర్వాత పైన పసుపు, బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు మెంతి ఆకులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు మూతపెట్టి చిన్న మంట మీద అర గంట పాటూ ఉడకనివ్వాలి.
- మధ్యమధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతూ ఉండాలి.
- మెంతాకులు చేదు పోయే వరకు ఉంచి పొడి పొడిగా వచ్చేలా ఉడికించుకోవాలి. నీళ్లు వేయకుండానే దీన్ని వండుకోవాలి.
- ఇది దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన ఆలూ మెంతికూర రెడీ అయినట్టే.
మెంతాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక చిట్టి బంగాళాదుంపలతో చేసే ఏ వంటలైన రుచిగా ఉంటాయి. ఇక ఈ రెండూ కలిపి వండే కూర ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్