నేటి బిజీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలను నిర్వర్తిస్తూ చాలా సార్లు మన శరీరం, మనస్సు రెండూ చాలా అలసిపోతాయి. కొన్నిసార్లు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలసట, నీరసం వేధిస్తాయి. ఇలాంటి సమయంలో పని మీద కూడా మనసు లగ్నం చేయలేము.
చాలా మంది టీ లేదా కాఫీ సాయంతో ఈ అలసట, నీరసాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యకరమైనది కాదు. మరేం చేయాలి అంటారా? అయితే ఇది మీ కోసమే. మీ అలసటను తక్షణమే తగ్గించి మిమ్మల్ని మళ్ళీ శక్తివంతం చేసేందుకు మీకు ఉపయోగపడే కొన్ని సులభమైన, సహజమైన 5 చిట్కాల గురించి తెలుసుకుందాం.
మన శరీరం అలసిపోయిందంటే మనస్సు కూడా మందగించడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు అలసటను తగ్గించుకోవడానికి గాఢంగా శ్వాస తీసుకోవడం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం నిటారుగా కూర్చుని, దాదాపు 5 నుండి 10 నిమిషాల పాటు, ముక్కు ద్వారా నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకొండి. ఆపై నోటి ద్వారా శ్వాసను వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరం, మనస్సుకు కొత్త శక్తి లభిస్తుంది. లోతైన శ్వాస తీసుకోవడం వల్ల అలసట, నీరసం తగ్గడమే కాకుండా, మనస్సు కూడా ప్రశాంతంగా, చురుగ్గా మారుతుంది.
కొన్నిసార్లు గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల కూడా శరీరంలో అలసట ఏర్పడుతుంది. వాస్తవానికి ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల నీరసం పెరిగి శరీరం బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు శరీరానికి ఉపశమనం అవసరం. దీని కోసం తేలికపాటి స్ట్రెచింగ్ లేదా 5-10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర కండరాలను సడలిస్తుంది. మీరు తక్షణమే ఉత్సాహంగా ఫీలవుతారు.
చాలా అలసటగా ఉన్నప్పుడు,ః చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం లేదా స్నానం చేయడం కూడా సులభమైన, ప్రభావవంతమైన మార్గం. చల్లటి నీరు శరీర నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నిద్ర, నీరసాన్ని తక్షణమే తొలగిస్తుంది. కాబట్టి ఈ సారి మీకు చాలా అలసిపోయినట్లుగా అనిపించినప్పుడు వెంటనే వెళ్లి చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మీరు స్నానం చేయలేని ప్రదేశంలో ఉంటే చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఇది కూడా మీ నీరసాన్ని తగ్గిస్తుంది.
అలసటకు ఒక ప్రధాన కారణం శరీరంలో శక్తి లేకపోవడం. కొన్నిసార్లు ఎక్కువసేపు ఆకలిగా ఉండటం వల్ల లేదా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా అలసట ఏర్పడుతుంది. అలాంటప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తినడం ద్వారా కూడా అలసటను తగ్గించుకోవచ్చు. పండ్లు, గింజలు లేదా డార్క్ చాక్లెట్ వంటివి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వాస్తవానికి వీటిలో ఉండే సహజ చక్కెర, మంచి కొవ్వు శరీరానికి పుష్కలంగా శక్తిని ఇస్తాయి.
కొన్నిసార్లు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అలసట, నీరసం ఏర్పడతాయి. అలాంటప్పుడు బలవంతంగా చురుగ్గా ఉండటానికి ప్రయత్నించడానికి బదులుగా 10 నుండి 15 నిమిషాల పవర్ నాప్(చిన్న పాటి కునుకు) తీసుకోవాలి. ఈ చిన్న పవర్ నాప్ మీ మనస్సు, శరీరం రెండింటినీ రీఛార్జ్ చేస్తుంది. కానీ ఈ నాప్ 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే శరీర అలసట మరింత పెరుగుతుంది.