మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఆహారంలో వీటిని తింటే ఆ సమస్య రాదు
మధ్యాహ్న భోజనం చేశాక మీకు బద్ధకం, అలసట, నిద్రమత్తుగా అనిపిస్తోంది. భోజనం తర్వాత పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఉంటే సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ పరిష్కారాన్ని పంచుకున్నారు. రుజుతా దివేకర్ మధ్యాహ్న భోజనంలో రెండు రకాల ఆహారాలు పంచుకోవడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

మధ్యాహ్నం భోజనం చేశాక ఎంతో మందికి ఆవలింతలు రావడం మొదలవుతాయి. నిద్ర మత్తు కమ్మేస్తూ ఉంటుంది. కానీ ఆఫీసులో పనిచేయాలి. ఓ పక్క నిద్రమత్తు, మరో పక్క పని… ఈ రెండూ సరిగా చేయలేక సతమతమైపోతూ ఉంటారు ఎంతో మంది ఉద్యోగులు. ఆహారం తిన్న తర్వాత సోమరితనంగా, నిద్ర వచ్చేలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?
కొంతమంది నిద్రమత్తు ఆపుకోలేక ఆఫీసులోనే పవర్ న్యాప్ కూడా తీసేస్తారు. అలా పవర్ న్యాప్ తీసుకునే అవకాశం అన్నీ ఆఫీసుల్లో ఉండదు. ఆ అవకాశమూ అందరికీ రాదు. పవర్ న్యాప్ తీసుకున్న తర్వాత ఈ నిద్ర పోతుంది. కానీ కొంతమంది మధ్యాహ్న భోజనం తర్వాత పూర్తిగా బద్ధకంగా ఉంటారు. అలసిపోయినట్లు భావిస్తారు. దేనిపైనా దృష్టి పెట్టలేరు.
ఇలాంటి బద్ధకాన్ని నివారించడానికి ప్రజలు తరచుగా టీ, కాఫీ, సిగరెట్లు వంటి వాటిని తాగుతారు. పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ మధ్యాహ్నపు మందగమనాన్ని ఎలా తొలగించాలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెండు రకాల ఆహారాలను ఫుడ్ ప్లేట్ లో చేర్చుకోవడం ద్వారా ఈ బద్ధకాన్ని తగ్గించుకోవచ్చు.
లంచ్ తర్వాత బద్ధకం, అలసట, బలహీనత, చిరాకును అధిగమించడానికి ఈ రెండింటిని ఆహారంలో చేర్చుకోవాలని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ చెప్పారు.
దేశీ నెయ్యి
రోజువారీ మధ్యాహ్న ఆహారంలో దేశీ నెయ్యి ఉండేలా చూసుకోండి. నెయ్యిలో శరీరంలో విటమిన్ డి, విటమిన్ బి 12 లోపాన్ని తీర్చే అవసరమైన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు, చర్మంపై పిగ్మెంటేషన్ ఉన్నవారు భోజనంలో ఒక చెంచా నెయ్యిని చేర్చుకోవాలి. ఇది కాలక్రమేణా పెరుగుతున్న బరువును కూడా నియంత్రిస్తుంది. నెయ్యి మలబద్ధకం సమస్యను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి లంచ్ లో నెయ్యి చేర్చండి.
చట్నీలు
ఆహార రుచిని పెంచడానికి చట్నీని చాలా మంది ఇష్టపడతారు. చట్నీ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నువ్వులు, లిన్ సీడ్, కొబ్బరి, కరివేపాకు, పప్పులు, కొత్తిమీర వంటి వాటితో చేసిన చట్నీని రోజువారీ భోజనంలో ఉండేలా చూసుకోండి. ఈ చట్నీ శరీరంలోని లోపాలను అధిగమించడానికి సహాయపడుతుంది. కొత్తిమీర పచ్చడి ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తుంది. అదే సమయంలో తెల్ల నువ్వులు శరీరంలోని కాల్షియం లోపాన్ని తొలగిస్తాయి. ఇది విటమిన్ డిని గ్రహించడం సులభం చేస్తుంది. పగటిపూట బద్ధకంగా అనిపించదు.
పైన చెప్పిన రెండూ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వాటిని తినడం అన్ని రకాలుగా మంచిదే. కొన్ని రోజులు మధ్యాహ్న భోజనంలో ఈ పదార్థాలను తిని చూడండి మీకు కచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం