రిజెక్షన్‌ను తీసుకోలేకపోతున్నారా? కొద్దిగా ఓపికతో ఈ విషయాలు ప్రయత్నించి చూడండి!-feeling rejected a little patience do a lot of potential try these tricks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రిజెక్షన్‌ను తీసుకోలేకపోతున్నారా? కొద్దిగా ఓపికతో ఈ విషయాలు ప్రయత్నించి చూడండి!

రిజెక్షన్‌ను తీసుకోలేకపోతున్నారా? కొద్దిగా ఓపికతో ఈ విషయాలు ప్రయత్నించి చూడండి!

Ramya Sri Marka HT Telugu

రిజెక్షన్ అనేది జీవితంలో ఒక భాగం. దానిని ఎదుర్కునే తీరు మిమ్మల్ని మానసికంగా, దృఢంగా మారుస్తుంది. భవిష్యత్తులో విజయం సాధించడానికి సహాయపడుతుంది. మీపై నమ్మకాన్ని పెంచుకుని ముందుకెలా సాగిపోవాలో తెలుసుకోండి.

రిజెక్షన్ నుంచి తప్పించుకుని మోటివేషన్ తో ఉండటమెలా?

జీవితంలో ప్రతిఒక్కరూ రిజెక్షన్‌కు గురవుతుంటారు. ప్రాక్టికల్‌గా ఆలోచించగలిగితే ఇదొక సాధారణమైన అనుభవం. ప్రేమలో కావొచ్చు, ఉద్యోగంలో కావొచ్చు లేదా ఇతర ప్రయత్నాలలో కావొచ్చు, రిజెక్షన్ ఎదురైనప్పుడు బాధగా ఉండటం సహజం. అయితే, దానిని ఎలా స్వీకరించి ముందుకు సాగాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. రిజెక్షన్‌ను తట్టుకుని నిలబడటానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చిద్దాం.

1. లక్ష్యంపై దృష్టి పెట్టండి:

ఒక రిజెక్షన్ మీ ప్రయాణంలో ముగింపు కాకూడదు. మీరు ఏమి సాధించాలనుకున్న లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఆ దిశగా ప్రయత్నిస్తూ ఉండండి. ఒక తలుపు మూసుకుంటే, మరో తలుపు తెరుచుకుంటుందని గుర్తు పెట్టుకోండి.

2. మీపై దయ చూపించండి:

రిజెక్షన్ తర్వాత మీతో కఠినంగా, నిర్దయగా ఉండకండి. మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోండి. మీకు ఇష్టమైన పనులు చేయండి, మంచి ఆహారం తీసుకుంటూ.. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే, మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని కలిగి ఉండటం ముఖ్యం.

3. అనుభవాల నుంచి నేర్చుకోండి:

ప్రతి రిజెక్షన్ ఒక పాఠం నేర్పుతుంది. మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగం రాకపోతే ఏయే లోపాలతో రిజెక్షన్‌కు గురయ్యారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ఎందుకు తిరస్కరించాడో ఆలోచించండి. ఈ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు మీకు భవిష్యత్తులో మెరుగ్గా ప్రయత్నించడానికి సహాయపడతాయి. ‘ఇందులో నేర్చుకునే పాఠం ఏంటి?’ అనే కోణంలో ఆలోచించడం వల్ల మానసికంగా అభివృద్ధి చెందగలుగుతాం.

4. పర్సనల్‌గా తీసుకోవడం మంచిది కాదు:

రిజెక్షన్‌ను చాలా సందర్భాలలో వ్యక్తిగతంగా తీసుకోకపోవడమే ఉత్తమం. చాలా సార్లు రిజెక్షన్ మీ సామర్థ్యానికి కాకుండా పరిసర పరిస్థితులకు సంబంధించినదిగా ఉంటుంది. ఉద్యోగానికి ఎంపిక చేయకపోవడం కూడా వీటిల్లో ఒకటి. అదెలా అంటే, కేవలం మీ సామర్థ్యం తక్కువగా ఉండటం మాత్రమే కాదు. ఎదుటి వారు ఆశించేది మీలో లేదని మాత్రమే గుర్తుపెట్టుకోండి. అలాగే, ప్రేమలో రిజెక్షన్ కూడా, అది మీ వ్యక్తిత్వం లేదా విలువకు సంబంధించినది కాకపోవచ్చు. ఎదుటి వ్యక్తి ప్రాధాన్యతలు లేదా పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. కాబట్టి ఆ రిజెక్షన్ విలువను తగ్గించిందని ఫీల్ అవకండి.

5. మీ బలాలు, విజయాలను గుర్తు చేసుకోండి:

రిజెక్షన్ మిమ్మల్ని తక్కువగా అంచనా వేసేలా చేయొచ్చు. కానీ, మీరు సాధించిన విజయాలు, మీకున్న బలాలు ఏమిటో గుర్తు చేసుకోండి. మీరు విలువైన వ్యక్తి అని, మీకు అనేక సామర్థ్యాలు ఉన్నాయని గ్రహించండి.

6. మీ ఫీలింగ్స్‌కు వాల్యూ ఇవ్వండి:

రిజెక్షన్ తర్వాత కలిగే బాధ, కోపం, నిరాశ వంటి భావాలను అణచివేయకండి. సహజంగా కలిగే భావాలను గుర్తించి, వాటికి తగ్గట్లుగా రియాక్ట్ అవండి. మీ భావాలను హ్యాండిల్ చేయలేకపోతే నమ్మకమైన స్నేహితుడితో లేదా కుటుంబ సభ్యుడితో పంచుకోండి. మిత్రులతో మాట్లాడటం కుదరకపోతే ఆ సమయంలో డైరీ రాయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. బాధ, నిరుత్సాహం, కోపం అనే భావనలను ఒడిసిపట్టకుండా, అంగీకరించి, బయటపెట్టండి.

7. ఇతరుల మద్దతు తీసుకోండి:

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మెంటార్‌ల మద్దతు కష్టమైన సమయంలో మీకు చాలా అవసరం. వారితో మాట్లాడటం, వారి సలహాలు తీసుకోవడం, వారి ప్రేమను పొందడం మిమ్మల్ని మానసికంగా బలపరుస్తుంది.

8. సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి:

విజయవంతమైన వారు చాలా రిజెక్షన్లు ఎదుర్కొని కూడా ముందుకు సాగారు. ఒకవేళ రిజెక్షన్ మిమ్మల్ని తీవ్రంగా కలచివేస్తూ.. మీరు దాని నుండి బయటపడలేకపోతుంటే మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వారు మీకు సరైన మార్గనిర్దేశం చేయగలరు. మళ్లీ ప్రయత్నించడమే మీ ధైర్యానికి గుర్తు అని మర్చిపోకండి.

9. సమయం అన్నిటినీ మారుస్తుంది:

మీరు పొందలేని అవకాశానికి బదులుగా, ఇంకొక మంచి అవకాశం ఎదురయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. రిజెక్షన్ బాధ వెంటనే తగ్గకపోయినా, సమయం గడిచే కొద్దీ దాని తీవ్రత తగ్గుతుంది. ఓపికగా ఉంటూ, జీవితాన్ని కొనసాగించండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.