Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారిలో 80% మంది ఐటీ ఉద్యోగులేనట! ఎందుకో తెలుసా?-fatty liver disease suffering by 80 of it employees what should be done to overcome this problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారిలో 80% మంది ఐటీ ఉద్యోగులేనట! ఎందుకో తెలుసా?

Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారిలో 80% మంది ఐటీ ఉద్యోగులేనట! ఎందుకో తెలుసా?

Ramya Sri Marka HT Telugu

Fatty Liver Disease: ఇండియాలోని ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 80% మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది. వారికి ఆ సమస్య ఎందుకు వస్తుంది? దాని పరిష్కార మార్గాలేంటో చూసేద్దామా?

ఇండియన్ ఐటీ ఉద్యోగులను వణికిస్తోన్న ఫ్యాటీ లివర్ సమస్య (Representational)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని 80% కంటే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారట. ఇండియన్ ఎకానమీకి ఎక్కువ లాభం చేకూరుస్తున్న ఐటీ రంగం 5.4 మిలియన్లకు మందికి పైగా ఉద్యోగాలను అందిస్తుంది. ఐటీ రంగంలో పనిచేసే వారి గురించి, ఈ రంగంతో సంబంధమున్న వారి ఆరోగ్య తీరు గురించి అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో, సర్వే చేసిన 84% మంది ఐటీ ఉద్యోగులకు మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) ఉందని తేలింది.

ఫ్యాటీ లివర్ కలిగేందుకు కారణాలు:

జూలై 2023 నుండి జూలై 2024 వరకు హైదరాబాద్‌లో పనిచేస్తున్న 345 మంది ఐటీ ఉద్యోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఎక్కువ సమయం డెస్క్‌లో ఒకే చోట కూర్చోవడం, పని ఒత్తిడి, అస్తవ్యస్తమైన నిద్ర MAFLDకి దోహదం చేస్తాయని అధ్యయనంలో తేలింది. వాస్తవానికి, ఈ సమస్య రావడానికి కారణం ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, పని గురించి అధికంగా ఒత్తిడికి గురవడం, ఆహారం విషయంలో జాగ్రత్త లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ కారణాలేనని నిపుణులు చెబుతున్నారు.

ఐటీ ఉద్యోగులలో 71% మంది ఊబకాయంతో బాధపడుతున్నారట. 34% మందికి మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. వీరిలో దాదాపు ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా ఉన్నాయట.

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి?

మెటబాలిక్-అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) అనేది మెటబాలిక్ పనితీరు అపసవ్యంగా ఉండటం వల్ల జరుగుతుంది. దీని కారణంగా కాలేయంలో 5% కంటే ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుందట. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కాలేయ వ్యాధులకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఫ్యాటీ లివర్‌తో వచ్చే సమస్యలేంటి?

సకాలంలో ట్రీట్మెంట్ అందించకపోతే సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు కూడా కారణం కావొచ్చట. ఒక్కోసారి లివర్ మార్పిడి అవసరం కూడా రాావచ్చు. MAFLD టైప్-2 డయాబెటిస్‌కు దారితీసి, హైపర్‌టెన్షన్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో సహా హృదయనాళ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర ఆహారాలను నివారించడం, ఎక్కువ నీరు త్రాగడం, రోజూ వ్యాయామం చేయడం, బరువు తగ్గించుకోవడం ద్వారా దాని ప్రభావాలను తగ్గించవచ్చు.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, కొవ్వు కాలేయం కోసం స్క్రీనింగ్, సరైన పని-జీవిత సమతుల్యత, ఒత్తిడి నిర్వహణ ద్వారా లివర్‌కు ఫ్యాట్ చేరడాన్ని తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. ఐటీ కంపెనీలు ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా ఇవ్వడానికి వెల్నెస్ ప్రోగ్రామ్‌ల ద్వారా వ్యూహాలను అమలు చేయాలని అధ్యయనం సూచిస్తుంది. ఇందులో ఉద్యోగులు కూడా చురుకుగా పాల్గొంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది.

ఫ్యాటీ లివర్ ఉందని గుర్తించేదెలా అంటే:

అలసటగా ఉండటం: మీరు చక్కగా విశ్రాంతి తీసుకున్నా కూడా మామూలు సమయంలో కంటే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.

పేగు లోపల నొప్పి: పొత్తి కడుపులో లేదా కాస్త పై భాగంలో తరచుగా భరించలేనంత నొప్పి కలుగుతుంటుంది.

హఠాత్తుగా బరువు తగ్గడం: కొద్దిరోజుల్లోనే వేగంగా బరువు తగ్గిపోతుంటారు.

లివర్ ఎంజైమ్ లెవల్స్ పెరగడం: రక్తపరీక్షల ద్వారా లివర్ ఎంజైమ్ లెవల్స్ పెరిగినట్లు కనుగొనవచ్చు.

జాండిస్ (పసుపు రంగు చర్మం): కొందరిలో కామెర్ల వంటి లక్షణం కనిపించవచ్చు. చర్మం కూడా పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది.

చురుకు లేకపోవడం, ఆకలిగా అనిపించకపోవడం వంటి లక్షణాలు కూడా లివర్ సమస్యల సంకేతాలుగా భావించొచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం