Motivation: విధి ఆమె నుంచి అన్నీ లాగేసుకుంది ఒక్క ధైర్యాన్ని తప్ప, ఈమె జీవితం ఒంటరి వాళ్లకు స్ఫూర్తి
అందమైన జీవితం, ఇంటి నిండా కుటుంబం... ఒక్కసారిగా మాయమైపోతే, ఒంటరిగా మిగిలిపోతే... అప్పుడు తెలుస్తుంది అసలైన బాధ. ఆ బాధ నుంచి ఫీనిక్స్ పక్షిలా తిరిగి ధైర్యాన్ని తెచ్చుకొని ఎగిరేందుకు సిద్ధమైంది శృతి.
శృతి, జెన్సన్... వీరిద్దరి చిన్నప్పటి స్నేహం, పెద్దయ్యాక ప్రేమగా మారింది. ఆ ప్రేమను గెలిపించేందుకు ఇద్దరూ తమ కుటుంబాలతో మాట్లాడారు. వీరి స్వచ్ఛమైన ప్రేమ ముందు కుటుంబాలు కూడా తలొగ్గాయి. వారిద్దరికీ పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాయి. అప్పటికే శృతి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో జాబ్ చేస్తోంది. జెన్సన్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని విషాదం వారి కలలను కల్లలు చేసింది. కేరళలో వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి వందల మంది మరణించారు. అందులో శృతి కుటుంబం కూడా ఉంది. ఆమె తల్లి, తండ్రి, చెల్లి, అత్త, మావయ్య ఇలా మొత్తం తొమ్మిది మంది శృతికి దూరమయ్యారు. కుటుంబంలో శృతి మాత్రమే మిగిలిపోయింది. ఆమె పెళ్లి కోసం దాచిన నగలు, డబ్బు అన్నీ పోయాయి. ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచింది. ఆమెను స్వచ్ఛంగా ప్రేమించిన జెన్సన్ మాత్రమే.
శృతికి అన్నీతానై
కుటుంబం లేకపోయినా తాను శృతిని పెళ్లి చేసుకుంటానని జెన్సన్ మాటిచ్చాడు. ఒకేసారి కుటుంబాన్ని కోల్పోయిన బాధ నుంచి శృతిని బయటపడేసేందుకు ఎంతో ప్రేమ కురిపించాడు. ఆమెను తీసుకెళ్లి తన ఇంట్లోనే పెట్టాడు. తన తల్లి తండ్రి అక్క చెల్లెలు అందరూ ఆమెను ప్రేమగా చూసుకుంటూ కుటుంబం లేని బాధను పోగొట్టేందుకు ప్రయత్నించారు.
జెన్సన్ మరణం
జెన్సన్ కుటుంబం పెళ్లికి ఏర్పాట్లు చేస్తోంది. శృతికి, జెన్సన్‌కు మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతోంది. కానీ శృతి పై మళ్లీ విధి పగబట్టింది. ఆమె ఆనందాన్ని చూడలేకపోయింది. ఆమెకు దక్కిన అదృష్టాన్ని, ప్రేమను చూసి కుళ్ళుకుంది. ఒక కారు యాక్సిడెంట్లో జెన్సన్ కూడా చనిపోయాడు. ఆ సమయంలో అదే కారులో శృతి కూడా ఉంది. శృతికి చిన్న చిన్న ఫ్రాక్చర్లు మాత్రమే అయ్యాయి. కారులో ఉన్న ఇతరులంతా బతికి బట్టకట్టారు... కానీ కారు డ్రైవ్ చేస్తున్న జెన్సన్ మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు మరొకసారి శృతి జీవితంలో అంధకారం అలుముకుంది.
మానవత్వమే గెలిచింది
జీవితంలో ఈసారి మొత్తం కోల్పోయినట్టు భావించింది శృతి. ఎంత ఏడ్చినా ఆ బాధను ఎవరూ తీర్చలేకపోయారు. కంట్లోంచి కన్నీరు కూడా ఇంకిపోయింది. అయినా శృతి మనో ధైర్యాన్ని కోల్పోలేదు. అదే సమయంలో ఎన్నో ఓదార్పులు ఆమె చేతిని తాకాయి. నా అన్న వాళ్శెవరూ లేక ఈ ప్రపంచంలో శృతి ఒక్కతే ఎడారిలో చెట్టులా మిగిలిపోయింది. కానీ ఆమెకు ధైర్యం ఎక్కువ. ఆ చెట్టు కూడా చిగురించడం ప్రారంభించింది. అదే సమయానికి కేరళ ప్రభుత్వంతో పాటు అనేకమంది తామున్నామంటూ ఆమెకు అండగా నిలిచారు. ఎంతగా విధి పగబట్టినా మానవత్వం అనేది శృతిని కాపాడుకుంటూ వస్తూనే ఉంది. ఆ మానవత్వమే లేకుంటే శృతి ఒంటరిగా మారి ఏమయ్యేదో. అలాగే శృతిలో ఉన్న ధైర్యం కూడా ఎప్పటికప్పుడు బయటికి వస్తూ శృతిని కాపాడుకుంటూ వస్తోంది.
కార్ యాక్సిడెంట్ లో ఆమె రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కర్రల సాయంతో నడుస్తోంది. శృతి కేరళ ప్రభుత్వం ఆమెకు రెవెన్యూ శాఖలో క్లర్క్ ఉద్యోగాన్ని ఇచ్చింది. ఆమెకు ప్రస్తుతం అక్క, అన్న, అమ్మ అని పిలిచేందుకు ఒక్క అనుబంధం కూడా మిగలలేదు. అయినా కూడా జీవితం మీద ఆశతో ఆ కర్రల సాయంతోనే కుంటు కుంటూ రెవెన్యూ శాఖలో జాయిన్ అయింది. శృతి తనకు సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. ఇక విధి శృతి నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు. దాదాపు అన్ని బంధాలను మాయం చేసింది. కానీ శ్రుతిలో ఉన్న మనోధైర్యాన్ని తీసుకోలేక పోయింది. ఎవరి ధైర్యం ముందు అయినా ఆ విధి ఓడాల్సిందే.
ధైర్యమే విజయం
పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ప్రేమ విఫలమైనప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా అయితే శృతి ఇప్పటికి ఎన్నోసార్లు చనిపోయి ఉండాలి. కానీ ఆమె ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయలేదు. జీవితం తనకు ఇస్తున్న ప్రతిదాన్ని స్వీకరిస్తూ సవాళ్లను దాటుతూ ...కన్నీళ్లను మింగుతూ ముందుకే సాగుతోంది. ఈమె కష్టం ముందు మీ ప్రేమ వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఏపాటివి? ధైర్యంగా నిలిచి ఉంటే వాటన్నింటినీ దాటుకొని ముందుకెళ్లే శక్తి కచ్చితంగా మీలో ఉంటుంది. మీలో ఉన్న మనోధైర్యాన్ని తట్టి లేపండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.