Saturday Motivation: పొగడ్తలకు పడిపోతూ, విమర్శను తట్టుకోలేకపోతున్నారా? అయితే జీవితంలో సక్సెస్ కావడం కష్టమే
Saturday Motivation: ఒక మనిషి నుంచి వచ్చే పొగడ్తనైనా, విమర్శనైనా ఒకేలా తీసుకొని ముందుకు సాగితేనే జీవితంలో ఏదైనా సాధించగలరు. పొగడ్తలకు పొంగిపోతూ, విమర్శకు కుంగిపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది.
Saturday Motivation: విజయాన్ని పొందాలనుకునే వ్యక్తి పొగడ్తకు, విమర్శకు ఒకేలా స్పందిస్తాడు. పొగిడిన వారిని గొప్పగా, విమర్శించిన వారిని తక్కువగా చూడడు. నిజానికి పొగడ్తల కన్నా విమర్శలే మేలు చేస్తాయి. పొగడ్తలు... మీరు చేసిన దాన్ని మాత్రమే చెబుతాయి. విమర్శలు... మీరు చేయాల్సిన దానిని వివరిస్తాయి. కాబట్టి విజయం సాధించాలనుకుంటే విమర్శించే వారి పక్కనే ఉండండి.
ప్రశంసలు మీ ప్రయాణానికి అడ్డుపడతాయి. ఆ ప్రశంసలకు పడిపోయి అక్కడే ఆగిపోతే... మీరు అనుకున్న విజయాన్ని అందుకోలేరు. విమర్శించే ప్రతి వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటే మీ అడుగు ముందుకు పడదు. కాబట్టి విమర్శించే వాళ్ళని కాకుండా, ఆ విమర్శలోని విషయాన్ని విశ్లేషించండి. మీరు ఎక్కడ అడుగు వేసారో అర్థమవుతుంది. ప్రశంసలను పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే మీరు చేసిన పనే వారి ప్రశంసల రూపంలో కనిపిస్తుంది. కానీ విమర్శ మాత్రం భిన్నమైనది. మీరు చేయాల్సిన దాన్ని, చేయలేక వదిలేసిన దాన్ని విమర్శల రూపంలో తినవచ్చు.
మీరు త్వరగా విజయం సాధించాలనుకుంటే విమర్శను, పొగడ్తను ఒకేలా చూడండి. రెండింటికీ ఒకే విలువ ఇవ్వండి. ఇంకా కావాలనుకుంటే విమర్శకే ఎక్కువ విలువని ఇవ్వండి. అప్పుడు కచ్చితంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది విజయం సాధించడానికి అవసరమైన లక్షణం. ప్రశంసలు వ్యక్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. నిజమే, కానీ విమర్శ... చేయాల్సిన పనులను సూచిస్తాయి. కాబట్టి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా మీకు చాలా అవసరం.
పొగడ్తలు వినపడగానే కొంతమంది పొగరుగా ప్రవర్తించడం మొదలుపెడతారు. కానీ ఏదో సాధించామని అనుకుంటారు. అలా చేస్తే వారి ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. ఎప్పుడైతే అహంకారం తలెకెక్కుతుందో అపజయం వెన్నంటే వస్తుంది. కాబట్టి ప్రశంసలను చాలా వినయంగా స్వీకరించాలి. ఆ ప్రశంసల వల్ల గర్వం తెచ్చుకోకూడదు. మీ మనసు గర్వం అనే మత్తులో పడిందంటే మీరు బలహీనమైన మనసును కలిగి ఉన్నారని అర్థం. విజయం సాధించగాలనుకునే వ్యక్తి మనసు బలంగా ఉంటుంది. ప్రశంసలకు పడిపోయేంత బలహీనంగా ఉండదు.
పొగడ్తల్లో ఎక్కువగా అబద్ధాలే ఉంటాయి. కానీ విమర్శల్లో ఎన్నో నిజాలు ఉంటాయి. మీ జీవితాన్ని మార్చేవి ఎక్కువగా విమర్శలే. విమర్శలోని నిజాన్ని మాత్రం గ్రహించి, మీరు చేసిన తప్పులను లేదా చేయాల్సిన పనులను నిర్దేశించుకోండి.
పొగడ్తలు వింటూ సమయాన్ని వృధా చేసుకోకండి. దాని బదులు సలహాలు, సూచనలు తీసుకోండి. పొగడ్త గర్వాన్ని పెంచితే, విమర్శ మిమ్మల్ని నేల మీద నిలబడేలా చేస్తుంది. విజయం అందుకున్నాక ఎవరైనా ప్రశంసిస్తారు. ఆ విజయాన్ని అందుకునే ప్రయాణంలో మీకు ఎదురు కావలసినవి కేవలం విమర్శలే. అప్పుడే మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళతారు. ముందే ప్రశంసలకు, పొగడ్తలకు పడిపోతే ఆ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. ఇక విజయం సాధించడం కష్టతరంగా మారుతుంది. విమర్శించిన ప్రతి వ్యక్తిని మీరు శత్రువుగా చేసుకోకండి. అతడినే మీ మిత్రుడు అనుకోండి. అతను చెప్పిన విమర్శలోంచి మంచిని గ్రహించండి.
టాపిక్