Failure Persons: జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తులు తరచుగా చెప్పే 6 విషయాలు, అలా ఎందుకంటారో తెలుసా
Failure Persons: జీవితంలో సక్సెస్ సాధించిన వారి అలవాట్లను పరిశీలిస్తే కామన్‌గా కనిపిస్తాయి. అలాగే తరచూ ఓటములు ఎదుర్కొనే వారి లైఫ్ స్టైల్ కూడా ఒకే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరు విషయాల్లో వారందరి వైఖరి ఒకేలా ఉంటుంది. అవి మీలోనూ ఉన్నాయా.. చెక్ చేసుకుని వెంటనే మార్చుకోండి.
జీవితంలో ప్రతి వ్యక్తి కష్టించి పని చేసేది విజయం సాధించడానికే. చాలా పనులు మనలోని ఆలోచనలను బట్టే ఫలితాలను ఇస్తాయి. కానీ, ఫలితాలన్నీ ఒకే విధంగా అంటే నిరాశతోనే ముగుస్తున్నాయంటే, దానికి అర్థం మీ ఆలోచనా విధానం ఒకేలా ఉందనే కదా. గతం నుంచి పాఠాలు నేర్చుకుని కొత్తగా ప్రయత్నించకపోతే పాత ఫలితాలే పునరావృతం అవుతాయి. ఇలా మీరు కెరీర్లో పదేపదే ఫెయిల్యూర్లను ఎదుర్కొంటూ ఉంటే, దానికి కారణం మీరు ఎంతో కాలంగా అలవరచుకున్న చెడ్డ భావనలే. అవే మిమ్మల్ని ఓటమి దిశగా నడిపిస్తున్నాయన్న మాట. మరి అవేంటో తెలుసుకుని వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు తరచుగా మిమ్మల్ని మీరు తక్కువగా కించపరుచుకునేందుకు, ఓటమి వైపుకు వెళ్లేందుకు కారణమయ్యే భావనలు ఇవే.
'రేపటి నుండి చేస్తాను'
ఒక వ్యక్తి అన్ని పనులను మరుసటి రోజుకు వాయిదా వేస్తుంటే, అతను ఎప్పటికీ విజయవంతం కాలేడని అర్థం. పనిని వాయిదా వేసే వాళ్ల పట్ల విజయం కూడా వాయిదా వేస్తూనే ఉంటుంది మర్చిపోకండి.
'ఇందులో నా తప్పు లేదు'
జీవితంలో పదే పదే విఫలమయ్యే వ్యక్తి ఎప్పుడూ తన తప్పును అంగీకరించడు. ప్రతి ఓటమికి వేరే వాళ్లను కారణంగా భావిస్తాడు. ఈ అలవాటే అతన్ని ప్రతిసారి విఫలం చేస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా పని జరగకపోవడాన్ని బాధ్యత తీసుకుని తన మీద వేసుకోలేనప్పుడు, అతనికి తన లోపాలు, బలాలు ఎప్పటికీ తెలియవు. నిత్యం అతను ఎదుర్కొంటున్న ఆ లోపాలను అధిగమించలేడు.
'నీకు చెప్పడం సులభం'
విఫలమైన వ్యక్తులు తరచుగా ఇతరులతో 'నీకు చెప్పడం సులభం' అని అంటుంటారు. ఎందుకంటే వారు స్వయంగా పని చేసి సాధించడం కంటే, ఇతరులకు చెప్పి వారితో ప్రతి పనినీ చేయించుకోవడాన్ని సులభంగా ఫీలవుతారు.
'నాకు సమయం లేదు'
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సమయం వెచ్చించలేరు. పైగా దానిని సమర్థించుకుంటూ తరచుగా 'నాకు సమయం లేదు' అని అంటుంటారు. ఈ మాటలు ఎల్లప్పుడూ విఫలమైన వ్యక్తుల నుంచే వినిపిస్తుంటాయి. కొత్త పనిని ప్రారంభించలేకపోయినప్పుడు ప్రజలు తరచుగా ఇలా అంటారు. ముఖ్యంగా ఇది విఫలమైన వ్యక్తుల లక్షణం.
'నువ్వు చాలా అదృష్టవంతుడివి'
చాలా మంది విఫలమైన వ్యక్తులు ఇతరుల విజయాన్ని వారి అదృష్టంతో ముడిపెడతారు. తాము కోల్పోయిన విజయాన్ని ఇతరులు అందుకున్నప్పుడు 'నువ్వు చాలా అదృష్టవంతుడివి' అని బుకాయిస్తారు. 'కానీ నాకు అలాంటి అదృష్టం లేదు?' అని అంటారు. విజయానికి కష్టపడి పనిచేయడం, మంచి అలవాట్లు అలవరుచుకోవడం అవసరం. అటువంటివి లేనప్పుడే ఈ కారణాలన్నీ కనిపిస్తుంటాయి.
'నా వల్ల కాదు'
ఏదైనా కొత్త పని లేదా, కొత్త అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నించకుండానే విరమించుకుంటారు. తాము ఏదైనా చేయాలని ఎదురుచూస్తుంటారు కానీ, తీరా ఆ సమయం వచ్చేసరికి ప్రయత్నించకుండానే 'నా వల్ల కాదు' అని తప్పుకుంటారు. అవకాశం చేజారాక మరోసారి ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తూనే ఉంటారు. ఇంకొక్కసారి అవకాశం రాకపోదా అని మళ్లీ ఎదురుచూస్తూ ఉండటం విఫలమైన వ్యక్తుల లక్షణం.
సంబంధిత కథనం