Eye Care In Summer: వేసవిలో కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి!
Eye Care In Summer: వేసవిలో ఎండ తాపం నుంచి చర్మంతో పాటు కళ్ళను రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. హానికరమైన సూర్యకాంతితో పాటు వేడి, దుమ్ము, ధూళి నుంచి కంటిని కాపాడుకునేందుకు సహాయపడే కొన్ని కంటి సంరక్షణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పాటించి, మీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోండి.
ఎండ తాపం రోజురోజుకు పెరుగుతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉండే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఎండలు మండుతున్న సమయంలో చర్మారోగ్యం గురించి మాత్రమే కాకుండా కళ్ల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి విడుదల అయ్యే సూర్యకాంతి ప్రభావం నేరుగా కళ్ల మీద పడుతుంది. ఎండతో పాటు వేడి గాలి, దుమ్ము, కాలుష్యం కూడా కంటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
తీవ్రమైన అతినీలలోహిత కిరణాలు, నిర్జలీకరణం, ఎక్కువ సమయం మొబైల్, ల్యాప్‌టాప్ చూడటం వల్ల కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట వంటి సమస్యలు వేసవిలో ఎక్కువగా వస్తాయి. వీటిని తగ్గించడానికి కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ సీజన్లో మీరు కంటి సంరక్షణ విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సరళమైన, సహజ పరిష్కారాల ద్వారా వేసవిలో కళ్ళను ఆరోగ్యంగా, సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
సూర్యకాంతి నేరుగా పడనివ్వకండి:
సూర్యుడి కాంతి నేరుగా కళ్ల మీద పడితే కళ్లు త్వరగా పొడిబారతాయి. మంట, దురద వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు సూర్య కిరణాలను కంటి మీద నేరుగా పడనివ్వకండి.
- ఇందుకోసం ఎప్పుడూ సన్ గ్లాసెస్ ధరించండి. UV-రక్షిత సన్ గ్లాసెస్ ఉపయోగించడం మరీ మంచిది.
- టోపీ లేదా ఛత్రిని ఉపయోగించండి. ఇది సూర్యుని తీవ్రమైన కాంతి నుండి కళ్లకు చర్మానికి రక్షణ అందిస్తుంది.
- నేరుగా సూర్యకాంతిని నివారించండి. ముఖ్యంగా ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఈ సమయంలో UV కిరణాలు బాగా బలంగా ఉంటాయి.
హైడ్రేటెడ్‌గా ఉండండి
వేసవిలో కళ్ళు తరచూ పొడిబారకుండా ఉండటానికి, దురద, మంట వంటి సమస్యలు రాకుండా ఉండటానికి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా అవసరం.
- ఇందుకోసం తగినంత నీరు, తాజా పండ్ల రసాలను త్రాగండి.
- దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి హైడ్రేటింగ్ పండ్లను, ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.
ఏసీ, స్క్రీన్ టైం తగ్గించండి..
- మీరు AC గదులలో ఉండే వారైతే కళ్లు త్వరగా పొడిబారతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కళ్ళు తేమగా ఉండేలా హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి. లేదా తరచుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండండి.
- ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించాల్సి వస్తే.. 20-20-20 నియమాన్ని పాటించండి. అంటే ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. మీరు చూసే వస్తువు ఆకుపచ్చగా రంగులో ఉంటే మరింత మంచిది.
- మీ కళ్ళు అలసిపోయినట్లు లేదా చికాకుగా అనిపిస్తే ఐస్ కంప్రెస్ ఉపయోగించండి. ఉపశమనం లభిస్తుంది.
సహజ నివారణలతో ఉపశమనం పొందండి..
కళ్లు దురదగా, మంటగా అనిపించినప్పుడు కంటిని బాగా రుద్దకండి. సమస్య తగ్గించడానికి సహజ నివారణలను ప్రయత్నించండి. ఇందుకోసం..
దోసకాయ- దోసకాయ ముక్కలను గుండ్రంగా కత్తిరించుకుని మీ కళ్ళపై 10 నిమిషాలు ఉంచండి.
రోజ్ వాటర్ - కాటన్ మీద కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి కళ్ళపై పెట్టుకోండి.
అలోవెరా జెల్ - కలబంద గుజ్జును కంటి చుట్టూ అంటే కళ్లకు దూరంగా అప్లై చేసుకోవడం వల్ల కళ్ళ చుట్టు ఉన్న చర్మం చల్లబడుతుంది, వాపు తగ్గుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు..
విటమిన్ A కలిగినవి (క్యారెట్, పాలకూర, చిలగడదుంప)
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (అవిసె గింజలు, అక్రోట్, చేపలు)
విటమిన్ C, E (నారింజ, బాదం, సూర్యకాంతి గింజలు)
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం