Brown Sugar For Skin । మృదువైన, మెరిసే చర్మం పొందడానికి, బ్రౌన్ షుగర్‌తో ఇలా చేయండి!-excellent benefits of brown sugar for glowing skin check easy diy methods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Excellent Benefits Of Brown Sugar For Glowing Skin, Check Easy Diy Methods

Brown Sugar For Skin । మృదువైన, మెరిసే చర్మం పొందడానికి, బ్రౌన్ షుగర్‌తో ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 04:03 PM IST

Brown Sugar For Skin: బ్రౌన్ షుగర్ ఒక ఆహార పదార్థంగా మాత్రమే కాదు, మీ సౌందర్య పోషణకు, చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు. ఎలా వాడాలో తెలుసుకోండి.

Brown Sugar For Skin
Brown Sugar For Skin (istock)

Skincare Tips: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కొందరు మాత్రం తమ అందం కోసం అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా మారేందుకు మార్కెట్లో లభించే ఉత్పత్తులే ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ చర్మ సంరక్షణ కోసం అనేక సహజ పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మీకు మీరుగా ఇంట్లోనే సిద్ధం చేసుకోగలిగే DIY విధానాలు ఎన్నో ఉన్నాయి.

టొమాటో, క్యారెట్, బంగాళాదుంప వంటి కూరగాయలు, పెరుగు, తేనే, చక్కెర వంటి ఆహార పదార్థాలు, తులసి, అలోవెరా, వేప వంటి ఔషధ మొక్కలు మీ చర్మ సంరక్షణ కోసం, మీ అందాన్ని పెంచుకోవడం కోసం వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ఇవి మాత్రమే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. బ్రౌన్ షుగర్ కూడా మీ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది.

Brown Sugar For Glowing Skin - అందమైన చర్మం కోసం బ్రౌన్ షుగర్

మీ చర్మ సౌందర్యానికి బ్రౌన్ షుగర్ ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి

బ్రౌన్ షుగర్ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్ లోని గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్ వంటి కాంపౌండ్స్ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి, మృతకణాలను తొలగిస్తాయి. కొత్త కణాల ఉత్పత్తికి ఆవకాశం కల్పిస్తాయి. బ్రౌన్ షుగర్ చనిపోయిన కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె, బ్రౌన్ షుగర్ సమాన పరిమాణంలో తీసుకుని, దానికి లావెండర్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి, చక్కెర కరిగే వరకు వృత్తాకారంలో మసాజ్ చేసి, 10-15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది.

మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది

బ్రౌన్ షుగర్ సహజ హ్యూమెక్టెంట్. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. సాధారణ చక్కెర కంటే బ్రౌన్ షుగర్ మరింత మెత్తగా ఉంటుంది. చర్మంపై సున్నితమైన ప్రభావం చూపుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా బ్రౌన్ షుగర్ కలపండి, ఆపై కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి, వృత్తాకార కదలికలలో మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

చర్మాన్ని కాంతివంతం చేస్తుంది

బ్రౌన్ షుగర్ డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. చర్మంపై ఉన్న ట్యాన్‌ని తొలగించి, మెరిసేలా చేస్తుంది. టొమాటో ముక్కపై కొద్దిగా బ్రౌన్ షుగర్ చల్లి, యాంటీ క్లాక్ వైజ్‌లో ముఖం, మెడపై నెమ్మదిగా రుద్దంటి. 5 నిమిషాల పాటు రుద్దాక కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ రెండు నిమిషాలు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

మచ్చలు మాయం అవుతాయి

బ్రౌన్ షుగర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోయి మచ్చలు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్ లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఇది మెలనిన్ ఏర్పడటాన్ని కూడా నియంత్రిస్తుంది. నువ్వుల నూనెలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మొటిమలను తగ్గిస్తుంది

బ్రౌన్ షుగర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వలన చర్మంపై బ్యాక్టీరియా వృద్ధిని నివారిస్తుంది, తద్వారా మొటిమలు రాకుండా చేస్తుంది.

బ్రౌన్ షుగర్ ను 2 రోజులకు ఒకసారి మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్ ను ముఖం, మెడకే కాకుండా మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లకు కూడా ఉపయోగించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అలాగే, చర్మంపై బ్రౌన్ షుగర్ ఉపయోగించేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి, లేకపోతే దద్దుర్లు రావచ్చు. స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా తమ చర్మ సంరక్షణ కోసం బ్రౌన్ షుగర్ ఉపయోగించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం