Endu Royyalu Recipe: ఎండు రొయ్యల కూర ఇలా వండితే టేస్టీగా ఉంటుంది, వాసన కూడా రాదు-endu royyalu gravy recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Endu Royyalu Recipe: ఎండు రొయ్యల కూర ఇలా వండితే టేస్టీగా ఉంటుంది, వాసన కూడా రాదు

Endu Royyalu Recipe: ఎండు రొయ్యల కూర ఇలా వండితే టేస్టీగా ఉంటుంది, వాసన కూడా రాదు

Haritha Chappa HT Telugu

Endu Royyalu Recipe: ఎండు రొయ్యలు ఒక రకమైన వాసన వస్తాయి. అందుకే చాలామంది తినరు. ఆ వాసన రాకుండా కర్రీ ఎలా చేయడమో తెలుసుకోండి. రెసిపీ ఇదిగో.

ఎండు రొయ్యల ఇగురు

ఎండు రొయ్యల కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. సముద్ర తీరప్రాంత ప్రజలు ఎక్కువగా ఎండు రొయ్యలను, ఎండు చేపలను తింటూ ఉంటారు. అయితే కొంతమందికి ఈ ఎండు రొయ్యలు లేదా ఎండు చేపల నుంచి వచ్చే వాసన నచ్చదు. దానివల్లే వాటిని తినడానికి ఇష్టపడరు. ఇక్కడ మేము ఎండు రొయ్యల కూర వాసన రాకుండా ఎలా వండాలో చెప్పాము. ఇలా వండితే రొయ్యల ఇగురు టేస్టీగా ఉంటుంది. పైగా చేయడం కూడా చాలా సులువు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఎండు రొయ్యల కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

ఎండు రొయ్యలు - ఒక కప్పు

ఉల్లిపాయలు - రెండు

మెంతులు - పావు స్పూను

జీలకర్ర - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

కారం - ఒకటిన్నర స్పూను

చింతపండు - ఉసిరికాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నూనె - రెండు స్పూన్లు

ఎండు రొయ్యల కర్రీ రెసిపీ

1. ఎండు రొయ్యలను మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి. పైన తలను, కాళ్ళను తీసేసి ఒక దగ్గర పెట్టుకోండి.

2. ఇప్పుడు చింతపండును గ్లాస్ నీటిలో నానబెట్టుకోండి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి పావు స్పూన్ మెంతులు, అర స్పూను జీలకర్ర వేసి బాగా వేయించి వాటిని తీసి పొడిచేసి పెట్టుకోండి.

4. ఇప్పుడు అదే కళాయిలో ఎండు రొయ్యలను కూడా వేయించి పక్కన పెట్టుకోండి.

5. ఇలా ఎండు రొయ్యలను వేయించడం వల్ల వాటి వాసన పోతుంది.

6. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి అర స్పూను జీలకర్ర వేసి వేయించాలి.

7. అందులోనే గుప్పెడు కరివేపాకులను కూడా వేయాలి.

8. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

9. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేగాక అందులో రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి.

10. ఈ రొయ్యలను కావాలనుకుంటే రెండు నిమిషాలు నీళ్లల్లో కూడా నానబెట్టవచ్చు.

11. ఈ రొయ్యలను వేశాక పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.

12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. రెండు నిమిషాలు అలా వేయించి ఇప్పుడు చింతపండు నీటిని వేయాలి.

13. చింతపండును పిసికి బయటపడేయాలి. ఈ మొత్తం మిశ్రమం 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి.

14. ఆ తర్వాత మూత తీసి మెంతులు, జీలకర్ర పొడిని వేసి బాగా కలపండి.

15. చిన్న మంట మీద ఐదు నిమిషాలు ఉడికించండి. తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును చల్లుకోండి. అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

16. టేస్టీ ఎండు రొయ్యల కూర రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

పచ్చి రొయ్యల్లాగే ఎండు రొయ్యలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా ఈ కూరను కేవలం పావుగంట నుంచి 20 నిమిషాల్లో వండేసుకోవచ్చు. కాబట్టి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ కూర వండుకోవడానికి ప్రయత్నించండి. వాసన మీకు నచ్చకపోతే మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి. అది ఎలాంటి వాసన రాదు. పైగా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం