Patriarchy: మగవాళ్లే గొప్ప అనే నమ్మకంతో నష్టపోతోంది అబ్బాయిలే.. సమానం అనుకుంటేనే సంతోషం
Patriarchy: పితృస్వామ్య వ్యవస్థతో అబ్బాయిలకే లాభం జరుగుతుంది అనుకుంటాం. దానివల్ల ఏ నష్టాలున్నాయో తెలుసా?
పితృస్వామ్య వ్యవస్థ వల్ల అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని తరచూ మాట్లాడుతుంటాం. కానీ దీనివల్ల అబ్బాయిలకూ తీవ్రమైన నష్టం, ఒత్తిడి ఉంటుందని పట్టించుకోం. అమ్మాయిలు స్వేచ్ఛగా చేసే కొన్ని పనులు అబ్బాయిలు చేయలేరు. వాళ్ల భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి, గట్టిగా ఏడవలేరు, ఎక్కువ ప్రేమా చూయించలేరు, సున్నిత మనస్తత్వం ఉన్నా తప్పే.. వీటివల్ల అబ్బాయిలు కూడా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

1. భావోద్వేగాల నియంత్రణ:
మగవాళ్లంటే ఇలాగే ఉండాలని అందరూ ఫిక్సయిపోయారు. అబ్బాయిలంటే గంభీర్యంగానే ఉండాలి అంటారు. దాంతో వాళ్లకు దు:ఖం వచ్చినా కూడా బయటకు చెప్పుకోరు. మనస్ఫూర్తిగా ఏడ్చినా కూడా బలహీనుడిలా చూస్తారు. బాధ వచ్చినా చెప్పుకోలేరు. వాళ్ల భయాలను బయటపెట్టలేరు. దీనివల్ల ఒకరకంగా మానసికంగా ఒత్తిడి పడుతున్నట్లే.
2. మోయలేని కష్టం:
భార్య భర్తల విషయంలో అబ్బాయే గొప్ప అనే నియమం వల్ల మంచి జరుగుతుంది అనేది అపనమ్మకం మాత్రమే. ఇద్దరూ సమానమే అని అందరూ అనుకుంటే ప్రతి బంధం కలకాలం నిలుస్తుంది. భార్యకు భర్త ఎవరేమైనా అనుకుంటారనే భయం లేకుండా సాయం చేయగలుగుతారు. తన మీద పని భారం తగ్గించగలుగుతారు. అలాగే భర్త సంపాదన మీదే ఇల్లు గడవాలనే నియమమూ మంచిది కాదు. దీనివల్ల ఉద్యోగం నచ్చకపోయినా, ఎంత కష్టంగా ఉన్న మానేయలేరు. కుటుంబం ఆధారపడి ఉందన్న కారణంతో అందులోనే కొనసాగాలి. అదే భార్యాభర్తలిద్దరూ సమానం అనుకుంటే మీ కష్టంలో మీ భార్య సంపాదన ఆదుకుంటుంది. ఇద్దరూ సమానంగా ఆనందంగా ఉండగలుగుతారు.
3. నిశ్శబ్ద పోరాటం:
ఒక బరువెత్తాలన్నా, ఒక పని చేయాలన్నా, సమస్యలు తీర్చాలన్నా, డబ్బు కష్టమున్నా అది మగవాళ్లంటే ఒక్కరే చేసేయాలి. పక్కనున్న వాళ్ల సాయం తీసుకోకూడదు. అమ్మాయిల సాయం అస్సలే తీసుకోకూడదు. ఇలాంటి ఆలోచనల వల్ల బయటికి వాళ్లకు సాయం అవసరం అయినా చెప్పలేరు. క్రమంగా ఆందోళనకు, ఒత్తిడికీ లోనవుతారు. తీర్చలేని సమస్యల భారం వాళ్ల మీద పడ్డప్పుడు ఆత్మహత్య దాకా వెళ్లే వాళ్లూ ఉంటారు.
4. రిస్క్ చేయాలి:
అబ్బాయిలు అన్నింటికీ భయపడితే ఎలా? దేనికీ జంకొద్దు.. లాంటి నియమాల వల్ల అనవసరమైన ప్రమాదాల్లో పడతారు. వాళ్ల సామర్థ్యాన్ని మించి రిస్క్ తీసుకుని వాళ్లతో పాటే కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడతారు. కాబట్టి అబ్బాయైనా, అమ్మాయైనా వాళ్ల సామర్థ్యాన్ని మించిన భారాన్ని మోయలేరని అర్థం చేసుకోవాలి.
టాపిక్