Eggs Hacks: గుడ్ల విషయంలో మీ పనులను సులువు చేసే చిట్కాలు.. పొట్టు ఈజీగా తీయడం నుంచి టెస్టింగ్ వరకు..
Eggs Hacks: కోడిగుడ్లను రెగ్యులర్‌గా తింటున్నారా? అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే గుడ్ల విషయంలో పని సులువవుతుంది. మెరుగ్గా వండుకోవచ్చు. అలా గుడ్ల కోసం 5 టిప్స్ ఇక్కడ చూడండి.
ఎన్నో కీలకమైన పోషకాలు ఉండే కోడిగుడ్లను రెగ్యులర్‌గా తినడం ముఖ్యం. ఆరోగ్యానికి చాలా రకాలుగా ఇవి మేలు చేస్తాయి. ప్రొటీన్, విటమిన్ ఏ, బీ12, బీ2, డీ, ఐరన్ సహా చాలా విటమిన్లు, మినరల్స్ సహా పోషకాలు వీటిల్లో ఉంటాయి. గుడ్లను రోజులో ఎప్పుడైనా తినొచ్చు. కోడిగుడ్లను వండుకోవడం సులభమే అయినా.. ఉడికించిన వాటి పొట్టును తీయడం కొందరికి కష్టంగా అనిపిస్తుంది. గుడ్డు బాగానే ఉందా, సొనను సులువుగా వేరు చేయడం కూడా సందేహంగా ఉంటుంది. అయితే, కోడిగుడ్ల విషయంలో ఈ పనులను సులభం చేసే 5 చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
పొట్టు సులువుగా వచ్చేలా..
కోడిగుడ్డును ఉడకపెట్టిన తర్వాత దానిపై పొట్టు తీయడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. పొట్టు తొలగించేందుకు చాలా కష్టపడతారు. అయితే, గుడ్డు ఉడికిన తర్వాత దాన్ని కాస్త పగుళ్లు వచ్చేలా కొట్టి చల్లనీటిలో మునిగేలా కాసేపు వేయాలి. ఆ తర్వాత గుడ్డుపై పొట్టు సులువుగా వచ్చేస్తుంది. గుడ్లు ఉడికేటప్పుడే నీటిలో టీస్పూన్ వంట సోడా వేస్తే.. పొట్టు సులువుగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
పగలకుండా..
కోడిగుడ్లను నీటిలో ఉడకపెట్టే సమయంలో కొన్నిసార్లు వాటికి పగుళ్లు వస్తుంటాయి. ఒక్కోసారి నీటిలోనే పగిలిపోతుంటాయి. ఇలా జరుగుతుంటే నీటిలో కాస్త వెనిగర్ వేయాలి. దీనివల్ల ఉడికే సమయంలో గుడ్డుకు పగుళ్లు రాకుండా ఇది సహకరిస్తుంది. గుడ్డులో నుంచి ద్రవం బయటికి రాకుండా కూడా చేయగలదు.
గుడ్డు టెస్టింగ్ ఇలా..
మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కోడిగుడ్లు తాజాగా ఉన్నాయా లేదా అని ఇంట్లోనే టెస్టు చేయవచ్చు. చెడిపోయిన గుడ్లను గుర్తించవచ్చు. ఇందుకోసం ముందుగా ఓ గ్లాసులో నీరు పోసుకోవాలి. దాంట్లో గుడ్డును వేయాలి. ఒకవేళ గుడ్డు మునిగితే అది తాజాగా, వండుకునేందుకు బాగుందని అర్థం. నీటిలో గుడ్డు తేలితే అది చెడిపోయిందని తెలుసుకోవచ్చు.
సొనను సులువుగా విడదీయండిలా..
గుడ్డును పగలగొట్టినప్పుడు పచ్చసొనను వేరు చేయాలంటే ఓ సులువైన మార్గం ఉంది. ముందుగా గుడ్డు పగులగొట్టాలనుకున్న గిన్నెపై ప్లాస్టిక్ గిరాటు పెట్టాలి. దానిపై గుడ్డును పగులగొట్టాలి. అప్పుడు ఎగ్ వైట్ కిందికి జారిపోయి.. గుడ్డు సొన గిరాటులోనే నిలిచిపోతుంది. ఇలా సొనను వేరుచేయవచ్చు. స్టైనర్‌తోనూ ఇలా చేయవచ్చు.
మైక్రోవేవ్‍లో ఇలా..
కొత్తగా వంట చేస్తున్న కొందరికి ప్యాన్‍పై ఆమ్లెట్ వేయడం కొందరికి కష్టంగా ఉంటుంది. సరిగా రాదు. అలాంటి వారు మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే సులువుగా డిఫరెంట్‍గా ట్రై చేయవచ్చు. ఓ మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలో గుడ్డు పగులగొట్టాలి. దాంట్లో ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లిపాయలు, కారం లాంటివి వేయాలి. ఆ గిన్నెను మైక్రోవేవ్‍లో పెడితే సుమారు రెండు నిమిషాల్లోనే గిన్నెలో ఆమ్లెట్ రెడీ అవుతుంది.
కోడిగుడ్లను రెగ్యులర్‌గా తినడం ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. గుండె, కళ్లు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి కూడా గుడ్లు తినడం సూటవుతుంది. ఇందులోని కీలకమైన పోషకాలు ఓవరాల్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
టాపిక్