Egg Sambar: ఎగ్ సాంబార్ ఎప్పుడైనా తిన్నారా? రెసిపీ ఇదిగో, ఒకసారి ట్రై చేయండి
Egg Sambar: ఎగ్ కర్రీ, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రై తిని ఉంటారు. ఒకసారి ఎగ్ సాంబార్ ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు. రుచి కూడా అదిరిపోతుంది.
Egg Sambar: కోడి గుడ్డుతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎప్పుడూ కోడి గుడ్డుతో బుర్జీ కూర, ఆమ్లెట్ వంటివే చేస్తూ ఉంటారు. ఒకసారి కోడిగుడ్డు సాంబార్ ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. అరగంటలో ఇది రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ సాంబార్ రెసిపీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు - ఆరు
కందిపప్పు - అరకప్పు
ఆవాలు - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
నూనె - సరిపడినంత
పసుపు - పావు స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - నాలుగు
మునక్కాడలు - ఒకటి
పుదీనా ఆకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - నిమ్మకాయ సైజులో
టమోటాలు - రెండు
నీరు - సరిపడినంత
కారం - ఒక స్పూను
మెంతి పొడి - పావు స్పూను
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి - ఐదు రెబ్బలు
ఎగ్ సాంబార్ రెసిపీ
1. కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. చింతపండును నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి.
3. కందిపప్పును ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనె వేడెక్కాక ఆవాలు వేసి వేయించాలి.
6. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.
7. అవి రంగు మారేవరకు వేయించాక పసుపు వేసి కలపాలి.
8. అందులోనే నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కరివేపాకులో వేసి వేయించుకోవాలి.
9. తర్వాత ములక్కాడ ముక్కలను, కొత్తిమీర తరుగును, ఉప్పు వేసి ఉడికించాలి.
10. ఒక ఐదు నిమిషాలు అవి ఉడికాక సన్నగా తరిగిన టమోటోలను వేసి కలిపి మూత పెట్టాలి.
11. చింతపండు రసాన్ని పిండి చింతపండును పడేయాలి. ఆ రసాన్ని కూడా ఈ టమోటాల మిశ్రమంలో వేయాలి.
12. కారం, మెంతి పొడి కూడా వేసి బాగా కలపాలి. ఒక గ్లాసు నీరు వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
13. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి.
14. ఆ పేస్టును ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
15. మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి.
16. ఈ లోపు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను మెత్తటి పొడిలా చేసి అందులో వేయాలి.
17. చివరగా ఉడికించిన కోడిగుడ్లను వేసి చిన్న మంట మీద 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే టేస్టీ ఎగ్ సాంబార్ రెడీ అయినట్టే.
ఎగ్ సాంబారు వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే రెండు పూటలకు సరిపోతుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. దీనిలో ములక్కాడలు కూడా వేసాము కాబట్టి అదిరిపోతుంది. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని లేదా కారాన్ని అధికంగా తీసుకుంటే చాలు. ఒకసారి ఈ ఎగ్ సాంబార్ చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీకే తినాలనిపిస్తుంది. ఇందులో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి వారంలో రెండు నుంచి మూడుసార్లు ఈ ఎగ్ సాంబార్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
టాపిక్