Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు
Egg potato Fry: పిల్లలకు ఇష్టమైన వంటల్లో బంగాళదుంప ఖచ్చితంగా ఉంటుంది. బంగాళదుంపలతో చేసిన ఫ్రై ఇష్టంగా తింటారు. ఆ ఫ్రైకి కోడిగుడ్డు కూడా జతచేరిస్తే రుచి అదిరిపోతుంది.
Egg potato Fry: ఎక్కువమంది పిల్లలు బంగాళదుంపలతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. బంగాళదుంపలు ఒక్కటే తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి చేరవు. ఒకసారి కోడి గుడ్డును కూడా కలిపి బంగాళదుంప ఫ్రై చేసి చూడండి. పిల్లలకు ఎంతో నచ్చుతుంది. ముఖ్యంగా బంగాళదుంప, కోడిగుడ్డు ఈ రెండింట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ కోడిగుడ్డు బంగాళదుంప ఫ్రై చేయడం కూడా చాలా సులువు. కేవలం 20 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తినడం ఖాయం.

కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు - రెండు
కోడిగుడ్లు - రెండు
పచ్చిమిర్చి - మూడు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
ఉల్లిపాయ తరుగు - కప్పు
కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ
1. బంగాళదుంపలను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2. వాటిని నీటిలో వేసి పావుగంట సేపు నానబెట్టాలి.
3. ఇలా చేయడం వల్ల బంగాళదుంపల్లో ఉన్న పిండి పదార్థం కొంతమేరకు బయటికి వస్తుంది.
4. ఇక గుడ్లను ఒక గిన్నెలో కొట్టి వేసుకోవాలి. ఆ గుడ్లను బాగా గిల కొట్టాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. నీటిలో ఉన్న బంగాళదుంపలను తీసి నీరు లేకుండా పిండి నూనెలో వేసి వేయించుకోవాలి.
7. ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి.
8. అవి కాస్త రంగు మారుతాయి. ఆ సమయంలోనే ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి.
9. అలాగే పసుపు, కారం కూడా వేసి వేయించుకోవాలి.
10. ఒక ఐదు నిమిషాలు అలా వేయించాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
11. గుప్పెడు కరివేపాకులను చల్లుకోవాలి.
12. ఇప్పుడు ముందుగా గిలక్కొట్టించుకున్న గుడ్లను వేసి బాగా కలపాలి.
13. ఒక ఐదు నిమిషాలు పాటు చిన్న మంట మీద వేయించాలి.
14. అంతే కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని చూస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
15. కోడిగుడ్లు, బంగాళదుంపలు ఈ రెండిట్లో కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. పిల్లలకు వీటిని పెట్టడం వల్ల అన్ని రకాల పోషకాలు అందుతాయి.
కోడిగుడ్డు పొటాటో ఫ్రై ని కేవలం పిల్లలే కాదు పెద్దలు కూడా తినవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి లేదా కారాన్ని అధికంగా వేసుకుంటే సరిపోతుంది. నిజానికి ఇది పిల్లల రెసిపీ. పిల్లలు కోడిగుడ్లతో చేసిన వంటకాలను బంగాళదుంపలతో చేసిన ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతారు. మరిన్ని పోషకాలు అందించేందుకు ఇలా కోడిగుడ్డు, ఆలూ కాంబినేషన్లో ఫ్రై రెసిపీ ఇచ్చాము. పప్పు లేదా సాంబార్ కు జతగా ఈ ఫ్రై ని తింటే టేస్టీగా ఉంటుంది. పెద్దలు కాస్త స్పైసీగా చేసుకుంటేనే దీని రుచి తెలుస్తుంది.
టాపిక్