Egg Keema Curry: ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే అన్నంలోకి చపాతీలోకి అదిరిపోతుంది
Egg Keema Curry: చికెన్ కీమా, మటన్ కీమాలాగే ఎగ్ కీమా కర్రీ వండుకోవచ్చు. ఉడకబెట్టిన గుడ్లతో ఈ ఎగ్ కీమా కర్రీ వండుతారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

Egg Keema Curry: కీమా కర్రీ అనగానే అందరికీ మటన్ కీమా, చికెన్ కీమా మాత్రమే గుర్తొస్తాయి. ఉడకబెట్టిన గుడ్లతో కీమా కర్రీ వండొచ్చు. ఇది అన్నంలోకే కాదు, చపాతీలోకి, రోటీలోకి టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కాస్త మసాలా దట్టించి వండుకుంటే పెద్దవారికి తెగ నచ్చేస్తుంది. దీన్ని కావాలనుకుంటే స్పైసీగా వండుకోవచ్చు. లేదా సాధారణంగా వండుకున్నా రుచిగానే ఉంటుంది. ఒక్కసారి ఈ ఎగ్ కీమా కర్రీ వండుకొని చూడండి. దీని రుచికి మీరు దాసోహం అయిపోతారు.
ఎగ్ కీమా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు - ఏడు
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి తురుము - ఒక స్పూను
అల్లం తురుము - ఒక స్పూను
పచ్చిమిర్చి - ఒకటి
ఉల్లిపాయలు - రెండు
నూనె - తగినంత
టమాట - ఒకటి
గరం మసాలా - ఒక స్పూను
కారం - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - రెండు స్పూన్లు
ఎగ్ కీమా కర్రీ రెసిపి
1. కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి వేయించుకోవాలి.
4. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి. అవి రంగు మారేవరకు ఉంచాలి.
5. ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
6. సన్నగా తరిగిన టమోటో ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. పైన మూత పెడితే టమాటాలు మెత్తగా మగ్గుతాయి.
8. ఈ లోపు గుడ్లను సన్నగా తురుముకోవాలి.
9. ఆ తురుమును మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
10. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి.
11. ఇగురులా కావాలనిపిస్తే పావు గ్లాసు నీటిని వేయవచ్చు. లేకపోతే అది కాస్త కీమా వేపుడులాగా వస్తుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
పిల్లలకి లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలో ఆలోచించేటప్పుడు ఒకసారి ఈ ఎగ్ కీమా కర్రీ వండి పెట్టి చూడండి. వారికి చాలా నచ్చుతుంది. ఇందులో కోడిగుడ్లను ఎక్కువగా వేస్తాం కాబట్టి ప్రతి ముద్దలో కోడి గుడ్డు ముక్కలు వస్తాయి. ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. సాంబార్ చేసుకున్నప్పుడు దానికి జతగా కూడా ఈ ఎగ్ కీమా వేపుడు టేస్టీగా ఉంటుంది. చపాతీ రోటీల్లోకి ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.