Egg Roast: కోడిగుడ్లతో టేస్టీ ఎగ్ ఘీ రోస్ట్ చేసుకోండి, నోరూరిపోతుంది రెసిపీ ఇదిగోంది-egg ghee roast recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Roast: కోడిగుడ్లతో టేస్టీ ఎగ్ ఘీ రోస్ట్ చేసుకోండి, నోరూరిపోతుంది రెసిపీ ఇదిగోంది

Egg Roast: కోడిగుడ్లతో టేస్టీ ఎగ్ ఘీ రోస్ట్ చేసుకోండి, నోరూరిపోతుంది రెసిపీ ఇదిగోంది

Haritha Chappa HT Telugu
Feb 05, 2025 11:30 AM IST

Egg Roast: కోడిగుడ్లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము కోడిగుడ్లతో చేసే ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ ఇచ్చాము. దీన్ని నెయ్యితో చేస్తాము. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది.

ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ
ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ (vanitha's kitchen)

కోడిగుడ్లతో చేసే వంటకాలు అంటే మీకు ఇష్టమా? ఇక్కడ మేము ఒక స్పెషల్ రెసిపీ ఇచ్చాము. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కూరను ఒక్కసారి వండుకొని చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. చపాతీతో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. రెసిపీకి మీరు అభిమానులు అయిపోవడం ఖాయం.

ఎగ్ ఘీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

ధనియాలు - రెండు స్పూన్లు

మిరియాలు - అర స్పూను

జీలకర్ర - ఒక స్పూను

సోంపు - ఒక స్పూను

మెంతులు - పావు స్పూను

లవంగాలు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఎండుమిర్చి - ఆరు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్

చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో

నీళ్లు - తగినన్ని

నెయ్యి - రెండున్నర స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

పెరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఎగ్ ఘీ రెసిపీ

1. కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ప్రతి గుడ్డును రెండు ముక్కలుగా కోసుకున్నా మంచిదే లేదా కోడి గుడ్డును పూర్తిగా అలా వండుకున్నా టేస్టీ గానే ఉంటుంది.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.

4. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేయాలి. ఆ మిక్సీ జార్ లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

5. తగినంత నీళ్లు పోసి బాగా రుబ్బాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

6. మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి రెండున్నర స్పూన్ల నెయ్యిని వేయాలి.

7. ఆ నెయ్యిలో ఉల్లిపాయల తరుగును బాగా వేయించాలి.

8. ఉల్లిపాయలు బాగా వేగాక కరివేపాకులను వేసి వేయించుకోవాలి.

9. ఈ రెండు వేగాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. పైన మూత పెట్టి నూనె పైకి తేలే వరకు కలుపుకోవాలి.

11. తర్వాత పెరుగును కూడా వేయాలి. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

12. అలాగే పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

13. ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను లేదా కోడిగుడ్డు ముక్కలను వేసి బాగా కలపాలి.

14. చిన్న మంట మీద ఈ మొత్తం మిశ్రమాన్ని దగ్గరగా ఇగురులా అయ్యే వరకు ఉడికించుకోవాలి.

15. తర్వాత పైన కొత్తిమీర కరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ ఎగ్ ఘీ రోస్ట్ రెడీ అయినట్టే.

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కోడిగుడ్డుతో చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లో కూడా అదిరిపోతుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేయడం చాలా సులువు. కాబట్టి ఎగ్ ఘీ రోస్ట్ చేయడానికి అరగంట సమయం సరిపోతుంది. కోడిగుడ్డు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని తినడం చాలా ముఖ్యం.

Whats_app_banner

సంబంధిత కథనం