Spicy food: స్పైసీ ఫుడ్ అధికంగా తింటున్నారా? అయితే మీ ఆయుష్షును మీరే తగ్గించుకుంటున్నట్టు లెక్క
Spicy food: స్పైసీగా ఉండే ఆహారం కొంతమందికి చాలా నచ్చుతుంది. స్పైసీ ఫుడ్ ఇష్టం కదా అని రోజులో మూడో పూటలా ప్రతి రోజూ తిన్నారంటే మీకు ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Spicy food: కొన్ని రకాల కూరలు స్పైసీగా తింటే టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా బిర్యానీ, చికెన్, మటన్, గుడ్డు కూరలు వంటివన్నీ ఎక్కువమంది స్పైసీగా తినేందుకు ఇష్టపడతారు. ఇష్టం కదా అని ప్రతి రోజూ స్పైసీగా తింటే మీ ఆయుష్షును మీరే తగ్గించుకున్నట్టు.
రామెన్ నూడుల్స్ గురించి వినే ఉంటారు. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. అంత స్పైసీగా తినడం ఆరోగ్యకరము కాదని యూరోపియన్ దేశాల్లో ఈ రామన్ నూడుల్స్ ను నిషేధించారు. అంతేకాదు అమెరికాలో జరిగిన ఒక స్పైసీ ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వ్యక్తి ఆ తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడి మరణించినట్టు కూడా తెలుస్తోంది. దీన్నిబట్టి కారం అధికంగా తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కారంలో క్యాప్సైసిన్ ఉంటుంది. అందుకే అది అంత కారంగా ఉంటుంది. నోటికి మండుతున్న అనుభూతిని ఇచ్చే సమ్మేళనం క్యాప్సైసిన్. మిరపకాయల్లో ఎన్నో రకాల క్యాప్సైసిన్లు ఉంటాయి.
క్యాప్సైసిన్ అధికంగా ఉండే మిరపకాయలను, కారాన్ని ఆహారాల్లో అధికంగా వేసి వండితే ఆరోగ్యానికి జరగాల్సిన నష్టం అంతర్గతంగా జరిగిపోతుంది. అధికంగా క్యాప్సైసిన్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి, దాన్ని తినవద్దని తమ దేశస్థులను హెచ్చరించింది డెన్మార్క్ దేశం.
కారం ఎక్కువైతే కనిపించే లక్షణాలు
క్యాప్సైసిన్ అధికంగా ఉన్న కారాన్ని, పచ్చిమిరపకాయలను వేసుకుని కూరలను, బిర్యానీలను తినడం వల్ల చాలా తక్కువ కాలంలోనే పొట్టలో మంట మొదలవుతుంది. అది గుండెకు చేరుతుంది. వికారంగా అనిపించడం, ఛాతీలో మంట, విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు మొదలవుతాయి. మైకం కమ్మినట్టు అవుతుంది. శరీరానికి చెమటలు పడుతుంది. ఇలాంటి లక్షణాలు మీరు స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే కనిపిస్తే మీ శరీరం ఆ కారాన్ని తట్టుకోలేకపోతుందని గుర్తించాలి.
కారం నిండిన ఆహారాన్ని తిన్న తర్వాత ఒక గంట లేదా రెండు గంటల్లో మీకు పొత్తికడుపులో నొప్పి రావడం, పొట్టలో అరగనట్టు అనిపించడం వంటివి ఉన్నా కూడా మీరు కారాన్ని తగ్గించాలని అర్థం చేసుకోండి.
కారంగా ఉన్న ఆహారాన్ని తినగానే మన నరాలు యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు శరీరం మండుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మన శరీరం తట్టుకునేంత కారాన్ని మాత్రమే తినాలి. ప్రతిరోజు స్పైసీ ఫుడ్‌ను తినడం ఎంత మాత్రం మంచిది కాదు.
శరీరంలో చేరిన కారం లేదా పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ పిల్లల్లో విషపూరితంగా కూడా మారుతుంది. కాబట్టి వారికి అధికంగా కారము లేదా పచ్చిమిర్చి వేసిన ఆహారాన్ని తినకూడదు.
కారంతో క్యాన్సర్ వస్తుందా?
ఒక అధ్యయనం ప్రకారం అధికంగా కారం తినే వారిలో పొట్ట క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కారంగా ఉన్న ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కారాన్ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అలాగే గుండె సంబంధం వ్యాధులు ఉన్నవారు కూడా తినకూడదు. వారికి అధిక కారం ఎంతో హాని చేస్తుంది. ఎవరైనా కూడా వయసుతో సంబంధం లేకుండా తక్కువ కారాన్ని తింటేనే ఆరోగ్యం. స్పైసీ ఫుడ్ ఎప్పుడైనా అనారోగ్యానికి కారణం అవుతుంది. ఉన్నంతలో ఉప్పును, కారాన్ని తగ్గించి తింటేనే శరీరం ఆరోగ్యంగా మనగలుగుతుంది.