Dried Fish: ఎండు చేపలు తింటే ఆరోగ్యమే, కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే మాత్రం ముప్పే-eating dried fish is healthy but it is not good for people with these health problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dried Fish: ఎండు చేపలు తింటే ఆరోగ్యమే, కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే మాత్రం ముప్పే

Dried Fish: ఎండు చేపలు తింటే ఆరోగ్యమే, కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే మాత్రం ముప్పే

Haritha Chappa HT Telugu

Dried Fish: ఎండు చేపలు తినమని వైద్యులు చెబుతూ ఉంటారు. పచ్చి చేపల్లో ఉన్నట్టే ఎండు చేపల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఎండు చేపలను తినకూడదు.

ఎండుచేపలు ఎవరు తినకూడదు? (Pexels)

పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలు తక్కువ ధరకే లభిస్తాయి. అలాగే అవి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. అందుకే ఎండు చేపల్ని ఎక్కువగా తింటూ ఉంటారు. తీర ప్రాంతంలోని ప్రజలు వారంలో నాలుగైదు రోజులు ఎండు చేపలు తినేందుకే ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో రకాల పోషకాలను కూడా కలిగి ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఎండు చేపలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎవరెవరు ఎండు చేపలకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.

పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలు ఒక్కసారి కొనుక్కుంటే నెలల తరబడి నిల్వ ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఎండు చేపలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ వీటన్నించి వచ్చే వాసన నచ్చక తినడం మానేస్తూ ఉంటారు. అయితే ఎండు చేపలు తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎండుచేపల్లో ఉండే పోషకాలు

ఎండు చేపల్లో ఫాస్పరస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటికి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే ఎముకలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఎండు చేపలను తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని కూడా చెబుతారు. ముఖ్యంగా మహిళలు ఎండు చేపలను కచ్చితంగా తినాలని అంటారు. వారికి మూత్రాశయం, గర్భాశయ సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఎండు చేపల సహాయపడతాయని అంటారు. అందుకే మహిళలు కూడా ఎండు చేపలను ఇష్టంగానే తింటారు. అయితే కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి.

ఎండు చేపలు ఎవరు తినకూడదు?

ఎండు చేపల్లో సోడియం అధికంగా ఉంటుంది. అంటే ఉప్పు అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఎండు చేపలను తింటే హైబీపీ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎండు చేపలకి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే సోడియం రక్తపోటుని పెంచి సంబంధిత వ్యాధులు ఎక్కువ వచ్చేలా చేస్తుంది.

అలాగే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కూడా ఎండు చేపలను ఎక్కువగా తినకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎండు చేపలకి దూరంగా ఉంటే మంచిది. వారికి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చర్మ అలెర్జీల బారిన తరచూ పడుతున్న పడేవారు కూడా ఎండు చేపలను తినకపోవడం మంచిది. ఎందుకంటే వీటి వల్ల కూడా చర్మ అలెర్జీలు రావచ్చు. దురద, పొక్కులు వంటివి కనిపిస్తాయి. మీరు ఇలాంటి పైన చెప్పిన సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటిని ఎండు చేపలకు దూరంగా ఉండటమే ఉత్తమం.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం