Night Meals: రాత్రి భోజనం తొమ్మిది గంటల తర్వాత తింటున్నారా? స్ట్రోక్ వచ్చే అవకాశం మీకే ఎక్కువ
Night Meals: రాత్రి భోజనం ఆలస్యంగా తినే వారిలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 28 శాతం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
Night Meals: రాత్రి భోజనం త్వరగా తినమని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తూనే ఉంటారు. అయినా కూడా ఎంతోమంది రాత్రి భోజనాన్ని చాలా ఆలస్యంగా చేస్తారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత తినే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలా ఎవరైతే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేస్తారో అలాంటి వారికి గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం మిగతా వారితో పోలిస్తే రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారిలో 28 శాతం అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనం చెప్పింది. నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో లక్ష మందిపై పరిశోధన చేసినట్టు తేలింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆ లక్ష మందిని పరిశోధించారు శాస్త్రవేత్తలు.

రాత్రి భోజనం
ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. రోజులో మొదటి భోజనమైన అల్పాహారాన్ని ఆలస్యంగా చేసేవారిలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఒక్కో గంట ఆలస్యంగా తింటున్న కొద్దీ సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం ఆరు శాతం పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. అలాగే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారిలో స్ట్రోక్ లేదా ఇస్కిమిక్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశం 28 శాతం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం వెల్లడించింది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటుపై అధివక ప్రభావాన్ని చూపించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
సాయంత్రం సమయంలోనే రక్తం గడ్డలు కట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వంటి పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనం వివరిస్తోంది. భోజన సమయాలు ప్రతిరోజూ ఒకేలా ఉండాలని, అది కూడా సమయానికి తినాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. ప్రతి గంటా ఆలస్యం చేస్తున్న కొద్దీ ఒక్కొక్క అనారోగ్యాన్నీ స్వాగతించినట్టేనని వివరిస్తున్నారు.
రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల కరోనరీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. రాత్రి భోజనం ఆలస్యం చేస్తున్న ప్రతి గంటా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎనిమిది శాతం పెరుగుతున్నట్టు తేల్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది మహిళల్లో ఈ ఫలితాలు కనిపించాయి. బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం చేసినా కూడా కరోనరీ గుండె జబ్బుల ప్రమాదం 11 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం తెలిపింది.
రాత్రిపూట ఏమీ తినకుండా ఉపవాసం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట ఉపవాసం చేయడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఏడు శాతం తగ్గుతున్నట్టు తెలుస్తోంది.
కాబట్టి అల్పాహారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో పూర్తి చేయాలి. మధ్యాహ్నం భోజనం ఒంటిగంటకు చేసెయ్యాలి. అలాగే రాత్రి 7:30 నుంచి 9 గంటలలోపు భోజనాన్ని పూర్తి చేయాలి. ఇలా ప్రతిరోజూ ఒకే వేళలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన తక్కువగా పడతారు. అలాగే శరీరం బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు.