Pomegranate for month: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు నెలరోజుల పాటూ తిని చూడండి, మీలో జరిగే మార్పులు ఇవే-eat a pomegranate every day for a month and see what happens to you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pomegranate For Month: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు నెలరోజుల పాటూ తిని చూడండి, మీలో జరిగే మార్పులు ఇవే

Pomegranate for month: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు నెలరోజుల పాటూ తిని చూడండి, మీలో జరిగే మార్పులు ఇవే

Haritha Chappa HT Telugu

Pomegranate for month: దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అన్ని సీజన్లలో కూడా దొరుకుతుంది. ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు తిని చూడండి... మీలో ఎన్ని మార్పులు కలుగుతాయో.

దానిమ్మ పండుతో అందం ఆరోగ్యం (Pixabay)

దానిమ్మ పండు ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. దీన్ని శక్తివంతమైన ఆహారంగా చెప్పుకుంటారు. దీని ఎరుపు గింజలు మనలో ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. పైగా ఇది ఎంతో శక్తివంతమైన పోషకాలు కలిగిన పండు కూడా. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ నిండి ఉంటుంది. మీ ఆరోగ్యానికి ఇదొక గేమ్ ఛేంజర్ కూడా కావచ్చు. ప్రతిరోజూ ఒక దానిమ్మ పండును తిని చూడండి. నెల రోజుల్లో మీ శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీకే అర్థమవుతుంది. దానిమ్మ పండు రోజూ ఒకటి తినడం వల్ల మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవిగో.

గుండె ఆరోగ్యానికి

దానిమ్మ పండులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హై బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ధమనులలో అడ్డంకులు ఏర్పడవు. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.

పేగు ఆరోగ్యానికి

దానిమ్మ పండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ క్రియకు ఇది ఎంతో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానిమ్మలో ఉన్న ప్రీ బయోటిక్స్, పేగు బాక్టీరియాకు సహకరిస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

రోగనిరోధక వ్యవస్థ

దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతుంది. ఈ పండులో యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఇది మీకు రక్షణగా నిలుస్తుంది.

చర్మం మెరుపుకు

ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే రెండు మూడు వారాల్లోనే మీ చర్మం లో మార్పును చూస్తారు. అది ప్రకాశవంతంగా మారుతుంది. మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా పడదు. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి మీ చర్మంపై ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండు కోలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారికి

దానిమ్మ పండ్లు తింటే తీయగా అనిపిస్తాయి... కానీ వాటి గ్లైసెమిక్ ఇంటెక్ష్ చాలా తక్కువ. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ దానిమ్మ పండు తింటే ఎంతో మంచిది.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

దానిమ్మ పండు తినడం వల్ల జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పని తీరు మెరుగుపడతాయి. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. అల్జీమర్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా దానిమ్మ పండ్లు ఎంతో మంచివి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి తిన్నాక మీకు చాలా సేపు ఆకలి వేయదు. అనవసరమైన ఆహారం తినాలన్న కోరికలను కూడా కట్టడి చేస్తుంది. కాబట్టి మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం