Drumstick fish Pulusu: మునక్కాయ కూరకు అభిమానులు ఎక్కువ. అలాగే చేపల పులుసుకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే. ఇక మునక్కాయ, చేపలు కలిపి చేస్తే ఆ రుచి మాములుగా ఉండదు. ఆ కమ్మని పులుసును వేడివేడి అన్నంలో వేసుకుని తింటే... తినే కొద్దీ మరింతగా తినాలనిపిస్తుంది. మునక్కాయ చేపల పులుసును చేయడం చాలా ఈజీ.
చేపలు - అరకిలో
మునక్కాయలు - ఒకటి
టమాటో - ఒకటి
చింతపండు - నిమ్మకాయ సైజులో
ఉల్లిపాయ - ఒకటి
మెంతులు - పావు స్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
కరివేపాకు - గుప్పెడు
పసుపు - పావు స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
నీళ్లు - సరిపడా
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, కాస్త పసుపు వేసి పక్కన పెట్టాలి.
2. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మెంతులు వేయాలి.
3. తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. కరివేపాకులు వేసి వేయించాలి.
4. సన్నగా తరిగిన ఉల్లిపాయలను అందులో వేసి వేయించాలి.
5. ఇందులో పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. రంగు మారేవరకు వేయించాలి.
6. తర్వాత మునక్కాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసి కలపాలి.
7. టమోటో తరుగును కూడా వేసి కలిపి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటా త్వరగా మెత్తగా అయిపోతుంది.
8. టమోటో బాగా మగ్గాక కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
9. మళ్లీ మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
10. అందులో చింతపండు రసం కూడా వేసి కలుపుకోవాలి.
11. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపలను వేసి అర గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టాలి.
12. చిన్న మంట మీద అరగంట పాటు ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
13. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ మునక్కాయ చేపల పులుసు రెడీ అయినట్టే.
14. దీన్ని వేడి అన్నంతో వేసుకుని తింటే రుచి సూపర్ గా ఉంటుంది.
15. ఉదయం వండినది రాత్రికి తింటే ఇంకా అదిరిపోతుంది.
16. చేపలకు ఆ రసం బాగా పట్టి ముక్కలు టేస్టీగా ఉంటాయి.
ఇందులో ములక్కాడలు, చేపలు రెండూ మన ఆరోగ్యానికి మంచి చేసేవే. చేపలు తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో చేరుతుంది. చేపలు ఎంత తిన్నా బరువు పెరగరు. అలాగే మునక్కాయలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సిలతో పాటూ క్యాల్షియం లభిస్తుంది. ఇది అనేక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు మునక్కాయల్లో ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు ములక్కాడని తినడం వల్ల మేలు జరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మునక్కాడ అడ్డుకుంటుంది. అది రక్తపోటుతో బాధపడుతున్న వారు మునక్కాయలు తినడం వల్ల మేలు జరుగుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మునక్కాడలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది.