Telugu News  /  Lifestyle  /  Drinking Too Much Alcohol Does Age You, Says Oxford Study
Drinking Too much alcohols
Drinking Too much alcohols (Pixabay)

Alcohol | మీరు త్వరగా ముసలి అయిపోవాలా? వారానికి ఇన్ని పెగ్గులేస్తే చాలట!

28 July 2022, 17:11 ISTHT Telugu Desk
28 July 2022, 17:11 IST

కొంతమందికి వయసు తక్కువే అయినా ఎక్కువలా కనిపిస్తారు, మరొకొంత మందికి వయసు ఎక్కువ ఉన్నా తక్కువలా కనిపిస్తారు. మోతాదుకి మించి మద్యం తాగితే ఇలా జరుగుందట. వారంలో ఎన్ని గ్లాసులకు మించి తాగకూడదో పరిశోధించి చెప్తున్న వివరాలు ఇక్కడ ఉన్నాయి.

వారం అంతా సుదీర్ఘంగా పనిచేసిన తర్వాత వీకెండ్ రాగానే చాలామంది మద్యం బాటిల్ ముందర పెట్టుకొని కూర్చుంటారు. స్నేహితులు, బంధువులు కలిసినపుడు, ఏదైనా వేడుక జరుగుతున్న సందర్భంలో మద్యం సేవించడం మామూలే. అప్పుడప్పుడు మద్యం సేవిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అయితే అది మోతాదుకు మించకూడదు. చాలా మంది ఒక్కసారి సిట్టింగ్ వేస్తే పెగుల మీద పెగ్గులు వేస్తారు. ఎవరు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ కెపాసిటీ కలిగిన వారు అన్నట్లుగా వ్యవవహరిస్తారు. కానీ మీకో విషయం తెలుసా? అతిగా మద్యం తాగేవారు త్వరగా ముదిరిపోతారట. అర్థం కాలేదా? కాస్త వివరంగా చెప్పుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేది పాత మాట. మద్యపానం ముసలితనానికి మార్గం అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇది చెబుతుంది ఎవరో మామూలు వ్యక్తులు కాదు. ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, వారానికి ఐదు గ్లాసులకు మించి వైన్ తాగితే అది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని తేలింది.

అధిక ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో వృద్ధాప్యానికి సంబంధించిన చర్యలు పెరుగుతాయి. అల్కాహాల్ శరీరంలో జీవ గడియారాన్ని వేగవంతం చేస్తుంది. దీంతో మీ అందం దెబ్బతింటుంది, రూపం మారిపోతుంది. అలాగే డీహైడ్రేషన్ కు గురికావటం, చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మకణాలు తమ స్థితిస్థాపకతను కోల్పోతాయి. దీంతో ముడతలు త్వరగా వచ్చేస్తాయి. దీంతో మీ వయసు తక్కువే అయినప్పటికీ మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు పెరిగిపోతాయి. పెద్దవారిలా కనిపిస్తారు అనేది తాజా పరిశోధనలో వెల్లడైంది.

పరిశోధనలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

వృద్ధాప్యాన్ని తగ్గించే దిశగా ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పరిశోధనల్లో ఆల్కాహాల్ కూడా వృద్ధాప్యానికి కారణం అని తేలింది. తాజాగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు మొత్తంగా 500,000 మంది వ్యక్తులపై పరీక్షలు జరిపారు.

వీరందరిలో ఎక్కువ మంది మద్యపానం చేసేవారు, కేవలం 3 శాతం మంది ఎప్పుడూ మద్యం సేవించలేదని పేర్కొన్నారు. వారి నుంచి జన్యుపరమైన, ఆరోగ్య సంబంధిత డేటాను తీసుకున్నారు. టెల్-టేల్ జెనెటిక్ మార్కర్ల డేటాను పరిశోధన బృందం విశ్లేషించింది. దీనిని బట్టి ఒక వ్యక్తి ఎంత మద్యం సేవించాడో తెలుస్తుంది.

ఆల్కహాల్ వారి DNA పై చూపిన ప్రభావాన్ని గుర్తించారు. వారి DNAలో టెలోమియర్స్ అని పిలిచే తంతువులలో కొంత భాగాన్ని దెబ్బతీసింది. అది అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తుంది. పరిశోధన ప్రకారం ఆరోగ్యవంతమైన టెలోమియర్‌లు వ్యక్తిని మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

ఆల్కాహాల్ సేవించే వారిలో ఈ టెలోమియర్స్ దెబ్బతిని వారు ప్రస్తుతం ఉన్న వయసు కంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఎక్కువ వయసులో కనిపిస్తారని తేలింది. కాబట్టి వృద్దాప్యాన్ని ఆలస్యం చేయాలంటే ఈ ఆల్కాహాల్ అనే కారకాన్ని నియంత్రించాలని సిఫారసు చేస్తున్నారు.

పని ఒత్తిడిని తగ్గించుకోవటానికి, జీవితంలో సమస్యలు, బాధలు దిగమింగుకోవటానికి ఆల్కాహాల్ సేవిస్తున్నాం అని చెప్తారు. అయితే తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తుంది. దీర్ఘకాలికంగా అనేక సమస్యలకు కారణమవుతుంది. క్రమక్రమంగా కీళ్లలో పటుత్వం పోతుంది. బలహీనపడతారు. దీంతో నడవటానికి కూడా ఇబ్బందిపడతారు. కాబట్టి వీలైనంత త్వరగా మద్యం అలవాటును విడిచిపెట్టడం అన్ని విధాల శ్రేయస్కరం.