Periods: పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింకులు తాగుతున్నారా? అదెంత ప్రమాదమో చెప్పిన కొత్త అధ్యయనం-drinking cool drinks during periods a new study says how dangerous that is ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods: పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింకులు తాగుతున్నారా? అదెంత ప్రమాదమో చెప్పిన కొత్త అధ్యయనం

Periods: పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింకులు తాగుతున్నారా? అదెంత ప్రమాదమో చెప్పిన కొత్త అధ్యయనం

Haritha Chappa HT Telugu

Periods: యువతలో అనేక రకాల శీతల పానీయాలు తాగే అలవాటు ఎక్కువగా మారింది. కొత్త అధ్యయనం ప్రకారం పీరియడ్స్ సమయంలో శీతల పానీయాలు తాగడం వల్ల ఎంతో హాని జరిగే అవకాశం ఉంది.

పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింకులు తాగవచ్చా? (Pixabay)

పీరియడ్స్ వచ్చే సమయంలో కొంతమంది మహిళలకు పొట్టనొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు కనిపిస్తాయి. బహిష్టు సమయంలో కొన్ని సాధారణ లక్షణాలు ఒక్కోసారి తీవ్రంగా మారుతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. డార్క్ చాక్లెట్‌ను పీరియడ్స్ సమయంలో తినడం వల్ల ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. అయితే ఋతుస్రావం సమయంలో తీవ్రమైన పొట్టనొప్పికి, అసౌకర్యానికి గురి చేసే పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని తింటే తీవ్రమైన పొట్టనొప్పి, విరోచనాలు వంటివి కావచ్చు. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో స్పైసీ ఫుడ్స్ ను అలాగే కూల్ డ్రింకులను తీసుకోకూడదు. కొత్త అధ్యయనం ప్రకారం కూల్ డ్రింకులు తాగడం వల్ల పీరియడ్స్ టైం లో పొట్టనొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.

పొట్ట నొప్పి ఎందుకు వస్తుంది?

పీరియడ్స్ సమయంలో వచ్చే పొట్ట నొప్పిని డిస్మేనోరియా అని అంటారు. ఇది పొత్తికడుపులో వచ్చే ఒక బాధాకరమైన అనుభూతి. గర్భాశయం దాని లైనింగును పీరియడ్స్ సమయంలో తొలగిస్తుంది. ఆ లైనింగ్ ను చిన్నచిన్న ముక్కల రూపంలో బయటికి పంపించేస్తుంది. ఆ సమయంలోనే ఇలా పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రతినెలా జరిగే ప్రక్రియ.

పొట్ట నొప్పి రావడంతో పాటు కొంతమంది స్త్రీలలో తొడల కింద భాగం కూడా నొప్పి పెడుతుంది. వికారంగా అనిపించి, వాంతులు వచ్చినట్టు అవుతాయి. అతిసారం,పొట్ట ఉబ్బరం, అలసట, తలనొప్పులు, తల తిరగడం, మూడ్ స్వింగ్స్, చిరాకు, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు మీకు పీరియడ్స్ టైం లో ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పీరియడ్స్ సమయంలో పైన చెప్పిన లక్షణాలను కలిగి ఉన్నవారు కూల్ డ్రింకులకు పూర్తిగా దూరంగా ఉండాలని కొత్త అధ్యయనం తెలిసింది. ఈ కొత్త అధ్యయనం తాలూకు వివరాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించారు. చైనాలోని 1800 మంది కాలేజీ విద్యార్థులపై అధ్యయనాన్ని నిర్వహించారు. వారికి రుతుక్రమం, శీతల పానీయాలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను అందించారు. అందులో సగం మంది పొట్టనొప్పి సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. అయితే వారిలో ఎవరైతే పీరియడ్స్ సమయంలో శీతల పానీయాలను తాగుతారో వారికి పొట్టనొప్పి వచ్చే అవకాశం 24 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

అప్పుడప్పుడు వచ్చే పీరియడ్స్ నొప్పులకు, శీతల పానీయాలు ప్రధాన కారణం కాదు. కానీ క్రమం తప్పకుండా ప్రతినెలా మీకు పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పి వస్తుంటే మీరు కూల్ డ్రింకులు తాగడం వల్ల ఆ నొప్పి వస్తుందేమో అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజానికి కూల్ డ్రింకులు ఆరోగ్యకరమైనవి కాదు, వాటిని వదిలిపెట్టడమే మంచిది.

శీతల పానీయాల్లో అదరపు చక్కెర ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి. ఇది తీవ్రమైన పొట్టనొప్పికి కారణం అవుతుంది.

అలాగే శీతల పానీయాలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది తలనొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. కానీ రక్తనాళాలను కుదించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. పొట్ట నొప్పి కూడా మొదలవుతుంది.

శీతల పానీయాలలో ఉండే కార్బోనేషన్ పొత్తికడుపులో ఉబ్బరం, అసౌకర్యం వంటి వాటికీ దారితీస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పికి కారణం అవుతుంది. పొట్ట ఉబ్బరం వల్ల పెరిగిన పొత్తికడుపు.. గర్భాశయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మరింతగా ఇబ్బందికి గురిచేస్తుంది.

కూల్ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ సమస్య మొదలు కావచ్చు. శీతల పానీయాలలో టిఫిన్ అధికంగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను ప్రభావితం చేస్తుంది. మూత్ర ఉత్పత్తిని పెంచి శరీరం నుంచి అధిక స్థాయిలో నీరు బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇది గర్భాశయంలోని కండరాలను నొప్పి పుట్టేలా చేస్తుంది. కాబట్టి వీలైనంతవరకు శీతల పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది.