Drink Water While Eating । తినేటపుడు నీరు తాగటం మంచిదేనా? ఎప్పుడు తాగాలంటే..!-drink water while eating myths vs facts nutritionist shares tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Drink Water While Eating Myths Vs Facts, Nutritionist Shares Tips

Drink Water While Eating । తినేటపుడు నీరు తాగటం మంచిదేనా? ఎప్పుడు తాగాలంటే..!

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 09:19 PM IST

Drink Water While Eating- తినేటపుడు నీరు తాగవచ్చా? భోజనానికి ముందు నీరు తాగవచ్చా, భోజనం చేసిన తర్వాత ఎంత సేపటికి నీరు తాగాలి? ఈ ప్రశ్నలన్నింటికీ పోషకాహార నిపుణులు ఇచ్చిన సమాధానాలు ఇక్కడ చూడండి.

Drink Water While Eating
Drink Water While Eating (Unsplash)

చాలా మంది ఆహారం తినేటపుడు గానీ, తిన్న తర్వాత వెంటనే గానీ నీరు తాగడం మంచిది కాదని నమ్ముతారు. ఆహారం తింటూ నీరు తాగితే అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందనే భావన చాలా మందిలో ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత? కొంత మంది ఆయుర్వేద నిపుణులు కూడా భోజనం చేయటానికి ముందు, చేసిన తర్వాత నీళ్లు తాగటానికి కనీసం అరగంట వ్యవధి ఇవ్వాలని సూచిస్తారు. మరి భోజన సమయంలో దాహం వేస్తే నీరు తాగకుండా అలాగే ఆ దాహాన్ని నిలిపి ఉంచుకోవాలా? ఇలాంటి సందేహాలకు పోషకాహార నిపుణుడు భువన్ రస్తోగి సమాధానాలు ఇచ్చారు.

న్యూట్రిషన్ భువన్ ప్రకారం, భోజనం చేస్తున్నప్పుడు కూడా నీరు తాగొచ్చు. వాస్తవానికి నీరు ఎప్పుడు తాగినా మంచిదేనని ఆయన అంటున్నారు. భోజనానికి ముందు గానీ, భోజనం చేసేటపుడు గానీ, భోజనం తర్వాత గానీ నీరు తాగితే జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేస్తుంది, తద్వారా జీర్ణక్రియ నెమ్మదవుతుంది అనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. అందువల్ల ఇదొక అసంపూర్ణమైన వాదన అని భువన్ పేర్కొన్నారు. భోజన సమయంలో నీటిని నివారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

భోజన సమయంలో నీరు తాగొద్దనటానికి లాజిక్ ఎక్కడ?

Drink Water While Eating: మనం ఆహారంలోనే చాలా నీరు ఉంటుంది. భారతీయులు సూప్‌లు, రసాలు వంటి పలుచని ఆహారం తింటారు వాటిలో నీరు ఉంటుంది. అలాగే సలాడ్లు తింటారు అందులోనూ నీరు ఉంటుంది. కూరగాయల్లో నీరు ఉంటుంది, పెరుగు, మజ్జిగల్లోనూ నీరే ఉంటుంది. అంతేకాదు మనం ఆహారాన్ని నమలడం ద్వారా ఉత్పత్తి అయ్యే లాలాజలంలోనూ జలమే ఉంటుంది. మనం తినే సాంప్రదాయ ఆహారంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, అది ఏ విధంగానూ జీర్ణక్రియను ప్రభావితం చేయదు. కాబట్టి నీరు తాగకూడదు అనే దానిలో అర్థం లేదని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.

నీరు తాగకపోతే ఏమవుతుంది?

చాలా మంది భోజనంతో నీరు తాగకూడదనే సూత్రాన్ని అనుసరిస్తారు. కొంతమంది గంట, 2 గంటల వరకు కూడా చుక్క నీరు తీసుకోరు. అయితే దీనివల్ల నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ఇలా డీహైడ్రేషన్ కు గురైనపుడు దీర్ఘకాలిక మలబద్ధకం, ఆమ్లత్వం, మూత్రపిండాల్లో రాళ్లు, యుటిఐలు వంటి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఇప్పటికే నిరూపితమైంది. సాధారణ వ్యక్తి ప్రతిరోజూ 3 లేదా 4 లీటర్ల నీటిని తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు.

చివరగా చెప్పేదేమిటంటే.. భోజన సమయంలో నీరు తాగటం, తాగకపోవటంలో ఎవరి ఇష్టం వారిదే. కానీ రోజులో తగినంత నీరు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని భువన్ పేర్కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం