Sugarcane Juice: వేసవిలో వారానికి ఒక్కసారైనా చెరుకు రసాన్ని తాగాల్సిందే, ఎందుకంటే
Sugarcane Juice: చెరుకురసం ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవిలో చెరుకు రసాన్ని తాగడం వల్ల వేడిని తట్టకునే శక్తి ఉంటుంది. వేడి వాతావరణంలో చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి.
Sugarcane Juice: వేసవి దాహం తీరాలంటే కేవలం మంచినీళ్లు సరిపోవు. కొన్ని రకాల జ్యూసులు, పానీయాలు తాగాల్సిన అవసరం ఉంది. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాలలో చెరుకు రసం ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి తాపం నుండి మిమ్మల్ని కాపాడడమే కాదు ఆహ్లాదకరమైన విశ్రాంతిని కూడా ఇస్తుంది. చెరుకు రకసం ఒక మంచి రిఫ్రెష్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. అయితే చక్కెర కలపని చెరుకు రసాన్ని మాత్రమే తాగాలి. చక్కెర కలపడం వల్ల చెరకు రసం అనారోగ్యకరమైనదిగా మారిపోతుంది.
చెరుకు రసాన్ని దేశీపానీయంగా చెప్పుకోవాలి. ఈ దేశీ సమ్మర్ డ్రింక్ ను వేసవిలో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
చెరుకు రసం తాగడం వల్ల ఉపయోగాలు
చెరుకు రసంలో మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. అలాగే కాల్షియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి వంటివి ఎన్నో ఉంటాయి. అధిక చెమట కారణంగా మనం కోల్పోయిన ఎన్నో పోషకాలను తిరిగి నింపుతుంది. చెరకు రసాన్ని కొద్ది మొత్తంలో తీసుకున్నా చాలు... శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. జీర్ణక్రియకు సాయం చేస్తుంది.
వేడి వాతావరణంలో చెరుకు రసాన్ని తాగడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరంలో నింపుకోవచ్చు. శారీరక శ్రమ చేసిన తర్వాత చెరుకు రసాన్ని తాగితే ఎంతో మంచిది. చెరుకు రసంలో సహజంగానే చక్కెర నిండి ఉంటుంది. కాబట్టి తాగిన వెంటనే శక్తిని అందిస్తాయి. కృత్రిమ స్వీట్‌నర్లు ఏమీ ఉండవు. కాబట్టి డయాబెటిస్ లేని వారికి ఈ చెరకు రసం ఆరోగ్యకరమైన పానీయం. దీన్ని అధికంగా తాగితే హఠాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు తక్కువ మొత్తంలోనే తాగాలి.
చెరుకు రసంలో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది. శరీరంలోని పోషకాలను శోషించుకునే ఎంజైమ్‌లను చెరుకు రసం శరీరానికి అందిస్తుంది. అధ్యయనాల ప్రకారం చెరుకు రసం కాలేయాన్ని దెబ్బ తినకుండా కాపాడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడుతాయి. చెరుకు రసం తరుచూ తాగేవారిలో జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి. ఇందులో సహజ చక్కెర ఉన్నప్పటికీ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా ఉండదు కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువే. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.