Egg Water: గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను పడేస్తున్నారా? వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఇలా ఉపయోగించండి-draining the water in which the eggs were boiled there are many benefits with them use them like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Water: గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను పడేస్తున్నారా? వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఇలా ఉపయోగించండి

Egg Water: గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను పడేస్తున్నారా? వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఇలా ఉపయోగించండి

Haritha Chappa HT Telugu
Jan 29, 2025 08:30 AM IST

Egg Water: గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని చాలామంది పడేస్తూ ఉంటారు. నిజానికి ఆ నీటిని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. అందులో కూడా పోషకాలు ఉంటాయి.

ఉడకబెట్టిన గుడ్లు నీళ్లతో ఉపయోగాలు
ఉడకబెట్టిన గుడ్లు నీళ్లతో ఉపయోగాలు (pexel)

ఉడకబెట్టిన గుడ్లు తినడం ఎంతోమందికి అలవాటు. గుడ్లను ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని సింక్‌లో పోసేస్తూ ఉంటారు. నిజానికి గుడ్లు ఉడకబెట్టిన నీరు ఎంతో శక్తివంతమైనది. గుడ్లలో పోషకాలు మాదిరిగానే గుడ్లు ఉడకబెట్టిన నీళ్లలో కూడా శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. గుడ్డు పెంకులు, గుడ్డు తెల్లసొన నుండి కొన్ని పోషకాలు బయటికి వచ్చి నీటిలో కలిసిపోతాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, ఇనుము వంటివి ఇందులో ఉంటాయి. కాబట్టి గుడ్లు ఉడకబెట్టిన నీటిని పడేయకుండా తిరిగి వినియోగించవచ్చు.

గుడ్లు ఉడకబెట్టిన నీటిని చల్లార్చి ఇంట్లో ఉన్న మొక్కలకు వేయండి. మొక్కలకు సరైన స్థాయిలో పోషకాలు అందుతాయి. మొక్కలు ఎదగడానికి పొటాషియం అవసరం. గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది.

మొక్కల కోసం

మీ మొక్కలకు సాధారణ నీళ్ళు పోసే కన్నా గుడ్ల ఉడకబెట్టిన నీళ్లు పోయడం వల్ల ఆ నేల కూడా సారవంతం అవుతుంది. మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడతాయి. నీటిలో ఉండే కాల్షియం మొక్కల మూలాల నుండి అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచుతుంది. మీ మొక్క పచ్చగా ఎదగడం మీరు గమనిస్తారు.

జుట్టు అందానికి

గుడ్లు ఉడకబెట్టిన నీటిని పడేయకుండా మీ జుట్టుకు ఉపయోగించుకోవచ్చు. ఆ నీటిలో ఖనిజాలు పటిష్టంగా ఉంటాయి. ఆ నీటితో జుట్టును శుభ్రపరచుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి. చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది. వెంట్రుకలు మెరిసేలా ఆరోగ్యకరంగా ఎదుగుతాయి. జుట్టుకు మెరపును ఇవ్వడానికి కూడా గుడ్డు ఉడికించిన నీళ్లు ఉపయోగపడతాయి.

గ్రీజు వదిలించుకోవచ్చు

గుడ్లు ఉడికించిన నీటిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది. కాబట్టి గ్రీజు, దుమ్ము, ధూళి వంటి వాటిని శుభ్రం చేయడంలో ఇది సహాయపడుతుంది. వంటగది ప్లాట్ ఫారం, స్టవ్‌లు శుభ్రం చేసేందుకు ఈ గుడ్డు నీటిని ఉపయోగించండి. డిష్ వాషర్ లో, వాషింగ్ మెషిన్ లో కూడా ఈ గుడ్డు నీటిని ఉపయోగించవచ్చు. రసాయన క్లీనర్ల కన్నా ఈ గుడ్డు ఉడికించిన నీరు ఉపయోగపడుతుంది.

ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేస్తున్నప్పుడు ఆ ప్రక్రియ వేగవంతం అవ్వడానికి గుడ్డు నీటిని ఉపయోగించండి. ఈ నీటిలో ఉండే ఖనిజాలు పనిచేస్తాయి. సేంద్రీయ పదార్థాలను త్వరగా విచ్చిన్నమయ్యేలా చేస్తాయి. కాబట్టి గుడ్డు నీటిని కంపోస్ట్ బిన్‌లో వేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల కూడా అధికంగా ఉంటుంది. కంపోస్ట్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని మొక్కలకు వినియోగించుకోవచ్చు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner