Wednesday Motivation: మనశ్శాంతి లేదని బాధపడకండి, ఈ చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన జీవితం మీదే
Wednesday Motivation: మానవునికి ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మనస్సు. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామన్న దానిపై జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి ఏం చేయాలో తెలుసుకోండి.
మనుషుల్లో చాలా మందికి మనశ్శాంతి కరువైపోతోంది, ప్రశాంతంగా జీవిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. మన మనసు దృఢంగా ఉంటేనే ప్రశాంతత దానంతట అదే వస్తుంది. జీవితంలో ప్రశాంత మనసు కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.సైకాలజిస్ట్ రూపారావు తన ఫేస్ బుక్ పేజీలో ప్రశాంతమైన జీవితం కోసం 7 చిట్కాలు రాశారు. అవేంటో తెలుసుకోండి.
మనిషి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మనసు. ప్రాచీన స్టోయిక్ తత్వవేత్త ఎపిక్టెటస్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాడు. మీ మనసే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఎపిక్టెటస్ చెప్పిన ప్రకారం మనస్సు చేసే కొన్ని పనులు మన జీవితాన్ని అందంగా, ప్రశాంతంగా మారుస్తాయి. ఆ పనులేంటో తెలుసుకోండి.
ఎక్కువ ఆలోచించద్దు
ప్రతిరోజూ అల్పాహారం కోసం ఏమి తినాలి, సహోద్యోగితో ఏం మాట్లాడాలి వంటి సిల్లీ విషయాల గురించి అతిగా ఆలోచించడం మానేయండి. అలా ఆలోచిస్తే మీ మనసు అలసిపోతుంది. కొన్ని విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు, జీవితం ఏదిస్తే అది తీసుకుని ప్రశాంతంగా ఉండాలి. మన జీవితంలో అనేక ఘటనలు అకస్మాత్తుగానే జరుగుతాయి. వాటిని ప్రశాంతంగా స్వీకరించి ముందకు సాగిపోవడమే.
నో చెప్పడం నేర్చుకోండి
మీకు నచ్చితేనే ఏదైనా పనిచేయండి. ప్రలోభాలకు లొంగిపోయి అన్నింటికీ ఓకే చెబితే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. ఎక్కువ తినాలనే కోరిక, సోమరితనంతో నిద్రపోవడం, ఃసోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వంటి వాటికి మనసు నో చెప్పాల్సిందే. మీ మనసులోని మీరు గట్టి నిర్ణయం తీసుకుని వాటికి దూరంగా ఉంటే మీ జీవితంలో మనశ్శాంతి దక్కుతుంది.
సంకల్ప శక్తి
సంకల్ప శక్తి ఉండడం చాలా ముఖ్యం. సంకల్ప శక్తిని మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, అది అంత బలంగా మారుతుంది. కాబట్టి సంకల్పబలాన్ని తరచూ వాడుతూనే ఉండాలి.
బాగుపడాలనే తపన
కేవలం ఎక్కువ డబ్బు లేదా విజయాన్ని కోరుకోవడం మాత్రమే కాదు. వ్యక్తిగతంగా మీకు మీరే ఉత్తమమైన వ్యక్తిగా ఉండడం చాలా ముఖ్యం. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం వల్ల నిత్యం ఎదుగుతూనే ఉంటామని నమ్మడం ఎల్లప్పుడూ మంచిది. ప్రతి క్షణం, మనం నిన్నటి కంటే ఎక్కువగా ఎదగాలనే ఆరాటం ఉండాలి. ఇతరులతో మనల్ని పోల్చుకోవడం కాదు, మన నిన్నటి వెర్షన్ తో పోల్చుకోవడం మంచిది.
నెగిటివిటీకి దూరంగా ఉండటం
నెగిలివిటీ ఉచ్చులో పడటం చాలా సులభం. కాబట్టి నెగిటివిటీకి దూరంగా ఉండాలి. విషపూరిత ఆలోచనలు, విషపూరిత వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఆలోచనలు ఎంత పాజిటివ్ గా ఉంటే మీ మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది.
భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి
జీవితంలో వచ్చే పరిస్థితులు అనూహ్యమైనవి, కానీ మనకు ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, మీ బాస్ తో కష్టమైన చర్చ జరిగిందనుకోండి, దాని గురించి భయపడటానికి లేదా ఆందోళన చెందడానికి బదులుగా, మీరు ఎలా మాట్లాడాలో, వారికి పనిని ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆలోచించండి. మాట్లాడవలసిన పాయింట్ల గురించి ఆలోచించండి. మనస్సు యొక్క కంటిలో ప్రశాంతమైన మరియు సానుకూల ఫలితాన్ని ఊహించండి, మీరు ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండవచ్చు.