బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడానికి టైమ్ లేదని టెన్షన్ పడకండి, సరికొత్తగా ఆమ్లెట్ వేసుకుని లాగించేయండి!-dont stress about breakfast a quick potato omelette will ready in a minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడానికి టైమ్ లేదని టెన్షన్ పడకండి, సరికొత్తగా ఆమ్లెట్ వేసుకుని లాగించేయండి!

బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడానికి టైమ్ లేదని టెన్షన్ పడకండి, సరికొత్తగా ఆమ్లెట్ వేసుకుని లాగించేయండి!

Ramya Sri Marka HT Telugu

పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే టైమ్ లేదా అని తెగ ఫీలవుతున్నారా? టెన్షన్ పడకుండా.. అదిరిపోయే ఆలూ ఆమ్లెట్ వేసేయండి. నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే, ఆకలితో ఆఫీసుకు పరిగెత్తాల్సిన గొడవ ఉండదు.

ఆలూ ఆమ్లెట్.. ఫారిన్ స్టైల్‌లో

పొద్దున్నే లేవగానే ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? రోజును వేగంగానూ, కొత్తగానూ మొదలుపెట్టాలనుకుంటే ఇది కరెక్ట్ ఆప్షన్. ఆమ్లెట్‌ను ఎప్పుడూ తినేలా కాకుండా, ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఆలూ ఆమ్లెట్‌లా ట్రై చేయండి. రుచికి అద్భుతంగా ఉండటంతో పాటు తొందరగా చేసేసుకోవచ్చు కూడా. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చకచకా రెడీ అయిపోతుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఏం ఆలోచించకుండా ప్రొసీడ్ అయిపోండి.

ఆలూ ఆమ్లెట్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:

  • ఆలుగడ్డ (బంగాళ దుంప) - 1 లేదా 2 (ఒకే పరిమాణంలో, మరీ పల్చగా లేదా మందంగా కాకుండా గుండ్రంగా కట్ చేసుకోవాలి)
  • ఆలివ్ నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • గుడ్డుసొన - 2 లేదా 3 (బాగా గిలక్కొట్టినది)
  • పాలు - కొద్దిగా (గుడ్డు సొనలో కలపడానికి - కావాలనుకుంటేనే)
  • ఉప్పు - రుచికి తగినంత
  • మిరియాల పొడి - ఒక టీ స్పూన్
  • పుదీనా ఆకులు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
  • పచ్చిమిర్చి - 1 లేదా 2 (సన్నగా రింగులుగా కట్ చేసినవి)
  • కొత్తిమీర ఆకులు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
  • చీజ్ - కొద్దిగా (సన్నగా తరిగిన రింగుల వంటి ముక్కలు)
  • గరం మసాలా - ఒక టీ స్పూన్ (రుచి కోసం)

ఆలూ ఆమ్లెట్‌ను తయారు చేసే విధానం:

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె లేదా నెయ్యి వేయండి.
  2. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా గుండ్రంగా కట్ చేసుకున్న ఆలుగడ్డ (బంగాళ దుంప) ముక్కలను కడాయిలో పేర్చండి. వీటన్నిటినీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఒకే పరిమాణంలో కట్ చేసుకోవాలి.
  3. నూనె వేడికి వేగాయనుకున్న తర్వాత మరోవైపుకు తిప్పండి.
  4. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచడం వల్ల బంగాళదుంప ముక్కలు మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది.
  5. ఈ విధంగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిపై కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి చల్లండి.
  6. ఇప్పుడు బాగా గిలక్కొట్టిన గుడ్డుసొనను వాటిపై వేసి కాసేపటి వరకూ ఉంచండి. బాగా గిలక్కొట్టడంతో పాటు అందులో కొన్ని పాలు కూడా వేస్తే ఆమ్లెట్ ఇంకా పఫ్ఫీగా వస్తుంది.
  7. ఈ గ్యాప్‌లో వాటి మీద సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులను వేయండి.
  8. ఇప్పుడు దాని మీద సన్నగా తరిగిన రింగుల లాంటి చీజ్‌ను కూడా వేయండి. ఒక నిమిషం పాటు మూత పెట్టడం వల్ల చీజ్ త్వరగా కరిగిపోతుంది.
  9. ఒకవైపు వేగాయని కన్ఫమ్ చేసుకున్న తర్వాత మరోవైపుకు తిప్పండి.
  10. రెండు వైపులా సువాసన కోసం కాస్త గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
  11. అంతే, మీరు మెచ్చే ఆలూ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్లే.
  12. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీతో మీరు కూడా ప్రిపేర్ చేసేయండి.

దీని వల్ల కలిగే ప్రయోజనం:

బంగాళదుంపలు తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు అంది తక్షణ శక్తినిస్తాయి. గుడ్లలోని ప్రోటీన్లు కండరాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ కాంబినేషన్‌తో చేసిన ఆమ్లెట్ మీ రోజును శక్తివంతంగా ప్రారంభమయ్యేలా చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.