Thursday Motivation: ఎదుటివారి అభిప్రాయం పూర్తిగా వినకుండా అరిచేయకండి, వారి వైపు కథనం భిన్నంగా ఉండొచ్చు
Thursday Motivation: కొంతమంది ఆవేశపడుతూ ఉంటారు, ఎదుటివారి అభిప్రాయాన్ని, ఆలోచనలను పూర్తిగా వినరు. త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేసి, ఎదుటివారిని తిట్టేస్తారు. అలా చేయడం వల్ల వారు పశ్చాత్తాప పడే పరిస్థితులు రావచ్చు.
Thursday Motivation: ఒక స్కూల్లో ఆరు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఒక టీచర్ గణితాన్ని బోధిస్తోంది. ఒక పిల్లవాడిని పిలిచి ‘నేను నీకు రెండు ఆపిల్ పండ్లు, రెండు మామిడి పండ్లు ఇచ్చాననుకో... నీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి’ అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు ‘ఐదు పండ్లు’ అని చెప్పాడు. ఆ పిల్లవాడి సమాధానం విని టీచర్ కు ఆశ్చర్యం వేసింది. బాగా చదివే పిల్లవాడే కానీ ఇలా ఎందుకు చెప్పాడో అనుకుంది.
చిన్న పిల్లవాడు కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలనుకుంది. వేళ్ళతో లెక్కించమని చెప్పింది. ‘నేను నీకు రెండు యాపిల్ పండ్లు, రెండు మామిడి పండ్లు ఇచ్చాను, అయితే ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయో చెప్పు’ అని అడిగింది. ఆ పిల్లవాడు వేళ్ళతో లెక్కపెట్టి మరీ ఐదు పండ్లు అని చెప్పాడు. దాంతో టీచర్ కోపం వచ్చింది. అయినా కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంది.
ఒకసారి ఆ పిల్లవాడి తల్లి మాట్లాడుతూ... తన కొడుక్కి చాక్లెట్లు అంటే ఇష్టం అన్న సంగతి చెప్పింది. ఆ విషయం టీచర్‌కు గుర్తొచ్చి ‘నేను నీకు రెండు వైట్ చాక్లెట్స్, రెండు బ్రౌన్ చాక్లెట్స్ ఇస్తే... మీ దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉంటాయి’ అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు నాలుగు చాక్లెట్లు అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో ఆ టీచర్ చాలా సంతోషించింది. మళ్ళీ ఒకసారి మొదటి ప్రశ్ననే వేసి ఆ పిల్లవాడిని చెక్ చేయాలని అనుకుంది.
‘ఇప్పుడు చెప్పు... నేను నీకు రెండు యాపిల్ పండ్లు, రెండు మామిడి పండ్లు ఇస్తే మీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి?’ అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు మళ్లీ ‘ఐదు పండ్లు’ అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. పిల్లవాడిని బాగా తిట్టింది. రెండు దెబ్బలు వేసింది. నీకు చదువు రాదు అంటూ తిట్టిపోసింది. ఆ పిల్లవాడు చాలా బాధపడ్డాడు.
ఆ టీచర్ గట్టిగా అరుస్తూ... ‘ నేను నీకు రెండు ఆపిల్ పండ్లు, రెండు మామిడి పండ్లు ఇస్తే మొత్తం కలిపి నాలుగు పండ్లే ఉంటాయి, కానీ నీ దగ్గర ఐదు మామిడి పండ్లు ఎలా ఉంటాయి?’ అని అరిచింది. దానికి ఆ పిల్లవాడు ‘నా బ్యాగ్ లో మా అమ్మ ఒక ఆపిల్ పండు పెట్టి పంపింది’ అని చెప్పాడు. అది విని టీచర్ తో పాటు మిగతా విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. టీచర్ కాస్త శాంతించి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడింది. చిన్నపిల్లలు ఉన్నది ఉన్నట్టే చెబుతారని ఆమెకు అర్థమైంది. ఆ పిల్లవాడు తన అమ్మ ఇచ్చిన పండును కూడా కలిపి చెప్పాడు. ఆ విషయాన్ని టీచర్ ఇలా అరిచి అడిగే కన్నా... మెల్లగా అడిగి ఉంటే సరిపోయేది.
కానీ ఆ టీచర్ పిల్లవాడిని కొట్టి తిట్టాకే అతని అభిప్రాయాన్ని అడిగింది. దీనివల్ల ఆమె చాలా పశ్చాత్తాప పడింది. ప్రతీ కథకు రెండు పార్శ్వాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ రెండు పార్వ్శాల వైపు ఉన్న కథను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటి వారి అభిప్రాయాన్ని ముందే తెలుసుకుంటే టీచర్‌లాగా పొరపడే అవకాశం ఉండదు.