Kids Mental Health: పిల్లల ముందు ఈ 5 విషయాలు మాట్లాడకండి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది-dont say these 5 things in front of kids that can harm their mental health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Mental Health: పిల్లల ముందు ఈ 5 విషయాలు మాట్లాడకండి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది

Kids Mental Health: పిల్లల ముందు ఈ 5 విషయాలు మాట్లాడకండి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది

Haritha Chappa HT Telugu
Published Feb 19, 2025 07:00 AM IST

తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలి. అయితే, కొన్ని విషయాలు మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికీ మాట్లాడకూడదు. ఇలాంటి విషయాలు వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

పిల్లలతో చెప్పకూడని విషయాలు ఇవిగో
పిల్లలతో చెప్పకూడని విషయాలు ఇవిగో (Shutterstock)

పిల్లలను క్రమశిక్షణగా పెంచడం కత్తి మీద సామే. ఈ తరం పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే చాలా విషయాలు త్వరగా గ్రహిస్తారు. జీవితం గురించి వారి అభిప్రాయాలు కూడా వారి తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే మారిపోతుంది. అందుకే, తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలతో ఎంతవరకు ఓపెన్ గా మాట్లాడాలి? ఎంతవరకు నిజాయితీగా అన్ని విషయాలు చెప్పాలి? వంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికీ పంచుకోకూడదు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా, మొత్తం వ్యక్తిత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మీ గొడవల్లో కలపకండి

ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవపడడం సహజం. అయితే, మీ గొడవలో పిల్లలను మాత్రం కలపకండి. పిల్లల ముందు ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి గురించి చెడుగా మాట్లాడటం లేదా అరవడం వంటివి చేయకండి. ఇది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల గొడవలో పిల్లలను కూడా లాగితే, చాలా సార్లు వారు గందరగోళానికి గురవుతారు. భయపడతారు. వారి భావోద్వేగ అభివృద్ధిపై ఇది చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది.

బంధువుల గురించి చెడుగా మాట్లాడకండి

సాధారణంగా ప్రతి కుటుంబంతో బంధువులతో సమస్యలు ఉంటాయి. కానీ ఆ విషయాలు మీ పిల్లలకు తెలియనివ్వకూడదు. వారితో బంధువుల గురించి చెడుగా మాట్లాడకూడదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ముందు బంధువుల గురించి కూడా చెడుగా మాట్లాడతారు. పిల్లలు ఈ విషయాలు వినడం వల్ల చాలా గందరగోళానికి గురవుతారు. వారికి బంధువులతో బంధం ఏర్పరచుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. వారు తమ తల్లిదండ్రుల్లాగే బంధువుల గురించి చెడుగా మాట్లాడడం అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది.

పిల్లల రూపం గురించి కామెంట్లు వద్దు

తల్లిదండ్రులు ఒక్కోసారి పిల్లలతో మాట్లాడుతూ వారి రంగు, రూపం, శరీర ఆకారం గురించి హేళనగా మాట్లాడతారు. అది వినోదం కోసమే అయినా పిల్లలు మాత్రం మనసులో పెట్టుకుంటారు. చాలా సార్లు పిల్లలు తమ రూపం గురించి చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాంటి మాటల వల్ల వారి ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోతుంది. వారు తమను తాము ఇతరులకన్నా తక్కువగా అంచనా వేసుకుంటారు. ఈ అలవాటు వారి భవిష్యత్తుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

పిల్లలకు ఒత్తిడిని ఇవ్వకండి

ఎవరైనా భవిష్యత్తు గురించి ఆలోచించడం, కొంత ఆందోళన చెందడం సహజం. పిల్లలతో కూడా దీన్ని పంచుకోవడంలో తప్పు లేదు. కానీ భవిష్యత్తు గురించి మీ ఆందోళనలు, భయాలను పిల్లలతో ఎక్కువగా షేర్ చేసుకోకండి. నిజానికి, పిల్లలు తమ తల్లిదండ్రుల భద్రత, స్థిరత్వాన్ని చూస్తారు. తల్లిదండ్రులు నిత్యం భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటే పిల్లలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు.

ఆస్తి గొడవలు చెప్పకండి

పెద్ద కుటుంబంలో గొడవలు జరగడం సహజం. సోదరుల మధ్య భూమి, ఆస్తి గొడవలు ఉంటాయి. ఇతర కుటుంబ వివాదాలు కూడా ఉంటాయి. కానీ ఈ విషయాలను పిల్లలకు తెలియనివ్వకండి. ఈ రకమైన వాతావరణం పిల్లల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులు ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుతున్నట్లు చూడటం పిల్లల మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం