వాయిదా వేయడం అనేది చిన్న సమస్యగా కనిపిస్తుంది. నిజానికి అదొక పెద్ద రోగం అని అనుకోవాలి. ఇప్పుడు చేయాల్సింది, సాయంత్రం చేద్దామనుకుంటారు. సాయంత్రం చేయాల్సింది మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. పోనీ మరుసటి రోజు అయినా చేస్తారా అంటే... అలా వారు ఒక వారం రోజులు పాటు వాయిదా వేస్తూనే ఉంటారు. అందుకే దీన్ని అలవాటు అనరు... రోగమనే పిలుస్తారు. ఇలా వాయిదా రోగం ఉన్నవారు తమను తామే వెనక్కి లాక్కుంటూ వెళతారు. రెండు అడుగుల ముందుకు వేయాల్సింది... పది అడుగులు వెనక్కి వేస్తూ పోతారు. వాయిదా వేసే అలవాటును వెంటనే వదలకపోతే మీకు వెనుకబాటే గాని ముందుకెళ్లే అవకాశం ఉండదు.
మీరు ఒక పనిని వాయిదా వేస్తున్నారు అంటే... సమయాన్ని వృధా చేస్తున్నారని అర్థం. సమయం వృధా అయితే తిరిగి రాదు. సమయాన్ని వృధా చేసే వ్యక్తి విజేతగా నిలవడం కూడా కష్టమే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఇలా అనుకుంటూ పోతే జీవితాంతం గడిపేయొచ్చు. మీరు విజేతగా నిలవాలి అనుకుంటే కచ్చితంగా వాయిదా వేసే అలవాటును ఈ క్షణమే మానేయండి.
వాయిదా వేయడానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే. మీరు ఒక పనిని వాయిదా వేస్తున్నారు. అంటే దానికి సరైన కారణం ఉండాలి. ఎలాంటి కారణం లేకుండా తర్వాత చేద్దాంలే అనుకుంటున్నారు. అంటే జీవితంలో నిర్లక్ష్యం పెరిగిపోయిందని మీకు మీరే అర్థం చేసుకోవాలి. ఆ నిర్లక్ష్యం వల్ల నష్టపోయేది మీరే. వాయిదా వేసే పద్ధతిని ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద సమస్యగా మారిపోయిందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. రెండు నిమిషాల్లో అయ్యే పనిని కూడా రెండు రోజులు పాటు వాయిదా వేస్తూ... ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. వీరందరిని మనం వాయిదా రోగులు అని పిలుచుకోవచ్చు. వీరు జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే చాలా అరుదే.
ఉదయం త్వరగా లేచి పనులు చేయాలి అనుకుంటారు. కానీ పడక మీద నుంచి లేవడం నుంచే వాయిదా పద్ధతి మొదలైపోతుంది. ఆరు గంటలకి లేవాలనుకున్నవారు ఏడు గంటలకి లేద్దాం లే అనుకుంటారు. అలా రాత్రి పడుకునే వరకు ప్రతి పని వాయిదా వేసుకుంటూ వస్తారు. కాబట్టి వాయిదా వేసే పద్ధతిని మార్చుకోవడానికి మీరు కాస్త సమయాన్ని కేటాయించాలి. దీనికి ఇది ఎంత పెద్ద సమస్యగా మారిపోయింది. అంటే చివరికి సైకాలజిస్టుల సాయం కూడా కోరాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి మీలో ఉన్న వాయిదా రోగాన్ని వదిలేయడానికి ప్రయత్నించండి.
వాయిదా వేయడం అనేది ఎక్కువ మందిలో ఎందుకు కనిపిస్తుందో కూడా మానసికవేత్తలు చెప్పారు. పనికి విలువ ఇవ్వని వారిలో, సమయం విలువ తెలియని వారిలో ఇలా వాయిదా వేసే పద్ధతి అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిలో కూడా వాయిదా వేసే అలవాటు ఎక్కువగానే ఉంది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు కూడా ప్రతి పనిని వాయిదా వేయడానికి చూస్తూ ఉంటారు. వీరంతా పరధ్యానంగా ఉంటూ ఉంటారు. దీనివల్ల ఎక్కువగా వాయిదా వేసే రోగం వస్తుంది. వాయిదా వేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. మీ ప్రోడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అన్ని విధాలా నష్టపోయేది కూడా మీరే. కాబట్టి వాయిదా వేసే జబ్బును వదిలించుకోవడానికి ప్రయత్నించండి.
పరధ్యానంగా అనిపిస్తే మానసిక నిపుణుల సాయం కోరండి. లేదా ప్రతిరోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయండి. మీకు తెలియకుండానే మీ శరీరం, మీ మనసు చురుగ్గా పనిచేస్తాయి. తద్వారా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా వేసే పద్ధతి కూడా తగ్గుతుంది. సానుకూల ఆలోచనలు, సమస్యలు పరిష్కరించుకోవాలనే నిర్ణయాలు... మీలో కలిగితేనే ఈ వాయిదా వేసే పద్ధతి తగ్గుతుంది. మీకు వాయిదా రోగం ఉన్నంతకాలం మీరు ఏది సాధించలేరు.
చాలామందికి వాయిదా వేసే అలవాటు తమను ఇబ్బంది పెడుతోందని, తమకు సమస్యలు సృష్టిస్తోందని తెలుసు. కానీ దాన్ని ఆపలేక పోతారు. ఆ అలవాటును మానలేకపోతారు. అలాంటివారు కచ్చితంగా ఎంతో కొంత వైద్య సలహాను తీసుకోవచ్చు. దీనికి మందులు వాడాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. కానీ దాన్ని పూర్తిగా తగ్గించుకోవాలంటే మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలారం పెట్టుకుని మరీ పనులు చేయాలి. ఒక వారం రోజులు ఏ పని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేసి చూడండి. ఆ రోగం నుంచి బయటికి పోతుంది.
సంబంధిత కథనం