మానవులు సామాజిక జీవులు. అంటే సమాజంలో తోటి వారితో కలిసి జీవించే వారు, కాబట్టి వారు తోటి ప్రజలతో సామరస్యంగా జీవించాలి. వీటితో పాటు కొన్ని ప్రాథమిక మర్యాదలను కూడా పాటించాలి. ఒక మనిషి ప్రవర్తనే వారిపై ప్రజల్లో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. మీరు మర్యాదగా ప్రవర్తిస్తే మీపై మంచి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. అదే మీ ప్రవర్తన అమర్యాదగా ఉంటే సమాజంలో మీకు చెడ్డ పేరు రావడం ఖాయం. మీరు మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో మంచి వ్యక్తిగా ఉండేందుకు కొన్ని పనులను చేయడం మానేయాలి.
మీరు ఎదుటి వ్యక్తికి స్నేహితుడు కాకుండా, అతడితో కేవలం పరిచయ సంబంధాన్ని మాత్రమే కలిగి ఉంటే అతడితో చాలా మితంగా, జాగ్రత్తగా మాట్లాడాలి. వారి లోపాలను వారికి నేరుగా చెప్పకూడదు. మీకు ఆ వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారితో మీ గురించి అతిగా చెప్పడం, మీకు నచ్చని విషయాల గురించి మాట్లాడడం వంటివి చేయకూడదు.
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కనిపిస్తోంది. పది మందిలో ఉన్నప్పుడు ఫోన్ ఎలా వాడాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా ఫర్వాలేదు కానీ, బయట ఉన్నప్పుడు మాత్రం కొన్ని మర్యాదలు పాటించాలి. ఉదాహరణకు, ఎవరైనా ఒక ఫోటోను చూపించడానికి మీకు ఫోన్ ఇస్తే ఆ ఫోటో చూసి తిరిగిచ్చేయాలి. అంతే కానీ తరువాత ఫోటోకు స్క్రోల్ చేయడం మర్యాద కాదు. మీరు ఇతర ఫోటోలను చూడాలనుకుంటే, మొదట వారి పర్మిషన్ అడగండి, తరువాత మాత్రమే స్క్రోల్ చేయండి.
మీ ఎదురుగా ఉన్న వ్యక్తి మరొకరితో ఫోన్ మాట్లాడాక, మీకు ఎవరు ఫోన్ చేశారు? ఏం జరిగింది? వంటి వివరాలను అతడిని అడగవద్దు. ఇలా అడగడం మర్యాద కాదు. అతను చెప్పేవరకు ఫోన్లో ఎవరు మాట్లాడారో అడగకూడదు. ఇతరుల ఫోన్లోకి తొంగి చూడటం కూడా మంచిది కాదు. ఇది వారి గోప్యతపై దాడి చేసినట్టే లెక్క.
ఇతరుల విషయాలు వేరే వారి దగ్గర మాట్లాడడం, గాసిప్స్ మాట్లాడడం వంటివి మంచిది కాదు. ఈ అలవాటును వెంటనే మానేయండి. ఇతరుల గురించి గాసిప్స్ ఎక్కువగా మాట్లాడే అలవాటు కారణంగా, ప్రజలు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.