Dondakaya Pachi karam: దొండకాయ పచ్చి కారం ఇలా చేశారంటే అన్నం చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్, రెసిపీ ఇదిగో
Dondakaya Pachikaram: దొండకాయ కూర నచ్చని వారికి కూడా ఇలా వండితే నచ్చేస్తుంది. దొండకాయ పచ్చికారం మేము చెప్పిన విధంగా ఉండి చూడండి. రెసిపీ కూడా చాలా సులువు.
దొండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని ఇష్టంగా తినే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి దీన్ని సరైన పద్ధతిలో వండితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము దొండకాయ పచ్చికారం రెసిపీ ఇచ్చాము. దీన్ని ఇక్కడ ఇచ్చిన రెసిపీలో చెప్పినట్టు వండితే అన్నం చపాతీల్లోకి ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. దొండకాయ పచ్చి కారం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

దొండకాయ పచ్చికారం రెసిపీకి కావలసిన పదార్థాలు
దొండకాయలు - పావు కిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం ముక్క - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - పది
పచ్చిమిర్చి - ఆరు
కొత్తిమీర తరుగు - ఐదు స్పూన్లు
నూనె - మూడు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
పెరుగు - పావు కప్పు
నీళ్లు - అర గ్లాసు
కసూరి మేతి - అర స్పూను
పెరుగు - పావు కప్పు
దొండకాయ పచ్చి కారం రెసిపీ
1. దొండకాయ పచ్చి కారం కూర వండేందుకు దొండకాయలను నిలువుగా నాలుగు ముక్కలుగా చేసుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను, అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను, కొత్తిమీరను వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. పచ్చికారం రెడీ అయినట్టే.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. అందులో జీలకర్ర, కరివేపాకులు వేసి వేయించాలి.
5. అవి వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చికారాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
6. రెండు నిమిషాల పాటు దాన్ని వేయించాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి.
8. రెండు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
9. ఇప్పుడు దొండకాయలు ఉడకడానికి సరిపడా అర గ్లాసు నీటిని వేసి బాగా ఉడకనివ్వాలి.
10. దొండకాయలు ఉడికిన తర్వాత పెరుగును కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి.
11. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పైన కసూరి మేతిని చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
12. అంతే టేస్టీ దొండకాయ పచ్చి కారం రెసిపీ రెడీ అయినట్టే.
13. ఈ కూర ఇగురులాగా వస్తుంది. కాబట్టి అన్నంలో కలుపుకునేందుకు వీలుగా ఉంటుంది.
14. అలాగే చపాతీ రోటీలతో తిన్నా కూడా కాంబినేషన్ అదిరిపోతుంది.
వారానికి ఒకటి రెండుసార్లు దొండకాయలు తినడం ఎంతో ఆరోగ్యకరం. దొండకాయలో మన శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ఫైబర్, విటమిన్ బి1, విటమిన్ బి2, ఐరన్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దొండకాయను కూరలా వండుకొని తినడం వల్ల ఈ పోషకాలు అన్ని శరీరానికి అందుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి కూడా దొండకాయకి ఉంది. డయాబెటిస్ ఉన్నవారు దొండకాయలను రెండు మూడు రోజులకు ఒకసారి తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దొండకాయను ఎంత తిన్నా కూడా కొవ్వు చేరదు. కాబట్టి బరువు తగ్గే ప్రయాణంలో ఉన్నవారు దొండకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. గుండె సమస్యలు, పొట్ట సమస్యలతో బాధపడేవారు కూడా దొండకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.
సంబంధిత కథనం