Life Span: ప్రతిరోజూ ఈ సింపుల్ పని చేయడం వల్ల మీ ఆయుష్షును మరో పదకొండేళ్లు పెంచుకోవచ్చు
Life Span: మీరు రోజూ చేసే ఒక చిన్న పని మీ ఆయుష్షును ఎంతో పెంచుతుంది. ఆ చిన్న పని కష్టమైనదేమీ కాదు. అదే నడక. ప్రతి రోజూ కిలోమీటర్ నడవండి చాలు. మీకు ఎంతో మేలు జరుగుతుంది.
ఆయుష్షు పెంచుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు… చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా దాన్ని సాధించవచ్చు. వ్యాయామం చేయకుండా గంటలు గంటలు ఒకే దగ్గర కూర్చుని లేదా పడుకుని ఉండడం వల్ల ఆరోగ్యంపై ఎంతో చెడు ప్రభావం పడుతుంది. శారీరక నిష్క్రియాత్మకత అంటే కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల అంచనా వేసిన దానికంటే ఎక్కువే నష్టమే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నలభై ఏళ్లు దాటిన వారు ప్రతి రోజూ చిన్న పని చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుని తమ ఆయుష్షును మరో పదకొండేళ్లు పెంచుకుంటారని తాజా అధ్యయనం తేల్చింది.
ఆయుష్షు పెంచే వ్యాయామం
వ్యాయామం అనగానే ఎంతో కష్టపడాలేమో అనుకోకండి వారంలో కనీసం 150 నుండి 300 నిమిషాల వరకు ఏదైనా శారీరక శ్రమ చేయండి చాలు. అది మీలో ఎంతో మార్పును తెస్తుంది. మీకు దీర్ఘాయువును అందిస్తుంది. ప్రతిరోజూ అరగంట పాటూ నడిచినా చాలు మీ ఆయుష్షు పెరగడం ఖాయమని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించిన కొత్త అధ్యయనం తెలిపింది.
ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో పాటూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. నడక, తేలికపాటి వ్యాయామం, శారీరక శ్రమ ప్రయోజనాలపై వీరు పరిశోధించారు. వీటి వల్ల మునుపటి అంచనాల కన్నా ఎక్కువే ప్రయోజనాలు ఉన్నాయని తేల్చింది.
నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ కు చెందిన పరిశోధకులు 2017 మరణాల డేటాను విశ్లేషించారు. 40 ఏళ్లు పైబడిన 36,000 మందికి పైగా అమెరికన్లకు చెందిన శారీరక శ్రమ స్థాయిలను 2003 నుండి 2006 వరకు విశ్లేషించారు. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే నుండి ఈ డేటాను సేకరించారు. శారీరక శ్రమ ఆయుర్దాయాన్ని ఎంతవరకు తగ్గించిందో లేదా పెంచిందో వారు పరిశీలించారు.
వారి పరిశీలనలో అత్యంత ఆసక్తికరమైన ఫలితాలు బయటికి వచ్చాయి. వ్యాయామం చేయని వ్యక్తుల ఆయుర్దాయం తక్కువగా ఉంటోందని గుర్తించారు. ఎవరైతే తేలిక పాటి వ్యాయామాలు, నడక వంటివి చేస్తారో వారు ఎక్కువ కాలం జీవించినట్టు గుర్తించారు. తక్కువ చురుకుగా ఉన్నవారు తమ వ్యాయామాన్ని చురుగ్గా మారిస్తే వారు మరో 11 సంవత్సరాల జీవితాన్ని పొందుతారు.
వ్యాయమంతో పాటూ ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తింటూ ఉండాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ఆహారాలు తినకుండా ఉంటే మంచిది. జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉండాలి.
ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ కచ్చితంగా తినాలి. తెల్లన్నాన్ని తగ్గించడం మంచిది. మైదాతో చేసే ఆహారాన్ని పూర్తిగా మానేయడం అన్ని విధాలా ఉత్తమం.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం అందించడం కోసమే ఇచ్చాము. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి వైద్య పరిస్థితి గురించి సందేహాలు ఉన్నా వైద్యుడి సలహా తీసుకోండి)