Puffy Face: ఉదయం లేచాక మీ ముఖం ఉబ్బినట్టు కనిపిస్తోందా? దానికి కారణం ఇదే, జాగ్రత్తపడండి
Puffy Face: కొంతమందికి నిద్రపోయి లేచాక ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. కంటి కింద చర్మం ఉబ్బినట్టు అవుతుంది. దీనికి కారణం వారి శరీరంలో కార్టిసాల్ హార్మోన్స్ స్థాయిలు పెరగడమేనని చెబుతున్నారు వైద్యులు.
Puffy Face: కొంతమంది ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఇలా ముఖ వాపుకు కారణమేమిటో ఎవరూ ఆలోచించరు. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. నిజానికి ఉబ్బిన ముఖానికి కారణం వారి శరీరంలో కార్టిసాల్ హార్మోన్స్ స్థాయిలో పెరగడమే. శరీరంలో ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కార్టిసాల్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. ఒత్తిడికి ప్రతిస్పందనగా అడ్రినల్ గ్రంధులు ఉత్పత్తి చేసే హార్మోనే కార్టిసాల్. వివిధ శారీరక విధులకు తక్కువ స్థాయిలో ఈ హార్మోన్ అవసరం. అయితే దీర్ఘకాలికంగా ఇది ఎప్పుడూ అధిక స్థాయిలో విడుదలవుతుందో అది ‘కుషింగ్స్ సిండ్రోమ్’ కి కారణం అవుతుంది. ఈ సిండ్రోమ్ వల్లే ముఖంలో వాపు కనిపిస్తుంది. శారీరకంగా కూడా ఎన్నో మార్పులు కనిపిస్తాయి.
ముఖం ఎందుకు ఉబ్బుతుంది?
శరీరంలో కార్టిసాల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల శరీరంలోని సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ముఖంలోని కణజాలాల్లో నీరు నిలిచిపోతుంది. దీనివల్లే ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖం, మెడ ప్రాంతంలో ఈ వాపు కనిపిస్తుంది. కార్టిసాల్ హార్మోను అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మంలోని కొల్లాజెన్ బలహీనమవుతుంది. కొల్లాజెన్ అనేది చర్మ నిర్మాణాన్ని అవసరమయ్యే ప్రోటీన్. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ తగ్గుతుందో ముఖం గుండ్రంగా ఉబ్బినట్టు కనిపిస్తుంది.
శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతుందని చెప్పడానికి శరీరం కొన్ని రకాల సంకేతాలను చూపిస్తుంది. ముఖ్యంగా ముఖంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖం గుండ్రంగా తయారవుతుంది. చర్మం పలుచబడి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖం జిడ్డుగా మారిపోతుంది. మొటిమలు కూడా వస్తాయి. ముఖంపై జుట్టు పెరగడం మొదలవుతుంది. ఇవన్నీ కూడా కార్టిసాల్ వల్ల జరిగే మార్పులే.
టెస్టులు ద్వారా
కొన్ని పరీక్షల ద్వారా మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్లు కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతుందేమోనని వైద్యులు తెలుసుకుంటారు. మూత్రంలో కార్టిసాల్ స్థాయిలను కొలుస్తారు. అలాగే సాయంత్రం సమయంలో నోట్లోని లాలాజలంలో కార్టిసాల్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. రక్తంలో కూడా కార్టిసాల్ స్థాయిలను కొలుస్తారు. దీన్ని బ్లడ్ కార్టిసాల్ టెస్ట్ అంటారు. దానికి తగిన చికిత్సను సూచిస్తారు.
చికిత్స ఎలా
కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి. అలాగే అదనపు కార్టిసాల్ ఉత్పత్తి అవ్వడానికి కారణం అయ్యే కణితులను కూడా శాస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. కొన్నిసార్లు రేడియేషన్ కూడా అందిస్తారు.
ఇతర కారణాలు
ముఖం ఉబ్బినట్టు కనిపించడానికి కార్టిసాల్ హార్మోను అధికంగా ఉత్పత్తి అవ్వడం ఒక్కటే కారణం కాదు. హైపోథైరాయిడిజం, అలర్జీలు, కిడ్నీ వ్యాధులు, కాలేయ వ్యాధులు వంటి వాటికి కూడా ముఖం ఉబ్బడం ఒక సంకేతమే. స్టెరాయిడ్స్ వంటి మందులు వాడడం వల్ల కూడా ఇలా ముఖం ఉబ్బే అవకాశం ఉంది.
టాపిక్