మొటిమలు.. చాలా మంది టీనేజర్లు, యువతీ యువకులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య! మొహం మీద చిన్న మొటిమ కనపడితే చాలు చిరాకు పడుతుంటారు. సమస్య తీవ్రమైతే రకరకాల క్రీములు, మందుల కోసం ఎగపడతారు. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మొటిమలకు కారణం కేవలం దుమ్ము, ధూళి, లేదా హార్మోన్ల మార్పులు మాత్రమే కావు. అందిరి లైఫ్‌లో ఉండే మరొక సైలెంట్ విలన్ కూడా అయి ఉండచ్చు. అదే ఒత్తిడి! అవును, మీరు విన్నది నిజమే. మనం రోజూ ఫేస్ చేసే టెన్షన్లు, ఆందోళనలు మొటిమల రూపంలో మన అందాన్ని పాడుచేయగలవు. ఈ ఒత్తిడికి, మొటిమలకు ఉన్న సంబంధం ఏంటి? టెన్షన్లు పెరిగితే మొటిమలు పెరుగతాయా? వంటి విషయాలను తెలుసుకునే ప్రయ్నతం చేద్దాం రండి.
ఒత్తిడి నేరుగా మొటిమలను సృష్టించకపోయినా, మన శరీరంలో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ గందరగోళం వల్ల మొటిమలు ఏర్పడతాయి, ఉన్న మొటిమలు మరింత పెద్దగా, ఎర్రగా మారతాయి ఇది ఎలా జరుగుతుందంటే..
మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరం కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను (హార్మోన్లు) విడుదల చేస్తుంది. అంటే అది పరీక్షల టెన్షన్, ప్రేమలో విఫలం, కుటుంబ కలహాలు ఇలా ఏదైనా సరే, మన మెదడు ఒక అలారం మోగిస్తుంది. దీని ఫలితంగా మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు (హార్మోన్లు) విడుదలవుతాయి. వీటిలో ముఖ్యమైనవి కార్టిసాల్ అనే స్టెరాయిడ్ హార్మోన్. దీన్ని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. అలాగే ఆండ్రోజెన్స్ అనే మరికొన్ని హార్మోన్లు కూడా విడుదలవుతాయి (ఇవి సాధారణంగా పురుషుల్లో ఎక్కువ ఉంటాయి, స్త్రీలలో కూడా ఉంటాయి కానీ తక్కువగా). ఈ హార్మోన్లు మన చర్మంపై చాలా ప్రభావం చూపుతాయి. వీటి కారణంగా..
ఒత్తిడి వల్ల విడుదలైన కార్టిసాల్, ఆండ్రోజెన్స్ హార్మోన్లు నేరుగా మన చర్మంలోని నూనె గ్రంథులపై పనిచేస్తాయి. ఈ గ్రంథులు ఎక్కువ మొత్తంలో నూనెను (సీబమ్) ఉత్పత్తి చేసేలా చేస్తాయి. మామూలుగా కొద్దిగా నూనె చర్మానికి మంచిదే, కానీ ఇది ఎక్కువైతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. రంధ్రాలు మూసుకుపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, దీనివల్ల మొటిమలు వస్తాయి.
ఒత్తిడి మన శరీరం అంతటా ఒక రకమైన వాపును (ఇన్‌ఫ్లమేషన్) కలిగిస్తుంది. ఇది చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న మొటిమలు ఈ వాపు కారణంగా మరింత ఎర్రగా, ఉబ్బినట్లుగా మారతాయి. కొన్నిసార్లు నొప్పికి కూడా కారణమవుతాయి.అంతేకాకుండా ఒత్తిడి వల్ల సైటోకిన్లు అనే చిన్న ప్రోటీన్లు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. ఈ ప్రోటీన్లు నూనె గ్రంథుల చుట్టూ వాపును మరింత పెంచి, మొటిమల సమస్యను ఎక్కువ చేస్తాయి.
మన చర్మానికి ఒక సహజమైన రక్షణ పొర ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, ఇతర క్రిముల నుండి మనల్ని కాపాడుతుంది. ఒత్తిడి వల్ల విడుదలయ్యే హార్మోన్లు ఈ రక్షణ పొరను బలహీనపరుస్తాయి. దీనివల్ల మొటిమలు కలిగించే బ్యాక్టీరియా సులభంగా చర్మంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఫలితంగా మొటిమలు వస్తాయి.
ఒత్తిడి కేవలం మొటిమలు రావడానికి లేదా ఎక్కువ కావడానికి మాత్రమే కారణం కాదు, వాటిని నయం చేసే ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. ఒత్తిడి హార్మోన్లు చర్మ కణాల పునరుత్పత్తిని తగ్గిస్తాయి. దీనివల్ల మొటిమలు ఎక్కువ కాలం ఉంటాయి, మచ్చలు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు మన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తాం. ఇది కూడా మొటిమల సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఎలాగంటే
ఒత్తిడి అందరిలో ఒకేలా మొటిమలను కలిగించదు. ఇది ఒక్కొక్కరి శరీరం, జన్యువులు, ఒత్తిడిని ఎదుర్కొనే విధానంపై ఆధారపడి ఉంటుంది. అయితే మొటిమలను తగ్గించుకోవాలి అనుకునే వారు ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామంలతో పాటు సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. మొటిమలు ఎక్కువగా ఉంటే తప్పకుండా చర్మ వైద్యుడిని సంప్రదించండి.
సంబంధిత కథనం