Knee pains: నిలబడి నీళ్లు తాగితే మోకాళ్లు నొప్పులు పెరిగిపోతాయా? ఇదెంత వరకు నిజం
Knee pains: నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్లు దెబ్బతింటాయని కొంతమందిలో అపోహ ఉంది. దీన్ని కొంతమంది నిజమని నమ్మితే , మరికొందరు అది కేవలం అపోహ అని మాత్రమే అంటారు. ఇందులో నిజనిజాలని వైద్యులు వివరిస్తున్నారు.
మన జీవితంలో నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించగలం కానీ, నీరు లేకుండా ఒక రోజు గడపడం చాలా కష్టం. నీరు మన అవసరం మాత్రమే కాదు, జీవం కూడా. నీరు ఎలా పడితే అలా తాగితే ఆరోగ్యం కాదు, సరిగా తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
భోజనం తిన్న వెంటనే కానీ, తింటున్నప్పుడు మధ్యలో కానీ నీళ్లు తాగకూడదు. ఇది ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి కాదని చెబుతారు. అలాగే నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదకరమని అంటారు. అలా తాగడం వల్ల మోకాళ్లపై చెడు ప్రభావం పడుతుందని, చాలా త్వరగా బలహీనపడతారని కొందరు చెబుతుంటారు. ఈ విషయాన్ని కొంతమంది నమ్మితే, మరికొందరు అంతా అపోహ అని కొట్టి పడేస్తారు. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతారో తెలుసుకుందాం.
నిలబడి నీళ్లు తాగడం ప్రమాదమా?
నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు నేరుగా మోకాళ్లు, కీళ్లకు చేరుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతారు. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నిలబడి నీరు తాగడం వల్ల మోకాలి లేదా కీళ్ల నొప్పులు వస్తాయని వైద్య శాస్త్రంలో ఎటువంటి ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, మనం ఏది తిన్నా, త్రాగినా నేరుగా ఆహార గొట్టం ద్వారా పొట్టకు చేరుతుంది. అక్కడ నుండి జీర్ణక్రియ లేదా వడపోత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, నిలబడి నీరు త్రాగటం ద్వారా, నీరు మోకాళ్ళు లేదా కీళ్ళలోకి నేరుగా వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి నిలబడి నీళ్లు తాగడానికి, మోకాలి నొప్పులకు సంబంధం లేదని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే, నీరు తాగేటప్పుడు మాత్రం గాభరా పడకుండా సౌకర్యంగా, నెమ్మదిగా త్రాగడం ఆరోగ్యకరం.
మన శరీరానికి నీరు త్రాగటం ఎంత ముఖ్యమో, నీరు సరిగ్గా త్రాగటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి నీరు త్రాగేటప్పుడు మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా సరైన మొత్తంలో నీరు త్రాగాలి. రోజూ మూడు లీటర్ల నీరు తాగడం మన శరీరానికి చాలా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటిని రోజూ తక్కువగా తాగడం ప్రమాదమే, అలాగే మరీ ఎక్కువ పరిమాణంలో తాగినా హానికరమే. నీరు సరిపడినంత తాగితేనే ఆరోగ్యం. నీరు సిప్ చేస్తూ తాగాలి.
ఆయుర్వేదం ప్రకారం
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం భోజనం తినడానికి అరగంట ముందు నీరు తాగాలి. మధ్యలో తాగకూడదు. తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి. వీటితో పాటు ఉదయం, రాత్రి పరగడుపున పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
టాపిక్