Smoking: చలికాలంలో స్మోకింగ్ చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందా?
Smoking: చలికాలంలో ధూమపానం గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. దీని పొగలో ఉండే రసాయనాలు ఇప్పటికే ఇరుకైన రక్త నాళాలను దెబ్బతీస్తాయి, దీనివల్ల ప్లేట్లెట్స్ పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది.
వాతావరణం చల్లబడుతున్న కొద్దీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. శరీరం చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు ఎంతో కష్టపడుతుంది. ఎలాంటి చెడు అలవాట్లు లేనివారు కూడా చల్లని వాతావరణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.చల్లని వాతావరణం గుండె వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. రక్తపోటు పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని పంప్ చేసేందుకు ఎంతో కష్టపడుతుంది. గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇలా గుండెపై అదనపు ఒత్తిడి పడడం ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి చలికాలంలో గుండెను ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
చలికాలంలో గుండె పోటు బారిన పడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, గతంలో గుండెపోటుకు ఒకసారి గురైన వారు, ముసలివారు, డయాబెటిస్ రోగులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
స్మోకింగ్ చేసేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి గుండె పోటు వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చలికాలంలో ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అధిక మద్యపానం వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీలైనంత వరకు మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉంటే ఎంతో మంచిది.
చలికాలంలో గుండె జబ్బులే కాదు శ్వాసకోశ వ్యాధులు కూడా అధికంగా వస్తాయి. ఎన్నో రకాల అంటువ్యాధులకు ఇది కారణం అవుతుంది. చలికాలంలో తగ్గిన ఉష్ణోగ్రతలు నేరుగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఎండాకాలం, వానాకాలంతో పోలిస్తు చలికాలంలోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇది గుండెకు, ఇతర అవయవాలకు రక్తాన్ని పంప్ చేసే శక్తి తగ్గిపోతుంది. గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటించండి. ప్రతిరోజూ కనీసం అరగంట పాటూ వ్యాయమం చేయాలి. అలాగే తగినంత నిద్రపోండి. రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకూడదు. ఉప్పును పూర్తిగా తగ్గించాలి. ఒత్తిడి స్థాయిలు తగ్గించుకుని యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)